కరోనా వల్ల కలిగే ప్రజారోగ్య సంక్షోభంతో భారతదేశం, మిగతా ప్రపంచాలతో పాటు, అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. వలస కార్మికులు అత్యంత తీవ్రమైన జీవన సమస్యను ఎదుర్కొంటున్నారు. వారికి పని లేదు, ఆదాయ వనరులు లేవు. వారి ప్రాథమిక అవసరాలను ప్రభుత్వాలు తీర్చడం లేదు. వారికి నాణ్యమైన, ఉచితమైన పరీక్షా సౌకర్యాలు లేవు, రక్షణ సామగ్రి లేదు. వాళ్ళ స్వంత ఇంటికి చేరుకోవడానికి మార్గాలు లేవు. పౌరుల ప్రాథమిక హక్కులు కరోనా కాలంలో కాలరాయబడు తున్నాయు. కోట్ల మంది వలస కార్మికులకు సరైన వసతి కల్పించే సామర్ధ్యం ప్రభుత్వాలకు లేదని అధికారులు చెపుతున్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో, ‘న్యాయవ్యవస్థ’, అన్ని విషయాలను ‘ఎగ్జిక్యూటివ్’కే వదిలివేస్తోంది.
పౌరుల ప్రాథమిక హక్కుల విషయాలను పరిశీలించే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. దేశ పౌరుల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను పరిరక్షించడంలో సుప్రీమ్ కోర్టుకు కీలకమైన రాజ్యాంగ పాత్ర ఉంది. కరోనా సంక్షోభ సమయంలో సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ పాత్ర , విధి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్చి 24 నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం దేశం, దాని ఆర్థిక వ్యవస్థ "లాక్" చేయబడింది. భారతీయ శ్రామికశక్తిలో 75 శాతానికి పైగా పేద ప్రజలు అనధికారిక, అసంఘటిత రంగాలలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో మధ్యస్థ, చిన్న, సూక్ష్మ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. దానివల్ల వారు జీవనోపాధిని కోల్పోయారు. ముఖ్యంగా వలస కార్మికులు ప్రధాన నగరాల్లో తమ జీవనోపాధిని వెతుక్కున్నారు. సామాజిక దూరం నిజానికి వారికి ఒక ఆదర్శవంతమైన అసంభవం. ఈ నిరుపేద పౌరులు ఇరుకైన గృహాలు, పేవ్‌మెంట్‌లలో నివసించేవారు. ఎటువంటి ఉపాధి, జీవనోపాధి లేకుండా, ఒక ఖచ్చితమైన ఆహార వనరు లేకుండా వారు జీవితాన్ని సాగిస్తున్నారు. జీవనోపాధి పోయిన తర్వాత వారి సొంత రాష్ట్రాలకు, తరచుగా వేలాది మందికి నడవడం ప్రారంభించవలసి వచ్చింది. చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు, వృద్ధ తల్లిదండ్రులతో కిలోమీటర్ల దూరంలో వున్న స్వంత గ్రామాలకు నడకను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్లో భాగంగా రైళ్లు, బస్సులను రద్దుచేయడం వల్ల వారి సొంత పట్టణాలకు వెళ్లకుండా వారు నిరోధించబడ్డారు.
వలస కార్మికుల దుస్థితిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో నమోదైంది. అలఖ్ అలోక్ శ్రీవాస్తవ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఈ కేసులో సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ కేంద్రప్రభుత్వం తరుపున నివేదికను దాఖలు చేశారు. ఇది వలస కార్మికుల దుస్ధితిని తెలియజేస్తుంది. వలస కూలీల కదలిక, రవాణాను కేంద్రప్రభుత్వం నిషేధించింది. బదులుగా వారిని రిలీఫ్ షెల్టర్లకు, సహాయ శిబిరాలకు తరలించారు. అయితే కేంద్రప్రభుత్వం మార్చి 31 వతేది సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ ద్వారా తప్పుడు సమాచారాన్ని తెలిపింది. స్వంత వూర్లకు చేరుకునే ప్రయత్నంలో ఏ వలస వ్యక్తి రోడ్లపై నడవడం లేదు అని ఆ నివేదకలో పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రభుత్వ తప్పుడు నివేదిక ద్వారా వాస్తవాలు సుప్రీంకోర్టుకు తెలియలేదు. లాక్డౌన్ 3 నెలలకు పైగా కొనసాగింది. కోర్టు జోక్యం చేసుకోవడంలో విఫలమైన పర్యవసానంగా, ఆ సమయంలో కరోనా కేసుల సంఖ్య కొన్ని వందలు మాత్రమే వుంది. అయినప్పటికీ, లక్షలాది మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లలేకపోయారు. బలవంతంగా వలస పేద కార్మికులు ఒకే చోటున ఉండటం వల్ల, వాళ్లు ప్రభుత్వాలపై నమ్మకం లేక తమ నడకను కొనసాగించారు. తద్వారా 200 మందికి పైగా వలస ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాబడ్డారు. అంతేకాకుండా, ప్రభుత్వ ప్రకటన వాస్తవాలకు విరుద్ధమని ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది. ఆధునిక భారతదేశంలో కఠినమైన లాక్డౌన్లలో, కేంద్రం అనేక ఆదేశాలు జారీ చేసింది. కాని రాష్ట్రాలకే అమలు చేసే అధికారాన్ని ఇచ్చింది. కానీ వలస కూలీల సమస్య అంతర్-రాష్ట్ర సమస్య. దీన్ని కేంద్రప్రభుత్వమే పరిష్కరించాలి.
వలస కార్మికుల అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంలో వైఫల్యం చెందింది. ఫలితంగా మే ఆరంభంలో మిలియన్ల మంది కార్మికులు భారీగా వలస ప్రారంభించారు. మునుపటి ఆరు వారాలపాటు వాస్తవంగా వాళ్ల ఉద్దేశ్యంలో సహాయ శిబిరాల్లో జైలు శిక్ష అనుభవించడంతో వారు విసిగిపోయారు. ఈ సమయానికి, దేశంలో కోవిడ్ అంటువ్యాధులు 50,000 దాటింది. గణనీయమైన సంఖ్యలో వలస కార్మికులకు వ్యాధి సంక్రమించడం ప్రారంభించింది. ఈ దశలో కూడా, ప్రభుత్వం వారి ప్రయాణ కదలికలను అడ్డుకోవాలని పోలీసులను కోరింది. అనంతరం బస్సు, రైళ్లు (శ్రామిక్ స్పెషల్ రైళ్ల) ద్వారా వారి రవాణానికి ప్రభుత్వం అంగీకరించింది. అప్పటికే వలస కూలీలు తమను సహాయ శిబిరాల్లో నిర్భంధించాడాన్ని నిరసిస్తూ ఆందోళనలు జరిపారు. ఈ ఆందోళనలు దేశంలో 200 పైగా ప్రదేశాల్లో జిరిగినట్టు మీడియా పేర్కొంది. చాలా ఆలస్యంగా ప్రభుత్వాలు రవాణా ఏర్పాట్లు చేసినప్పటికీ, వైద్య ధృవీకరణ పత్రం పొందడం, టికెట్ ఖర్చులు వారే భరించడం వంటి కఠినమైన షరతులు వల్ల వలస కార్మికుల రవాణా సరిగా జరగలేదు. లక్షల సంఖ్యలో పేద ప్రజలు తమ జీవన హక్కు, స్వేచ్ఛను కోల్పోయారు.
రోడ్లపై నడుస్తున్న వలస కార్మికులను గుర్తించి, వారికి తగిన ఆహారం, ఆశ్రయం కల్పించాలని కోరుతూ మే 15 న సుప్రీంకోర్టులో ఓక పిల్ వేయబడింది. దాన్ని సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కొట్టివేసింది. విపత్కరమైన కరోనా సంక్షోభం పతనానికి ఎగ్జిక్యూటివ్‌ను అనుమతించాలనే నమ్మకంతోనే సుప్రీంకోర్టు వుండిపోయింది. వలస కార్మికుల విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే, ఈ ప్రక్రియలో, ప్రాథమిక హక్కులను పరిరక్షించే ప్రాధమిక బాధ్యతను సుప్రీంకోర్టు వదిలివేసింది.
కోర్టులు కేవలం పిటిషన్లను తిరస్కరించడం, వాయిదా వేయడంతోనే గడుపుతున్నాయి. ఇది పిటిషనర్లను సమస్యల పరిష్కారానికి కోర్టులను సంప్రదించకుండా నిరోధిస్తుంది. ఎందుకంటే ఇది ఎగ్జిక్యూటివ్ బాధ్యత అని కోర్టు నిర్ణయించింది. సాధారణంగా, సుప్రీంకోర్టు పిటిషనర్లను హైకోర్టుల వైపు తిప్పికొట్టేది. కానీ వలస కార్మికుల విషయంలో అది కూడా జరగలేదు. పిల్ లు పేదలు, అణగారిన, బలహీనమైన వారి హక్కుల పరిరక్షణ కోసం రూపొందించబడిన ఒక నిర్దిష్ట పరికరం. “దేశ ప్రజలు ఎవరైనా” పొరుగు వారి సమస్యల తరపున కోర్టు నుండి తగిన ఆదేశాలను పొందవచ్చు. కానీ కోర్టులు వీటిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయబడ్డ విషయాలుగా పరిగణిస్తోంది.
కనీసం నాలుగు హైకోర్టులు (కర్ణాటక, మద్రాస్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్) వలస ప్రజల హక్కుల గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించాయి. ఇది అత్యవసర కరోనా సమయంలో ఏమి జరిగిందో ప్రజలకు తెలియడానికి ఉపయోగపడింది. ఇక్కడ హైకోర్టులు ధైర్యంగా నిలబడి ప్రభుత్వం చేసిన ఉల్లంఘనలను గుర్తించాయి. కాని చివరికి సుప్రీంకోర్టు దీనిని రద్దు చేసింది.
ఉదాహరణకు, మద్రాస్ హైకోర్టు మీడియా సంస్థలపై క్రిమినల్ పరువు నష్టం కేసులను రద్దు చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా అడ్డుకోలేమని పేర్కొంది. వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడుస్తున్నారనే తప్పుడు వార్తలను మీడియా సంస్ధలే ప్రచారం చేస్తున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. సొలిసిటర్ జనరల్ విచిత్రమైన, అన్యాయమైన వాదనకు సుప్రీంకోర్టు సంతృప్తి చెందింది. పైపెచ్చు మీడియా సంస్ధలు మరింత బాధ్యతాయుతంగా వార్తలను నివేదించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇటువంటి సమయాల్లో, కొన్ని రాష్ట్రాల హైకోర్టులు హేతుబద్ధతను, కరుణను వలసకూలీల పట్ల చూపించాయి.
కోర్టు ఆదేశాలను వాస్తవానికి పాటించేలా చూడడానికి కార్యనిర్వాహక చర్యలను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టుకు అధికారం వుంది. కార్యనిర్వాహక చర్యలపై సుప్రీంకోర్టు అపారమైన గౌరవాన్ని ప్రకిటస్తోంది. ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పుడు ప్రకటనలపై ఆధారపడటం వల్ల సుప్రీంకోర్టు తన నిస్సహాయతను ప్రకటించినట్లైంది. న్యాయస్థానాల రాజ్యాంగ హోదా, విధిని సుప్రీంకోర్టు చర్యలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రజలకు పూర్తి న్యాయం చేయడానికి, ఏ చర్యనైనా చేపట్టడానికి ఆర్టికల్ 142 ప్రకారం భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. భారత ప్రజాస్వామ్యం మనుగడ, చట్ట పాలన, ముఖ్యంగా ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభంలో సుప్రీంకోర్టు విచక్షణపై ఆధారపడి వుంది. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా పౌరుల ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే రాజ్యాంగబద్ధమైన బాధ్యతను సుప్రీంకోర్టు చురుకుగా నెరవేర్చాలి.
రైల్వే స్టేషన్లు, రాష్ట్ర సరిహద్దుల వద్ద లక్షలాది మంది వలస కూలీలు రోడ్లపై చిక్కుకుపోతున్నారు. వలస కార్మికుల సంక్షోభం నేటికీ కొనసాగుతోంది. ఇకనైనా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని 20 కోట్ల మంది వలస కూలీలకు తగిన రవాణా ఏర్పాట్లు, ఆహారం, ఆశ్రయం ప్రభుత్వాల ద్వారా ఉచితంగా ఏర్పాటు చేయాలి. అలాగే దారిద్రరేఖకు దిగువున వున్న బిపిఎల్ కుటుంబాలకు పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని అందేజయాలని కేంద్ర, రాష్య్రప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించాలి.
- అమన్
Comments
Post a Comment