
శాంతియుత నిరసనకారులను దేశద్రోహులుగా, దేశ వ్యతిరేకులుగా పేర్కొనలేరు. ఎందుకంటే వారు తమ ప్రయోజనాలకు విరుద్ధమని భావించే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది ముంబై హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు. ముంబై హైకోర్టు పౌరులు ఆందోళన చేసే హక్కును సమర్థించింది. అసమ్మతిని అణచివేయడం అంటే దేశ ప్రజల అణిచివేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడమే అని జస్టిస్ డి.వై.చంద్రచుడ్ ఇటీవల అహ్మదాబాద్‌లో ఉపన్యాసం ఇస్తూ అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులు ఎం జి సెవ్లికర్, టి వి నాలావాడే మెజారిటీ ఆలోచనల ఆధారంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. భారతదేశం వంటి ప్రజాస్వామ్య గణతంత్రంలో రాజ్యాంగం రూల్ ఆఫ్ లా ను రూల్ ఆఫ్ మెజారిటీ కోసం అందిస్తుంది. కాని మెజారిటీ ప్రజల ఆమోదం కోసం కాదు అని చెప్పారు.
మైనారిటీ వర్గాల హక్కులపై న్యాయమూర్తులు ప్రత్యక్ష ప్రస్తావన చేశారు. ముస్లింల వంటి ఒక నిర్దిష్ట మతానికి చెందిన పౌరులు దేశంలో ఉన్నారు.. ఒక వర్గానికి ఒక నిర్దిష్ట చట్టం తమ ఆసక్తికి విరుద్ధమని భావించవచ్చు. అటువంటి చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని భావించడానికి పూర్తిగా అర్హత వారికి ఉందని న్యాయమూర్తులు అన్నారు.
ఇది వారి అవగాహన, నమ్మకానికి సంబంధించిన విషయం. ఆర్టికల్ 14 కింద అందించబడిన 'సమానత్వానికి' ప్రభుత్వ చట్టాలు వ్యతిరేకం అని ఆందోళన చేస్తున్న వ్యక్తులు భావిస్తున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వారి భావాలను వ్యక్తీకరించే హక్కు వారికి ఉంది.
అటువంటి విషయం కోర్టు ముందుకు వచ్చినప్పుడు, అటువంటి చట్టాన్ని వ్యతిరేకించటానికి నిర్దిష్ట సమాజానికి లేదా మతానికి మాత్రమే ఆసక్తి ఉందనే వాదనకు కోర్టు వెళ్ళదు. ఆందోళన చేసే వారిని దేశద్రోహులుగా, దేశ వ్యతిరేకులుగా ముద్రవేయదు. ఎందుకంటే వారు ఆ చట్టాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నారు. చట్టాన్ని వ్యతిరేకించడం నేరం కాదు. నిర్దిష్టంగా చెప్పలంటే ఆందోళన చేసే బృందాలకు, వ్యక్తులకు చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఉందా అని చూడటానికి కోర్టులు కట్టుబడి ఉంటాయి. ఎందుకంటే అది వారి ప్రాథమిక హక్కులో భాగమని కోర్టులు భావించిన సందర్భాలు ఉన్నాయి.
అటువంటి హక్కును వినియోగించడం శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తుందనీ ప్రభుత్వాలు భావుస్తాయు. అలాంటి సందర్భాల్లో, అటువంటి వ్యక్తులను సంప్రదించడం, వారితో చర్చలు నిర్వహించడం చేయాలి. వారిని ఒప్పించడానికి ప్రయత్నించడం ప్రభుత్వ విధిలో భాగం. శాంతియుత ఆందోళనలకు వ్యతిరేకంగా ప్రభుత్వపు బలవంతపు చర్యను ప్రస్తావిస్తూ, బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఇలా అన్నారు. చట్టం ఇచ్చిన అధికారాలను వినియోగించుకునేటప్పుడు ప్రభుత్వం, బ్యూరోక్రసీ సున్నితంగా ఉండాలి. దురదృష్టవశాత్తు, స్వాతత్ర్యానంతరం కూడా రద్దు చేయవలసిన అనేక చట్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. బ్యూరోక్రసీ, భారత పౌరులకు వ్యతిరేకంగా ఇటువంటి అధికారాలను ఉపయోగించడం తగదు.
భారతదేశాన్ని తయారుచేసే విభిన్నత్వం అనే అంశంపై 15 వ జస్టిస్ పిడి దేశాయ్ స్మారక ఉపన్యాసం చేస్తూ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. భారత రాజ్యాంగ రూపకర్తలు హిందూ ఇండియా, ముస్లిం ఇండియాఆలోచనలను తిరస్కరించారు. భిన్న మతాలతో కూడిన రిపబ్లిక్ ఇండియాను నిర్మించాలని అనుకున్నారు. భారతదేశాన్ని ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క సంస్థ, ఏ ఒక్క పార్టీ గుత్తాధిపత్యంగా భావించలేరు. రాజ్యాంగం ప్రమాణం చేసిన హక్కులను, చట్టాలను
పరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం అభివృద్ధి, సామాజిక సమన్వయానికి చట్టబద్ధమైన సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. అయినంత మాత్రాన భారతదేశపు విభిన్న సమాజాన్ని నిర్వచించే విలువలు, గుర్తింపులపై గుత్తాధిపత్యాన్ని ఎప్పటికీ పొందలేదు. రాజ్యాంగ విలువలను కాపాడటానికి, ఉద్దేశపూర్వక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి న్యాయ వ్యవస్థ నిబద్ధతతో పనిచేయాలి. అసమ్మతిని జాతీయ వ్యతిరేకతగా, ప్రజాస్వామ్య వ్యతిరేక సమ్మెలుగా ప్రభుత్వం భావించరాదు. అది ప్రజాస్వామిక సమాజానికి చేటు చేస్తుంది.
జస్టిస్ చంద్రచూడ్ దృష్టిలో, ప్రజల తేడాలు వ్యవస్థ బలహీనత కాదు. విభిన్న భాగస్వామ్య మానవాళిని గుర్తించడం ద్వారా తేడాలను అధిగమించడం ప్రజాస్వామిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది. రాజ్యాంగ వ్యవస్థాపక పితామహులు వైవిధ్యతను ఆమోదించడానికి భవిష్యత్ తరాలపై నమ్మకం ఉంచారు. దేశంలోని విభిన్నతే (లేయర్డ్ ఇండియన్ ఐడెంటిటీ) ప్రజలను భారతీయులను చేస్తుంది. అందుకే ప్రభుత్వాలు ప్రజల ఆలోచనల్లోని విభిన్నతను, అవగాహనను ప్రోత్సహించే ప్రయత్నాలకు కేంద్రంగా ఉండాలి" అని చంద్రచూడ్ అన్నారు.
ప్రభుత్వాలు భయపడటం వల్లే వాస్తవాలను, ప్రజల ఆలోచనలను బలప్రయోగం ద్వారా అణచివేస్తున్నాయి. స్వేచ్ఛా సంభాషణపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది రాజ్యాంగ నియమాలను ఉల్లంగిస్తుంది. రిపబ్లిక్ సమాజపు రాజ్యాంగ దృష్టి నుండి వ్యవస్థ క్రమంగా దూరం అవుతుంది.
అసమ్మతిని ప్రజాస్వామ్యపు సేఫ్టీ వాల్వ్ గా సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభివర్ణించారు. అంటే ప్రశ్నించడానికి, అసమ్మతిని వ్యక్తంచేయడానికి కావాలసిన వాతావరణాన్ని నాశనం చేయకూడదు. ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిస్తే
రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక వృద్ధికి ఆధారాన్ని నాశనం చేసిన వారవుతారు.
అసమ్మతిని నిశ్శబ్దం చేయడం, ప్రజల మనస్సులలో భయాన్ని కలిగించడం, వ్యక్తిగత స్వేచ్ఛల ఉల్లంఘనకు మించినది. సంభాషణ ఆధారిత ప్రజాస్వామ్య సమాజాన్ని అసమ్మతిపై దాడుల ద్వారా ప్రభుత్వాలు నాశనం చేయకూడదు. ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటంలో వైఫల్యం చెందినప్పుడు ప్రజలు రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించక తప్పదు.
- అమన్
Comments
Post a Comment