
సాధారణ జలుబుకు వేలకు వేలు ఫీజులుగా లాక్కుంటున్నారు. ప్రభుత్వ వైద్యుడే ప్రైవేటు ఆసుపత్రి యజమానిగా దోపిడీకి పాల్పడుతున్నాడు. బిపి తెలుసుకోవడానికి వస్తే, బలవంతంగా సెలైను, ఇంజెక్షన్ ను డాక్టర్లు ఎక్కిస్తున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన దళిత యువకుడిపై ఏకంగా డాక్టర్ భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆగ్రహించిన స్ధానికులు ధర్నా నిర్వహించారు. విధిలేని పరిస్ధితుల్లో డాక్టర్ పై పోలీసులు అ్రటాసిటీ కేసు నమోదు చేశారు. అధికార పార్టీ అండతో బాధితులపైనే డాక్టర్ కౌంటర్ కేసు పెట్టారు. ఇన్ని అంశాలకు కేంద్రంగా బిఎస్ఎ నర్సింగ్ హామ్ వ్యవహరిస్తోంది. ఈ ఆసుపత్రిలో దోపిడీ, దౌర్జ్యానాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఐక్య వేదిక ఏర్పడి ధనదాహ డాక్టర్లకి వ్యతిరేకంగా కార్యాచరణను రూపొందించుకుంది. అందుకే బిఎస్ఎ నర్సింగ్ హామ్ ఆసుప్రతి నిర్వాకాలను ప్రజల ముందరకు తీసుకు వస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని నింపడానికి ఈ కరపత్రం ప్రజా సంఘాల ఐక్య వేదిక వేసింది.
చిత్తూరు జిల్లా, కేవీపల్లె మండలం, మహల్ క్రాస్ లో మే 31వ తేదీ బిపి చూపించడం కోసం వి. సిద్ధమ్మ (60 సంవత్సరాలు) బిఎస్ఎ ప్రవైటు నర్సింగ్ హోమ్ కు వచ్చింది. ఈ ఆసుప్రతిని ప్రభుత్వ డాక్టరు అయిన డాక్టర్ అజాజ్ అహ్మదే నడుపుతున్నాడు. ఆమె తనతో పాటు తోడుగా తన అక్క కొడుకును తీసుకువచ్చింది. ఆమె 100 రూపాయలు చేతిలో పెట్టుకుని వచ్చింది. బిపి చూసిన డాక్టర్ అజాజ్ అహ్మద్ బిపి తక్కువ వుందని చెప్పాడు. దానికి ఆహారంలో కొంచెం ఉప్పు, కారం తీసుకుంటే సరిపోతుంది. తిరిగి వెళ్లిపోతున్న సిద్దమ్మకు బలవంతంగా డాక్టర్ సెలైను ఎక్కించి, 1200 రుపాయలు కట్టమన్నాడు. సెలైన్ బాటిల్ ఎందుకు పెట్టాల్సివచ్చిందని అప్పుడే వచ్చిన సిద్ధమ్మ కొడుకు వెంకటేష్ డాక్టర్ ను ప్రశ్నించాడు. ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని డాక్టర్ అజాజ్ అహ్మద్, అతని కొడుకు ముఖీమ్ అహ్మద్ ఇద్దరూ కలిసి దళితుడైన వెంకటేష్ ను అన్యాయంగా కొట్టారు. అతని చొక్కా, ప్యాంటును చింపేశారు. అక్కడే వున్న ఇతర పేషెంటు బందువులు అడ్డుపడడంతో వెంకటేష్ చిన్నపాటి దెబ్బలతోనే బయటపడ్డాడు. ఈవిధంగా బిఎస్ఎ ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో జరగడం మొదిటసారి కాదు. సంఘటన జరిగిన వెంటనే సుమారు 100 మంది స్ధానికులు డాక్టర్ దుందుడుకు వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టరు, అతని కుమారునిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టరు చేశారు. తనపై కేసు నమోదు చేశారని తెలుసుకున్న డాక్టరు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరుసటి రోజు బాధితులపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. సిద్దమ్మ, వెంకటేషు, వారి బంధువులతో కలిసి తనపై, తన ఆసుపత్రిపై దాడి చేశారని, ఆస్ధులను ధ్వంసం చేశారని డాక్టర్ అజాజ్ అహ్మద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
డాక్టర్ అజాజ్ అహ్మద్ తండ్రి కె. సర్దార్ ఖాన్ పక్షపాతం, మూర్ఛ వ్యాధి గ్రస్ధులను నయం చేయడంలో ఈ ప్రాంతంలో ప్రసిద్ది గాంచాడు. అతనే బిఎస్ఎ నర్సింగ్ హోమ్ ను స్ధాపించాడు. అతని తదనంతరం ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ అజాజ్ అహ్మద్ ఈ ఆసుపత్రిని చట్ట విరుద్దంగా నిర్వహిస్తున్నాడు. ఇతని హయాంలోనే ఈ ఆసుపత్రి రోగులను దోచుకుంటుందనే అపవాదును మూటగట్టుకుంది. ప్రభుత్వ ఆసుప్రతులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు గత్యంతరం లేక ఈ ఆసుపత్రికి వచ్చేవారు. ప్రస్తుతం కలకడ మండలం, ఎర్రకోట పల్లి, మహల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను ఇతనే బిఎస్ఎ ఆసుపత్రికి రావాలని సూచించేవాడు. ఆ విధంగా పేద రోగుల దగ్గర డబ్బులు దోచుకుంటూ కోట్లకు పడగ లెత్తాడు. ఈ విషయం స్ధానికులను ఎవరు అడిగినా చెపుతారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రభుత్వ మందులను తన క్లినిక్ లో ఎక్కువ ధరకు అమ్ముతాడని స్ధానికులు చెపుతారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తే ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. ఇదేమని ప్రశ్నించిన రోగులను దుర్భాషలాడటం, వారిపై భౌతికదాడులకు పాల్పడటం డాక్టర్ అజాజ్ కు రివాజుగా మారింది.
పల్స్ పోలియా లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లోను ఇతను పాల్గొనకుండా తన స్వంత బిఎస్ఎ క్లినిక్ కే పరిమిత మయ్యేవాడు. ప్రవర్తనను మార్చుకొమ్మని డాక్టర్ అజాజ్ అహ్మద్ ను పై అధికారులు పలుమార్లు మందలించారు. అయినా డాక్టరు గారి వైఖరి మారలేదు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకున్నా ఇతను అడ్డుగా వుంటున్నాడని స్ధానికులు చెపుతారు. మహల్ క్రాస్ లోనే ప్రభుత్వ స్ధలంలో సొంత ఇల్లు కట్టుకున్నాడు. తన తమ్ముుడుకు అధికార పార్టీతో సత్సంబంధాలు వుండటంతో ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఇతని పై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. అంతేగాకుండా బిఎస్ఎ ప్రైవేటు ఆసుపత్రిలో నిషేధిత యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడుతున్నట్టు డాక్టరుపై ఆరోపణలు వున్నాయి. జ్వరానికి కూడా ఇంజెక్షన్లు, యాంటిబయాటిక్స్, వేలకు వేలు ఫీజులు వసూలు చేయడం ఇతని స్పెషాలిటి. అనుభవం, అర్హత లేని వారిని సిబ్బందిగా నియమించుకోవడంతోను ఇతను ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.
వైద్యో నారాయణో హరి అనేది నానుడి. అంటే వైద్యుడు సాక్షాత్తు దేవుడితో సమానం. కాని డాక్టర్ అజాజ్ అహ్మద్ వైద్యం పేరుతో రోగులను దోచుకోవడంలో దిట్టగా పేరుమోసాడు. అధిక ఫీజులను దండుకోవడం, హైపవర్ యాంటిబయాటిక్స్ వాడటం, ప్రశ్నించిన పేద రోగులను తిట్టడం, కొట్టడంలో పేరుమోశాడు. ఇతని అన్యాయాలను ఇప్పటివరకు సహించిన ప్రజలు తాజా సంఘటనతో తీవ్ర ఆగ్రహావేశాలతో వున్నారు. ఈ నేపధ్యంలో ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలు, విద్యార్ధి సంఘాలు కలిసి ఐక్యంగా ప్రజాసంఘాల ఐక్యవేదికను ఏర్పాటు చేశాయి. 6.6.2020 వతేదీన ఉదయం 10 గంటలకు మహల్ బిఎస్ఎ ఆసుప్రతి ఎదుట ఐక్య వేదిక ఆధ్వర్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన జరుగుతుంది.
డిమాండ్స్
1 దళితుడు వెంకటేష్ పై దాడికి పాల్పడిన డాక్టర్ అజాజ్ అహ్మద్, అతని కొడుకు ముఖీమ్ అహ్మద్ద్ ను వెంటనే అరెస్టు చేయాలి.
2. ప్రభుత్వ వైద్యాధికారి అయివుండి స్వంత ప్రైవేటు బిఎస్ఎ ఆసుపత్రిని నడుపుతున్న డాక్టర్ అజాజ్ అహ్మద్ ను ప్రభుత్వ విధుల నుండి తొలగించాలి. అతని అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలి.
3. ఎన్నో అ్రకమాలకు, అరాచకాలకు పాల్పడుతున్న బిఎస్ఎ ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయాలి.
4. డాక్టర్ అజాజ్ అహ్మద్ బాధితులపై పెట్టిన తప్పుడు కౌంటర్ కేసును పోలీసులు ఎత్తివేయాలి.
5. జిల్లాలో ప్రభుత్వ వైద్యులు అక్రమంగా నడుపుతున్న అన్ని ప్రైవేటు ఆసుప్రతుల గుర్తింపును రద్దు చేయాలి. సదరు ప్రభుత్వ వైద్యులను విధుల నుండి తొలగించాలి.
- ప్రజాసంఘాల ఐక్య వేదిక, చిత్తూరు జిల్లా
(1. పౌరహక్కుల సంఘం (సిఎల్ సి) 2. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) 3. కుల వివక్ష పోరాట సమితి (కెవిపిఎస్) 4. మాల మహానాడు (ఎమ్ఎమ్ఎన్) 5. భారతీయ అంబేద్కర్ సేన (బాస్) 6. బహుజన సమాజ వాద పార్టీ (బిఎస్ పి) 7. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) 8. దళిత సంఘర్షణ సమితి (డిఎస్ఎస్) 9. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్ఆర్ పిఎస్) 10. ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పికెఎస్) 11. రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్ఎస్ఎఫ్) 12. సిడిఆర్ఎస్ స్వచ్ఛంద సంస్ధ 13. నవసమాజ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) 14. దళిత బహుజన పార్టీ ( డిబిపి)
Comments
Post a Comment