సామాజికమార్పు గురించిన చర్చల్లో తరచుగా మానవ ప్రవృత్తి గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. హింసాదౌర్జన్యాలు లేకుండా మనుషుల మధ్య పరస్పరసహకారం ప్రాతిపదికగా మనుగడ సాగించే సమాజం ఎప్పటికీ ఒక ఆకాంక్ష గా, ఆదర్శంగా ఉండాల్సిందే కానీ వాస్తవరూపం ధరించలేదనీ మానవప్రవృత్తిలొనే ఉన్న స్వార్థం వల్ల అటువంటి సమాజం మనుగడ అసాధ్యం అనే వాదన ఉంది. మరికొంతమంది మొదట మానవ ప్రవృత్తి మారాలనీ అప్పుడే సమ సమాజ నిర్మాణం, దాని మనుగడ సాధ్యపడగలవని అభిప్రాయపడతారు. ఇలా సామాజిక మార్పు గురించిన చర్చల్లో మానవ ప్రవృత్తికి ముఖ్యమైన స్థానమే ఉన్నది. కాబట్టి సామాజిక మార్పు కోసం కార్యాచరణలో ఉన్నవారు ఈ విషయంలో ఒక స్పష్టత ఏర్పరచుకోవలసి ఉంది.
సమాజంలో మానవ ప్రవృత్తి గురించి తరచుగా నిందాపూర్వకంగా మాట్లాడుకుంటున్నప్పటికీ అదే సమయంలో మానవత్వం అంటే మాత్రం ఉదాత్తమైన విషయంగా భావిస్తాం. అయితే మానవత్వం మానవ ప్రవృత్తికి అతీతమైనదేమీ కాదు. మానవ ప్రవృత్తిలో ఉదాత్తమైన లక్షణాల సముదాయాన్ని మానవత్వంగా వ్యవహరిస్తారు. మనం ఉదాత్తంగా భావించే లక్షణాలైనా నీచమైనవిగా భావించే లక్షణాలయినా అన్నీ మానవ ప్రవృత్తిలోభాగంగానే ఉన్నాయని గ్రహించాల్సి ఉంది. ఇంత వైవిధ్యంతో కూడుకొన్న లక్షణాలు మానవ ప్రవృత్తిలో ఎలా భాగమయ్యాయో అర్థం చేసుకోవాలంటే మానవజాతి రూపుదిద్దుకున్న పరిణామ క్రమాన్ని పరిశీలించాలి. ఎందుకంటే మానవ శరీర నిర్మాణమైనా ప్రవృత్తి అయినా ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే.
ఈ విశ్వము నిరంతరం మార్పుకు లోనవుతూనే ఉంటుంది. అందులో భాగంగా భూమి మీద ఉన్న భౌగోళిక, శీతోష్ణ, వాతావరణ ఇతరత్రా భౌతిక పరిస్థితులన్నీ కూడా నిదానంగానే అయినా నిరంతరం మారుతూ ఉంటాయి.ఏ జీవి అయినా ఒక నిర్దిష్టమైనభౌతికపరిస్థితుల్లో జీవించడానికి అవసరమైన సామర్థ్యంతోనే జన్మిస్తుంది. ఈ సామర్థ్యం తన DNAలో మరో విధంగా చెప్పాలంటే జీన్స్ లో నిక్షిప్తం అయి ఉంటుంది. కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం మారుతూనే ఉంటాయి. మారే పరిస్తితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడం కొంతవరకే సాధ్యం. కనుక నిరంతరం మారే ప్రపంచంలో మరణం లేని జీవితం ప్రకృతి నియమాలకు విరుద్ధం అవుతుంది. అందువల్ల క్రొత్తపరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం గల రాబోయే తరాలకు చోటిస్తూ జీవులు నిష్క్రమించడం ప్రకృతి నియమం. అలాంటి కొత్తసామర్థ్యాలను సంతరించుకోలేని జీవరాసులు కాలగమనంలో కనుమరుగవక తప్పదు. కనుక ఏ జీవి అయినా ఆపదల నుండి తనను తాను కాపాడుకొని తన జీన్స్ సామర్థ్యం మేరకు గరిష్టకాలం జీవితం కొనసాగేలా ప్రయత్నించడం జీవులకు ఉండే సహజ లక్షణం. దీన్నే జీవులకు ఉండే సహజాతం అంటారు. తమ తదనంతరం కూడా తమ జాతి నశించి పోకుండా కొనసాగేలా నూతన తరాన్ని పునరుత్పత్తి చేయడం కూడా జీవరాసుల సహజాతమే. అంటే ఒక జీవి తన జీవనాన్ని కొనసాగించడమే కాక ఉమ్మడిగా తమ జాతి అంతరించిపోకుండా కొనసాగాలని కూడా కోరుకుంటుంది. తమకు ఎదురయ్యే ప్రమాదాలనుండి తమను తాము రక్షించుకోగలిగే జాతులు మాత్రమే కొనసాగుతాయి. తమకు అబ్బిన ఈ ఆత్మరక్షణ సామర్థ్యం తమ తరువాతి తరానికి తమ జీన్స్ ద్వారాను, శిక్షణ ద్వారా అందిస్తాయి. ఇదంతా జీవపరిణామంలో భాగంగా జరుగుతుంది. జీవులు తమ జాతి పరంపరగా కొనసాగడానికోసం వారసత్వంగా పొందే లక్షణాలు ఆ జాతి పరిణామ స్థాయి, పరిసరాల ప్రభావం ఇలా అనేక అంశాలను బట్టి ఉంటాయి.
జీవపరిణామ ప్రక్రియలో అత్యున్నత స్థాయికి అభివృద్ధి అయిన జాతి మానవ జాతి. నాలుగు కాళ్ళమీద నడిచే దశ నుండి నిటారుగా రెండు కాళ్లపైన నిలబడిన దశ మానవ పరిణామ క్రమంలోనే అత్యంత కీలకమైన దశ. దీనితో అంతవరకు ముందరి కాళ్లుగా నడక కోసం ఉపయోగపడిన అవయవాలు ఇక అప్పటి నుండి చేతులుగా మారి మానవులు శ్రమ చేయడానికి అనువుగా మారాయి. మానవ జాతి పరిణామం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది ఎంతో దోహదపడింది. వేటకు ఉపయోగించే ఆయుధాలు, ఇతర పనిముట్లు తయారు చేసుకునేందుకు దారి తీసింది. మానవులు తమ పనిముట్లను తయారు చేసుకోవడం అనేది వారిని ఇతర జీవరాసులనుండి విభిన్నంగా నిలిపే అతి ముఖ్యమైన విలక్షణత.
మానవ పరిణామంలో దోహదపడిన మరో ముఖ్యమైన అంశం సామూహిక జీవన విధానం. ఇది వారిని క్రూరమృగాలనుండి రక్షించడమే గాక వారిలో పరస్పర సహకారాన్నీ , సమిష్టి తత్వాన్ని అభివృద్ధిచేసింది. సమిష్టి ఆచరణనుండి మానవులు ఎక్కువ విషయాలను నేర్చుకోగలిగారు. జంతువుల వ్యక్తీకరణ (అనగా భాష) కేవలం సైగలు, కొన్ని రకాల శబ్దాలతో కూడిన ప్రాథమిక స్థాయికి చెందినది మాత్రమే. కానీ దీనితో ఏమాత్రం పొలికలేనంత స్థాయిలో క్లిష్టమైన భాషలను మానవులు వృద్ధిచేసుకో గలిగారు. భాష వల్ల మానవ స్వరపేటిక లో మార్పు వచ్చింది.మానవ భాషలో ముఖ్యమైన ప్రత్యేకత ఏమంటే భవిష్యత్తు ప్రణాళికల గురించి తమ అభిప్రాయాలనువ్యక్తం చేయగలగడం. ఇది మానవుల ఊహాశక్తిని అభివృద్ధిచేసింది. మానవులు వేసిన ప్రతి ముందడుగు వారి జ్ఞానంలోనే కాక శరీర నిర్మాణంలో కూడా(మెదడు కూడా శరీరంలో భాగం) మార్పును తెచ్చింది. మాంసాహార భక్షణం మానవుల మెదడు అభివృద్ధి కావడంలో తోడ్పడిందనే విషయం కూడా మనం గమనించాల్సిన విషయం.
మానవ జాతి మిగతా జీవరాసుల్లాగే భయం,కోపం, వంటి లక్షణాలనే కాక పరిణామక్రమంలో కొన్ని ఇతర విలక్షణ గుణాలను సొంతం చేసుకున్నది. అబద్ధాలుచెప్పడం, మోసగించడం,కోపాన్ని దాచుకోవటం, ముఖస్తుతి ఇవన్నీఇందులో భాగమే. అయితే ఈ లక్షణాలు మానవులు వ్యక్తిగత ఆత్మ రక్షణ కోసం పరిణామక్రమంలో వారసత్వంగా పొందినవి. ఉదాహరణకు భయం అనే లక్షణం వల్ల మానవులు (ఇతర అనేక జీవులు కూడా) తమకు ఎదురయ్యే ప్రమాదాలనుండి తప్పించుకోవడానికి ప్రేరేపించి ఉపయోగపడింది. తాము జీవించి ఉండటానికి అవసరమైన భయం అనే ఈ లక్షణాన్ని పరిణామక్రమంలో మానవులు సంతరించుకున్నారు. అలాగే ప్రతి ఇతర లక్షణం (ఆ లక్షణాన్ని మనం ఉదాత్తమైనదిగా భావించినా లేక నీచమైన లక్షణంగా భావించినా ) మానవులు తాము లేదా తమ జాతి అంతరించి పోకుండా కొనసాగడానికోసం సంతరించుకున్నవే. అంటే మానవ ప్రవృత్తి రూపొందటంలో ఆయా భౌతిక పరిస్థితులు పాత్ర వహించాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి.
మానవ జాతి అభివృద్ధిలో సామూహిక జీవనం ముఖ్యమైన పాత్ర పోషించిందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అందువల్లే మానవుడు సంఘజీవి. కనుక సాంఘిక జీవనానికి అవసరమయ్యే దయ, ప్రేమ,స్నేహం, త్యాగం లాంటి లక్షణాలు కూడా మానవ ప్రవృత్తిలో భాగంగా రూపొందాయి.
పైన చెప్పుకున్నట్లుగా మానవులు పరిణామక్రమంలో ఒకవైపు సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అవసరమైన లక్షణాలనే గాక మరోవైపు సామూహిక ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన లక్షణాలను కూడా సంతరించుకున్నారు. మానవజాతి సంతరించుకున్న లక్షణాల్లోని ఈ వైవిధ్యం వల్లనే మానవ సమాజ చరిత్రలో స్వార్థంతో దౌర్జన్యాలకు, దోపిడిలకు పాల్పడిన వారిని మాత్రమే కాక మానవజాతి సంక్షేమం కోసం త్యాగాలు చేసిన వీరులను, ప్రవక్తల్ని కూడా చూడగలం.
ఆయా కాలాల్లో ఉనికిలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులు మానవ ప్రవృత్తిని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు భూస్వామ్య సమాజంలోని ఆర్థిక సంబంధాలకు అనుగుణంగా "అసమానతలు దైవ సృష్టి లో భాగమే" అన్న భావజాలం చలామణి అవుతుంది. ఇక్కడ సహజంగానే స్వామి భక్తి అనేది మానవ ప్రవృత్తిలో ఉంటుంది. అయినప్పటికీ ఇది భూస్వామ్య సమాజాన్ని శాశ్వతంగా నిలబెట్టలేకపోయింది. ఆనాటి సమాజంలోఉన్న వైరుధ్యం అంతకన్నా మెరుగైన పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మించుకోవటానికి ఆనాటి మానవులను ప్రేరేపించింది. పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారునికి లాభమే పరమావధి. ఇక్కడ వ్యక్తి వాదం ప్రధానంగా ఉంటుంది. మానవ ప్రవృత్తిలో భాగమయిన స్వార్థం అతిశయించిన రూపంలో ప్రత్యక్షమవుతుంది. అయినప్పటికీ సాంఘిక ప్రయోజనానికి కావలసిన లక్షణాలు మానవ ప్రవృత్తి నుండి కనుమరుగు కావడం జరగదు. ఒకవేళ అలా జరిగిన పక్షంలో అది పరిణామక్రమానికి విరుద్ధమైనదవుతుంది. కాబట్టి అటువంటి జాతి క్షీణించక తప్పదు. వ్యక్తి వాదం ఇంత ప్రబలంగా ఉన్న సమాజంలో కూడా సాంఘిక ప్రయోజనాలకోసం మనుషులు ముందుకు రావడం ఆగిపోలేదు. మన దేశంలోనైనా ప్రపంచవ్యాప్తంగానైనా జరుగుతున్న అనేక సంఘటనలు, ఉద్యమాలు దీనికి సాక్ష్యం.
సారాంశంలో మనం గమనించవలసిందేమంటే మానవ ప్రవృత్తి పరిణామక్రమంలోనే రూపొందింది. మారుతున్న పరిస్థితుల వల్ల మానవ పరిణామం జరుగుతుంది. అందులో భాగంగా మానవ ప్రవృత్తి కూడా ఏదో మేరకు మారుతుంది. ప్రవృత్తి అనేది మానవుల భౌతిక పరిస్థితులకు అతీతంగా ఉండదు. చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులను బట్టి అనగా ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి మానవ ప్రవృత్తి ప్రభావితం కావడమే గాక తిరిగి ఆ భౌతిక పరిస్థితులను మార్చుకునేటందుకు మానవులను పురిగొల్పి పరిణామాన్ని ముందుకు తీసికెళ్లడంలో భాగమవుతున్నది కూడా. మానవులలో స్వార్థంలాంటి లక్షణాలనే చూడటం అంటే నాణేనికి ఒకవైపునే చూడటం,మానవ పరిణామక్రమాన్ని తిరస్కరించడమే అవుతుంది.
(ఈ వ్యాసం రాయటానికి ప్రేరణ ఇచ్చిన అహమద్ సార్ కు వినమ్రంగా)
- ఎస్. షామీర్ భాషా
- ఎస్. షామీర్ భాషా
Comments
Post a Comment