
జార్జ్ ఫ్లాయిడ్‌ను అమెరికన్ శ్వేత జాతీయుడు అయిన ఒక పోలీసు దారుణంగా హత్య చేశాడు. జాత్యహంకార పోలీసు అధికారి దారుణంపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారంగా అగ్ర రాజ్యంలో నిరసనలు, ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం కర్ఫ్యూలు విధించి ప్రజలపై నిర్బంధాన్ని అమలుచేస్తోంది.
నిరసనలు మిన్నియాపాలిస్లో ప్రారంభమయ్యాయి. తరువాత ఫ్లాయిడ్ స్వస్థలమైన హ్యూస్టన్, అట్లాంటా, లూయిస్విల్లే, మిచిగాన్, న్యూయార్క్, వాషింగ్టన్, ఇతర నగరాలకు వెళ్ళాయి. అమెరికాలోని 30 కి పైగా నగరాల్లో కర్ఫ్యూ విధించబడింది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుండి 300 మీటర్ల దూరంలో వున్న పాత సెయింట్ చర్చి కాల్చబడింది.
వైట్ హౌస్ తాత్కాలికంగా మూసివేయబడింది. సైన్యాన్ని రంగంలోకి దించే ప్రయత్నాలు అమెరికా దుస్థితిని తెలియజేస్తోంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యాభై సంవత్సరాల క్రితం హత్యకు గురయ్యాడు. అప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపారు.
ఆ తర్వాత ఇంత బహిరంగంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. నిరసనలకు భయపడి అధ్యక్షుడు ట్రంప్ బంకర్ లోకి వెళ్లిపోవడం అమెరికా దుస్థితిని తెలుపుతుంది.
46 ఏళ్ల ఆఫ్రో-అమెరికన్ ఫ్లాయిడ్ సిగరెట్ల కొనుగోలులో నకిలీ నోట్లను మార్పిడి చేశాడు. నలుగురు పోలీసు అధికారులు అతనిని చుట్టుముట్టి నేల మీదకు నెట్టారు. ఒక పోలిస్ అధికారి అతని మెడపై మోకాలితో తొమ్మిది నిమిషాలు నొక్కడం వల్ల అతను చనిపోయాడు. పోలీసులు, నేషనల్ గార్డ్స్ అణచివేత చర్యల వల్ల ఇప్పటివరకు ఐదుగురు ప్రజలు మరణించారు. దాదాపు 50 వేల మంది జైలులో ఉన్నారు.
అమెరికా 400 సంవత్సరాలుగా జాత్యాహంకార వివక్షతో బాధపడుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇది మరింత ఎక్కువైంది. అమెరికా జనాభాలో ఆఫ్రోఅమెరికన్లు 13.4 శాతం ఉన్నారు. నల్లజాతీయులు ప్రతి దశలో వివక్షకు గురవుతున్నారు. వీరి వాటా దేశ సంపదలో 5 శాతం మాత్రమే.
ఆఫ్రో-అమెరికన్ మహిళలలో తల్లి మరణాల రేటు శ్వేతజాతీయుల కంటే మూడు రెట్లు ఎక్కువ. కోవిడ్ -19 వల్ల 30 మిలియన్లకు పైగా అమెరికన్లు చనిపోయారు. వారిలో 30 శాతానికి పైగా నల్లజాతీయులు వున్నారు. అమెరికాలో పెరుగుతున్న సామాజిక ఆర్థిక అసమానతలతో పాటు నిరుద్యోగం 1929 మహా మాంద్య దశకు చేరుకుంది. కోవిడ్ 19 తో పోరాడటంలో ట్రంప్ సహించరాని నిర్లక్ష్యాన్ని చూపారు. ట్రంప్ అనేక సందర్భాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు చేసినందున అమెరికాలో ప్రజలు అసహనంతో వున్నారు.
పోలీసు అధికారులను శిక్షించడం కంటే ఫ్లాయిడ్ హత్యను రక్షించే పనిలో ట్రంప్ ఉన్నారు. మిన్నెసోటా రాష్ట్రంలో పిండి మిల్లులు ప్రసిద్ధి చెందాయి. కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ వామపక్ష కార్మిక సంఘాలను అణిచివేసే లక్ష్యంతో ఉన్నారు. ట్రంప్ యాంటీఫా అనే వామపక్ష భావజాలంతో వున్న సంస్ధను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. ఒక స్వదేశీ రాజకీయ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు.
ఫ్లాయిడ్ మరణానికి ముందు, "నాకు ఊపిరి అడటం లేదు" అనే పదాలను వుచ్చారించాడు. ఇదే ఉద్యమ నినాదంగా మారింది. అన్ని జాతుల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అమెరికా ప్రభుత్వం సంక్షోభాన్ని నల్లజాతీయుల, శ్వేత జాతీయుల మధ్య ఘర్షణగా చూపుతోంది. నల్లజాతీయులకు ఉద్యోగాలు ఇస్తే, సమస్య చల్ల బడుతుందని ప్రచారం చేస్తున్నారు. శాసనసభలో ఎక్కువ మంది ఆఫ్రో అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్ చెపుతోంది. అస్తిత్వవాద ధోరణులుు ప్రభుత్వమే రెచ్చగొడుతోంది.
ట్రంప్ చర్యలను డెమోక్రటిక్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించడం లేదు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు అమెరికన్ ఆర్థిక శ్రేణుల ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఒకే తరహా విధానాన్ని పాటిస్తున్నారు. ఒబామా కాలంలో కూడా అమెరికాలో జాత్యహంకార దాడులు ఆగలేదు. కాబట్టి ఈ జాత్యహంకారానికి మూలకారణం కనుగొని నిర్మూలించాలి. వ్యవస్థను మార్చాలి. జాతి వివక్ష లేని పాలన ఇప్పుడు అమెరికా ప్రజలకు అవసరం.
Comments
Post a Comment