వరవరరావు, జి.ఎన్. సాయిబాబా, ఇతరులను విడుదల చేయాలి



         
  గత మూడు సంవత్సరాలుగా నాగపూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను, గత ఏడాదిన్నరగా పూణే, ముంబై తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న  వరవరరావు మరియు ఇతర రాజకీయ ఖైదీలను వెంటనే బెయిలుపై లేదా పెరోల్పై విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

 90% అంగవైకల్యంతో, 18 రకాల అనారోగ్య సమస్యలతో, తన దైనందిన పనులు కూడా చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో సాయిబాబా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. తన తల్లి హైదరాబాదులోని సోదరుని ఇంట్లో క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న దని, పెరోలు ఇవ్వాలని నాగపూర్ కోర్టులో వేసిన పిటిషన్ను,  సోదరుని  ఇల్లు కంటెన్ మెంట్  జోన్ లో ఉన్నదని కొట్టివేసింది. వాస్తవంగా  అతని ఇల్లు కంటెంట్మెంట్ జోన్ లో  లేకున్నా ప్రభుత్వం, పోలీసులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి  కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. కదలలేని స్థితిలో ఉన్న సాయిబాబాకు జైలు అధికారులు సహాయకులుగా ఎవరిని నియమించలేదు. ఇప్పటివరకు అందిన ఇద్దరు ఖైదీల సహకారం కూడా అందని పరిస్థితుల్లో అనేకసార్లు జైల్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. రెండు రోజుల క్రితం సాయిబాబా తన సహచరి వసంతకు ఫోను చేసి తన వేళ్ళను వంచి వస్తువులను  పట్టుకోలేకపోతున్నానని, మూడు సార్లు ఛాతీ నొప్పి వచ్చిందని, ఆసుపత్రికి కూడా తీసుకు వెళ్లలేదని, తాను త్వరలో చనిపోయేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నదని విలపించాడు. 

ఎనభై ఒక్క సంవత్సరాల వయసుతో శ్వాసకోస, బ్లడ్ ప్రెజర్ సంబంధిత జబ్బులతో బాధపడుతున్నానని, కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తనకు బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని వరవరరావు వేసిన పిటిషన్ను ముంబై కోర్టు కొట్టివేసింది. ముంబైలో అతి వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ వలన జైలులోని ఖైదీలకు కూడా సోకి కొందరు చనిపోయారు అని తెలిసింది. వరవరరావు తీవ్ర అనారోగ్యానికి  గురైనట్లు, హాస్పిటల్కు తీసుకు వెళ్లినట్లు వార్తలు వచ్చిన కారణంగా, సంబంధిత లాయరు జైలు అధికారులకు ఫోన్ చేయగా ఎలాంటి జవాబు లేదు. కరోనా సమయంలో ములాఖథ్లు రద్దు చేయబడిన కారణంగా ఎలాంటి సమాచారం జైలు నుండి లభించుట లేదు. వరవరరావు కూతుర్లు మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ, తమ తండ్రిని విడుదల చేయాలని కోరారు.

 తెలంగాణలోని యావత్తు ప్రజలు... వరవరరావు, సాయిబాబాల ఆరోగ్య పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లో,  అట్టడుగు ప్రజల హక్కుల కొరకు దశాబ్దాలపాటు శ్రమించిన ఈ ఇద్దరిని వెంటనే బెయిలు లేదా పెరోల్పై విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

27-5-2020,బుధవారం.
హైదరాబాద్

Comments