భారత్ పై మిడతల యుద్ధం


ఏప్రెల్ చివరన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో తన భార్య, నలుగురు పిల్లలతో నివసిస్తున్న ఉమ్మద్ సింగ్ 3ం ఎకరాల  పంటను మిడతలు కేవలం 2 గంటలలో తినేశాయి. అతని కళ్ల ఎదుట ఈ దారుణ ఘటన జరిగింది.  అతని వూరి నుండి జైసల్మేర్ (పాకిస్తాన్‌) కేవలం ఓక గంట ప్రయాణం మాత్రమే. "మేము ఈ రకమైన మిడుత దాడిని చూడటం ఇదే మొదటిసారి" అని సింగ్  చెప్పారు. చిన్నతనంలో, అతను వినాశకరమైన మిడత సమూహాల కథలను విన్నాడు. కానీ ఇప్పటి వరకు, అతను వ్యక్తిగతంగా ఎప్పుడూ చూడలేదు. "ఇది చూసిన తర్వాత,  నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు. 

సింగ్ సుమారు 30 ఎకరాల భూమిని కలిగి ఉన్నాడు. మిడుతలు సుమారు 15 లక్షల రుపాయల నష్టాన్ని కలిగించాయి. పరిహారంగా ప్రభుత్వం కేవలం కొద్ది శాతం మాత్రమే ఇచ్చింది. తన 14 ఏళ్ల కుమారుడు చదువుకోవడం, తినడం పట్ల ఆసక్తిని కోల్పోయాడని సింగ్ చెప్పారు. వినాశనానికి ముందు ఆయన బరువు 66 పౌండ్లు అని సింగ్ చెప్పారు. ఇప్పుడు బాలుడు కేవలం 48 పౌండ్లకు పడిపోయాడు. డిసెంబర్ 2019 నుండి, ఆసియాకు,  హార్న్ ఆఫ్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో అసాధారణంగా మిడుతల వ్యాప్తి చెందాయి. ఈ చొరబాటుకు వాతావరణ మార్పు కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2019 లో, భారతీయ మహాసముద్రపు పశ్చిమ భాగంలో ఎనిమిది తుఫానులు వచ్చాయి.  వ్యవసాయ భూములకు మంచి పంట వస్తుందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (FAO) తో సీనియర్ మిడుత అంచనా అధికారి కీత్ క్రెస్మాన్ చెప్పారు.  మిడుత పెంపకం నేరుగా నేల తేమ, ఆహార లభ్యతతో ముడిపడి ఉంటుంది. కాబట్టి వర్షాలు మిడుత జనాభాపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.

భవిష్యత్ మిడత సమూహాల నష్టాన్ని తగ్గించడానికి భారతదేశం, పాకిస్తాన్లు తమ ప్రయత్నాలను సమన్వయం చేసుకోవాలని శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్  నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ  శాఖ అయిన ప్లాంట్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్  సాంకేతిక డైరెక్టర్ ముహమ్మద్ తారిక్ ఖాన్ మాట్లాడుతూ, మిడుత మంటలు భారత-పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా సమానంగా తీవ్రమైన ముప్పుగా ఉన్నాయి. మిడుత సమస్యను పరిష్కరించడానికి ఇప్పటివరకు రెండు దేశాలు తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టగలిగాయని ఖాన్ చెప్పారు. కానీ ఎక్కడైనా సరిహద్దు వివాదం ఆర్థిక వ్యవస్థలను, ఆహార భద్రతను దెబ్బతీసే అవకాశం ఉంది.

ఇరాన్లో 1979 విప్లవం ఇరాన్, పాకిస్తాన్ మధ్య మిడుత నిర్వహణ సహకారాన్ని దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. 1990 వ దశకంలో, ఇరు దేశాలు FAO కి విజ్ఞప్తి చేశాయి. మధ్యవర్తిగా పనిచేయడంతో పాటు, FAO ప్రపంచంలోని అన్ని ప్రభావిత ప్రాంతాల నుండి డేటాను సేకరిస్తుంది. వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతుంది. అందువలల్ల  అన్ని దేశాలు పర్యవేక్షణ చర్యలు,  పురుగుమందుల పిచికారీలను ప్లాన్ చేసుకోవచ్చు. ఎడారి మిడుత ప్రతిరోజూ తన బరువంత ఆహారాన్ని అది తింటుంది. ఒక మిడుత రెండు గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. సాపేక్షంగా చిన్న సమూహంలో 40 మిలియన్ మిడుతలు ఉంటాయి. అలాంటి సమూహం ఒక రోజులో 35,000 మంది కన్నా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది. మిడుతలు రోజుకు దాదాపు 100 మైళ్ళ దూరం తక్కువ వ్యవధిలో ప్రయాణించగలవు. అంటే యెమెన్‌లో బయలుదేరిన  మిడత  సమూహం కేవలం రెండు వారాల్లోనే  భారతదేశానికి రాగలదు. 

ఎడారి మిడుతలకు భారత్ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎడారిలో మనుగడ కోసం ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిగత కీటకం ఇది. వీటిలో పెద్దవి  గోధుమ రంగులో ఉంటాయి. ఎడారి వాతావరణంతో కలిసిపోవడానికి వీటి రంగు వీలు కల్పిస్తుంది. సమీపంలోని వృక్షసంపదతో కలపడానికి, తేమతో కూడిన నేలలో అభివృద్ధి చెందుతుండానికి కోన్ని జాతి మిడతలు ఆకుపచ్చగా వుంటాయి.  గత సంవత్సరం, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి కారణంగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో 40 మంది మరణించారు. దీనికి ప్రతిగా భారతదేశం తన మొదటి వైమానిక దాడులను చేపట్టింది.  ఇది దశాబ్దాలలో ఇరు దేశాల మధ్య అత్యంత ప్రమాదకరమైన ప్రతిష్టంభనలలో ఒకటిగా మారింది.

ఆ కాలంలో వేసవిలో, సమాచార మార్పిడి, వాణిజ్య కార్యకలాపాలు  నిలిపివేయబడ్డాయి. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, కనీసం ఒక సంభాషణను కొనసాగించడానికి అనుమతించబడింది, FAO గొడుగు కింద చర్చలు జరిగాయి. ఎడారి మిడుత  ముప్పును నివారించడానికి పాకిస్తాన్, భారత అధికారులు సరిహద్దు వెంబడి జీరో పాయింట్ వద్ద కలిశారు. పురుగుమందుల వల్ల చంపబడిన మిడుతలు భారతదేశంలోని జైసల్మేర్ సమీపంలోని ఒక గ్రామంలో భూమిని చెత్తకుప్పలుగా మార్చేశాయి. ఈ ప్రాంతంలో మిడుత నిర్వహణ భారతదేశం-పాకిస్తాన్ వివాదానికి ముందే ఉంది.  విభజనకు ముందు 1939 లో పాకిస్తాన్ రాజధాని కరాచీలో 1926 నుండి 1931 వరకు  క్రూరమైన మిడుత దాడులు జరిగాయి. తరువాత మిడత నివారణ కేంద్రం ఏర్పాటుచేయబడింది. సంవత్సరానికి ఆరుసార్లు, వేసవి సమయంలో, సరిహద్దు  ఇరువైపుల నుండి ప్రతినిధులు కలుస్తారు. తెగులు, పెంపకం పద్ధతులు, నియంత్రణ వ్యూహాలు, పర్యవేక్షణ నివేదికలు,  స్థానిక రైతుల సూచనలు తదితర అంశాలపై చర్చిస్తారు. 

సమావేశాలలో మూడు భారతదేశంలోను, మూడు పాకిస్తాన్లోను జరుగుతాయి. అవి అధిక భద్రతా వాతావరణంలో జరుగుతాయి. రెండు దేశాల మిడుత నిపుణులతో పాటు సైనిక దళాల అధికారులు సమావేశానికి హజరవుతారు.  ఇరు దేశాల అధికారులు  ఆహార భద్రత, మిడతల దండు నివారన మార్గాలు, ఇరు ప్రాంతాల అభివృద్ధి అని భారత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మొక్కల రక్షణ సలహాదారు రాజేష్ మాలిక్ చెప్పారు. రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా అందరు క్రమం తప్పకుండా కలుస్తారని ఆయన చెప్పారు.

సంవత్సరాలుగా, ఇరు దేశాలు అధునాతన నిఘా సామర్థ్యాన్ని అభివృద్ధి చేశాయి. ఇందులో శిక్షణ పొందిన సిబ్బందితో పాటు వాహనాలు, ప్రత్యేక పరికరాలు ఉన్నాయి. లోకస్ట్ వాచ్ అనే పోర్టల్ ద్వారా, భూమిపై మిడుత ప్రతిస్పందనను సమన్వయం చేయడానికి FAO దేశాలకు సహాయపడుతుంది. ఈ ప్రక్రియ ఇటీవలి సంవత్సరాలలో హైటెక్‌గా మారింది. ఇది సకాలంలో వివరణాత్మక సమాచారాన్ని సేకరిస్తుంది. మిడత దాడులను నిర్ధారించడానికి, ఇది పర్యవేక్షణ బృందాలను ఇంటర్నెట్‌కు అనుసంధానించే ఉపగ్రహ యాంటెన్నాలను పంపిణీ చేస్తుంది. మిడుతలు, వాటి అభివృద్ధి దశ, అలాగే నేల తేమ,  వృక్షసంపద వంటి డేటాను నమోదు  చేయడానికి నూతన సాంకేతికత ఉపయోగడుతుంది. కరువు ప్రాంతంలో భారీ వర్షాలు పడటం చాలా అసాధారణం. కానీ అది జరిగినప్పుడు, మిడుతలు వాటి సంఖ్యను పెంచుతాయి. వాటి ప్రవర్తనను మార్చుకుంటాయి. 

లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ (ఎల్‌డబ్ల్యుఓ) శాస్త్రవేత్తలు రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్, జైసల్మేర్ జిల్లాల్లో మిడత సమూహాలను గుర్తించారు. మిడుతలు సాధారణంగా జూలై-అక్టోబర్ సమయంలో వస్తాయి. కానీ ఇప్పటికే ఇవి ఈ ప్రాంతంలకు మిడతల దండు చేరుకున్నాయి. సాధారణ మిడతలకు ఇవి దూరంగా వుంటాయి. తూర్పు ఆఫ్రికాలోని మొక్కజొన్న, జొన్న,  గోధుమ పంటలను ప్రస్తుతం ఇవి మింగేస్తున్నాయు. మిడుతలు భారతదేశంలో కూడా కనిపిస్తాయి. ఇది సాధారణంగా జూలై-అక్టోబర్ సమయంలో మాత్రమే కనిపిస్తాయి. ఎక్కువగా ఒంటరి కీటకాలుగా, చిన్న సమూహాలలో కనిపిస్తాయి. ఈ సారి ఏప్రిల్ మధ్యకాలంలోనే భారత-పాకిస్తాన్ సరిహద్దులో వీటిని గుర్తించారు.

పశ్చిమ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలలో రబీ పంటల ఉత్పత్తి పెరుగుతున్నాయి. భారత దేశం కరోనావైరస్ వైపరీత్యంతో పోరాడుతున్నప్పుడు మిడతల దండు పంటలపై దాడులు చేస్తూ సమస్యలను సృష్టిస్టోంది. ప్రజలు రబీ పంటను ఇప్పటికే పండించారు. కొత్త ఖరీఫ్ సీజన్ కోసం రైతులు ఇంకా మొక్కల పెంపకాన్ని ప్రారంభించలేదు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ  మొక్కల రక్షణ  డైరెక్టరేట్‌లో ఎల్‌డబ్ల్యుఓ ఓక భాగం. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దానికి కార్యాలయం వుంది. ఏప్రిల్ మూడవ వారం నుండి పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న పంజాబ్‌లోని ఫాజిల్కాలో భారీ మిడత సమూహాలను గుర్తించారు. కానీ ఇవి ఇంకా పరిపక్వ దశలలోనే వున్నాయి. అపరిపక్వ రెక్కలతో వున్నాయి.  ఇప్పటివరకు సంతానోత్పత్తి, సమూహ కదలికలు కూడా కనిపించలేదు.

 భారతదేశంలో మిడుతలు సాధారణ సంతానోత్పత్తి కాలం జూలై-అక్టోబర్. కానీ ఈసారి, ఏప్రిల్ మధ్యలోనే అవి కనిపించాయి. గత సంవత్సరం  మే చివరిలో కనిపించాయి. అయినప్పటికీ, రాజస్థాన్‌లో (ముఖ్యంగా గంగానగర్, హనుమన్‌గ ర్, బికానెర్, జైసల్మేర్, జోధ్‌పూర్, నాగౌేర్, జలోర్, సిరోహి), గుజరాత్ (బనస్కాంత) లో రబీ సీజన్లో మిడత సమూహాలు కనిపించాయి. వినాశనానికి కారణమయ్యే అధిక  సంతానోత్పత్తిని ఇవి చేయగలవు. ఒంటరి, హానికరం కాని మిడతలకు భిన్నంగా ఇవి వుంటాయి. వీటి సమూహాలను నిర్మించడానికి ఎక్కువ సమయం వుండటం వల్ల సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటుంది.

మిడుతలు అక్రిడిడే కుటుంబంలోని కొన్ని జాతులకు సంబంధించినవి.  మిడతలు సమూహ దశను కలిగి ఉంటాయి. ఈ కీటకాలు సాధారణంగా ఏకాంతంగా ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితులలో అవి మరింత సమృద్ధిగా సంతానోత్పత్తిని చేస్తాయి. వాటి ప్రవర్తన,  అలవాట్లను మార్చుకుంటాయి. మిడత జాతుల మధ్య వర్గీకరణ వ్యత్యాసం లేదు. ఒక జాతి అడపాదడపా తగిన పరిస్థితులలో సమూహాలను ఏర్పరిచే అవకాశం వుంది.  కోన్ని జాతి మిడతలు హానికరం కావు. వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. వ్యవసాయానికి పెద్ద ఆర్థిక ముప్పు కలిగించవు. ఏదేమైనా, వేగవంతమైన వ్యవసాయ అభివృద్ధి జరిగిన తరువాత, కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో, వాటి మెదడుల్లోని సెరోటోనిన్  మార్పులను ప్రేరేపిస్తుంది. అవి సమృద్ధిగా సంతానోత్పత్తి చేయటం ప్రారంభిస్తాయి.  వాటి  జనాభా తగినంత దట్టంగా మారినప్పుడు అవి పెద్దగా, సంచారంగా మారుతాయి. ఇవి వలసలు ప్రారంభిస్తాయి. తరువాత ఇవి రెక్కలున్న పెద్ద సమూహంగా మారుతాయి. తర్వాత వేగంగా పొలాల్లోని పంటలకు నష్టం కలిగిస్తాయి. శక్తివంతమైన ఫ్లైయర్స్ గా మారతాయి. ఇవి చాలా దూరం ప్రయాణించగలవు.  సమూహం వెళ్లేటప్పుడు తన దారిలో అడ్డువచ్చిన ఆకుపచ్చ మోక్కలను తినేస్తాయి. 

ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రస్తుతం మిడుత కార్యకలాపాల వల్ల నష్టపోయే మూడు హాట్‌స్పాట్‌లను గుర్తించింది. ఈ హాట్ స్పాట్ లలో  పరిస్థితి చాలా భయనకంగా వుంటుంది.  హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఎర్ర సముద్ర ప్రాంతం, నైరుతి ఆసియాలను హాట్ స్పాట్ లుగా ఎఫ్ ఎ ఓ గుర్తించింది. ఆఫ్రికా హార్న్ ఎక్కువ ప్రభావిత ప్రాంతంగా పిలువబడింది.  ఇక్కడ FAO ఆహార భద్రత, జీవనోపాధికి ఎక్కువ ముప్పు ఉందని పేర్కొంది. ఇథియోపియా,  సోమాలియా నుండి మిడుత సమూహాలు దక్షిణాన కెన్యా ఖండంలోని 14 ఇతర దేశాలకు ప్రయాణించాయి. ఇథియోపియాలోని రిఫ్ట్ వ్యాలీ కూడా తెగులుతో బాధపడుతోంది. ఈ వ్యాప్తి 25 సంవత్సరాలుగా ఇథియోపియా సోమాలియాను తాకుతోంది. గత 70 సంవత్సరాలలో కెన్యా  అత్యంత ఘోరమైన ముట్టడి ప్రాంతంగా మారింది. అంతర్జాతీయ సమాజ సహాయం లేకుండా, జూన్ నాటికి ఈ ప్రాంతం అంతటా మిడుతలు 500 రెట్లు పెరుగుతాయని FAO తెలిపింది. ఎర్ర సముద్రం ప్రాంతంలో, సౌదీ అరేబియా, ఒమన్ , యమన్ లలో మిడుతలు వచ్చేశాయి. ఇండో-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం నుండి ఈ సమూహాలు ఇక్కడకు వచ్చాయని భావిస్తున్నారు. నైరుతి ఆసియాలో, మిడుతల సమూహాలు ఇరాన్, భారతదేశం, పాకిస్తాన్లలో నష్టాన్ని కలిగించాయి.

యుఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చే డిజిటల్  మ్యాపులు     మిడుతలు ఉన్న ప్రాంతాలను, వాటి కదలికలను చూపిస్తాయి. భారతదేశంలో నాలుగు జాతుల మిడుతలు కనిపిస్తాయి. ఎడారి మిడుత (స్కిస్టోసెర్కా గ్రెగారియా), వలస మిడుత (లోకస్టా మైగ్రేటోరియా), బొంబాయి లోకస్ట్ (నోమాడాక్రిస్ సక్సింక్టా), చెట్టు మిడుత (అనాక్రిడియం). ఎడారి మిడుత భారతదేశంలోను,  అంతర్జాతీయంగా కూడా అత్యంత వినాశకరమైన తెగులుగా పరిగణించబడుతుంది. ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఒక చిన్న సమూహంతో (35,000 సంఖ్యతో) ఒకే రోజులో పచ్చని పంటలను తినగలుగుతాయి. ఈ కీటకాలు వ్యవసాయ భూములను,  మిలియన్ డాలర్ల విలువైన పంటలను దెబ్బతీశాయి. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. పశ్చిమ రాజస్థాన్ మిడతల నుండి ఇబ్బందులు పడుతూనే వుంది. 10 జిల్లాల్లో కనీసం 3.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మిడుతలు పంటలను దెబ్బతీశాయి.

మిడుత జనాభాను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల  నష్టాన్ని తగ్గించే ప్రయత్నాలు జరగడం లేదు.  మిడుతలు సంచార దశకు చేరుకోవడానికి ముందే వాటిని  పురుగుమందులతో నాశనం చేయవచ్చు. మొరాకో, సౌదీ అరేబియా వంటి ధనిక దేశాలలో వారు నూతన సాంకేతిక పద్ధతులతో వాటిని ముందుగానే నాశనం చేస్తున్నారు. కాని పొరుగున ఉన్న పేద దేశాలకు (మౌరిటానియా, యెమెన్, మొదలైనవి) వనరులు లేవు. ఆయా ప్రాంతాల లోని పంటలను మిడుత సమూహాల నాశనం చేస్తున్నాయి.

ప్రపంచంలోని అనేక సంస్థలు మిడుతలు నుండి వచ్చే ముప్పును పర్యవేక్షిస్తాయి.  సమీప భవిష్యత్తులో మిడుత తెగుళ్ళతో బాధపడే ప్రాంతాలను గుర్తించి ముందుగానే సమాచారాన్ని ఇస్తున్నారు. సూచనలను అందజేస్తున్నారు. ఈ వివరాలను ఆస్ట్రేలియన్ ప్లేగు లోకస్ట్ కమిషన్ అందిస్తోంది. అభివృద్ధి చెందుతున్న మిడతల వ్యాప్తిని నివారించడానికి, వాటితో జాగ్రత్తగా వ్యవహరించడానికి ఈ కమీషన్ ఉపయోగపడుతోంది.   కాని మిగతా చోట్ల నుండి మిడుత దండయాత్రలు లేకుండా పర్యవేక్షించడానికి,  రక్షించడానికి సరైన సంస్ధలు లేవని చెప్పచ్చు. మధ్య దక్షిణాఫ్రికా కోరకు అంతర్జాతీయ లోకస్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సేవలను అందిస్తుంది. పశ్చిమ, వాయువ్య ఆఫ్రికాలో, ఈ సేవను పశ్చిమ ప్రాంతంలోని ఎడారి మిడుతలను నియంత్రించడానికి ఆహార, వ్యవసాయ సంస్థ కమిషన్ పని చేస్తోంది. ప్రతి దేశానికి చెందిన మిడుత నియంత్రణ సంస్థలు శక్తివంతంగానే పనిచేస్తున్నాయి. కాకసస్, మధ్య ఆసియాలో 25 మిలియన్ హెక్టార్ల సాగు భూమిని  కూడా FAO పర్యవేక్షిస్తుంది.

భారత్లో మిడుత నియంత్రణకు కోన్ని సంప్రదాయక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అవసరమైనప్పుడు ట్రాక్టర్ ఆధారిత స్ప్రేయర్‌లను ఉపయోగిస్తారు. నీటి ఆధారిత పురుగుమందులను వేయడం ద్వారా హాప్పర్‌లను ప్రారంభంలోనే నాశనం చేస్తున్నారు. ఇది ప్రభావవంతమైనది అయినప్పటికి,   శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే మిడతల దండు వేల ఎకరాలపంటలను కోద్ది రోజులలోనే నాశనం చేస్తాయి. అటువంటప్పడు, సాధ్యమైన చోట, కీటకాలపై,  అవి తినే  వృక్షసంపదపై విమానం నుండి సాంద్రీకృత పురుగుమందులను చల్లాలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద ప్రాంతాలను వేగంగా చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. మిడుత నియంత్రణ ప్రణాళిక కోసం ఉపయోగించే ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో GPS, GIS సాధనాలు ముఖ్యమైనవి. ఉపగ్రహ చిత్రాల ద్వారా  కంప్యూటర్లు వేగంగా డేటా నిర్వహణ, విశ్లేషణలను అందిస్తాయి.

మిడుతలను నియంత్రించడానికి  పురుగుమందును 1997 లో ఆఫ్రికా అంతటా ఒక బహుళజాతి బృందం పరీక్షించింది. సంతానోత్పత్తి ప్రదేశాలలో పిచికారీ చేయబడింది.  మెటార్జిజియం యాక్రిడమ్ అనే ఈ మందు ఎండిన ఫంగల్ బీజాంశపు అంకురోత్పత్తిపై పనిచేస్తుంది.  మిడుత శరీర కుహరంపై దాడి చేసి వాటి మరణానికి కారణమవుతుంది.  మిడుత నియంత్రణకు ఈ విధానం 2009 లో టాంజానియాలో ఉపయోగించబడింది.  మిడుతలు సోకిన ఇకు-కటావి నేషనల్ పార్క్‌లో సుమారు 10,000 హెక్టార్లలో చికిత్స చేయడానికి ఈ మందు ఉపయోగించబడింది. మందు చల్లినప్పిటికీ ఈ ప్రాంతంలో ఉన్న ఏనుగులు, హిప్పోపొటామస్, జిరాఫీలు క్షేమంగా ఉన్నాయని ఆ దేశం తెలిపింది. మిడుత నియంత్రణలో అంతిమ లక్ష్యం పర్యావరణాన్ని కాపాడటమే.  క్రియాశీల పద్ధతులను ఉపయోగించి పర్యావరణ కాలష్యాలను తగ్గించాలి.  స్థానిక ప్రజల మనుగడకు పంటలు పండించడం అత్యవసరం. సహజంగా సంభవించే ఫంగస్ మెటార్జిజియం చేత  మిడుతలు చంపబడటం ఉత్తమమైన మార్గమని పర్యావరన వేత్తలు భావిస్తారు.  జీవ నియంత్రణకు, పర్యావరణకు ఈ మార్గం అనుకూలమైనది.  

నియంత్రణ కార్యకలాపాలు లేకపోతే, మిడతల దాడి పరిమాణం 2019-20 రబీ సీజన్ కంటే ఘోరంగా ఉండవచ్చు. LWO ప్రకారం, గత సంవత్సరం లోకస్ట్ (1993 తరువాత) వల్ల రాజస్థాన్, గుజరాత్‌లోని స్థానిక అధికారులు ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై స్ప్రేయర్‌లతో 4.30 లక్షల హెక్టార్లకు పైగా ప్రభావిత ప్రాంతాలలో మందును పిచికారి చేయాల్సి వచ్చింది.  ఆర్గానోఫాస్ఫేట్ పురుగుమందులు, మలాథియాన్ (96% అల్ట్రా తక్కువ వాల్యూమ్ తో) మిడుతలకు వ్యతిరేకంగా ప్రభావశీలంగా పనిచేస్తాయని వ్యవసాయ శాస్రవేత్తలు అంటున్నారు. మిడత విశ్రాంతి తీసుకునే చెట్లతో సహా, వాటి సంతానోత్పత్తి ప్రాంతాలలో ఒక హెక్టార్ విస్తీర్ణ  చికిత్స కోసం ఒక లీటరు రసాయనం అవసరమవుతుంది. అయితే ఈ రసాయనాల వల్ల పంట ఉత్పత్తి కలుషితమయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏ రకమైన మిడుతలను నియంత్రించడానికైనా  పురుగుమందుల నిల్వలు తగినంతగా ఉన్నాయని ఎల్‌డబ్ల్యుఓ పేర్కొంది. నియంత్రణ కార్యకలాపాలకు పరికరాల కొనుగోలు, క్షేత్ర స్ధాయిలో బృందాలకు శిక్షణ, ప్రధాన సంతానోత్పత్తి ప్రదేశాలలో సరఫరా తయారీ, ఆకస్మిక ప్రణాళికలను రచించడం అవసరమవుతంది. 

అంచనాలకు తగ్గట్టుగానే మిడతలు భారత్ లోకి ప్రవేశించాయి.  గత ఏడాది ఆఫ్రికా ఖండంలో అధిక వర్షపాతం నమోదు అయింది.  అందువల్లే ఎడారి మిడతలు సంతానోత్పత్తిని అధికం చేయగలిగాయని భారత్ శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ మీదుగా భారత్‌కు చేరే ప్రమాదం వుందని పర్యావరన వేత్తలు ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అయినా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.  మిడతల దండు దాడులను జాతీయ సమస్యగా కేంద్రం గుర్తించడం లేదు. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లో మిడతల దండులు వచ్చిన్నట్టు 28.5.20న అధికారులు ప్రకటించారు. మే 1 నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మిడతల దండులు వచ్చాయి. అయితే వీటి సంఖ్య చాలా తక్కువుగా వుందని భయపడాల్సిన పనిలేదని రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు మీడియాకు చెప్పారు.

మిడతలను సంహరించడానికి  ఉత్తరాదిన ట్రాక్టర్లకు స్ప్రేయర్లను బిగించి రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ రసాయనాల వల్ల పంటలు దెబ్బతినే అవకాశం వుంది. వేప ఆకులతో రసం చేసి, చెట్లు, మొక్కలపై స్ప్రే చేయడం ద్వారా మిడతల దండు దారిని మరిలించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. రాసాయనాల పిచికారీతో వాటిని చంపితే పర్యావరణ సమతుల్యానికి విఘాతం ఏర్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు మిడతల సంహారానికి స్ప్రేయర్ల కొరతను భారత్ ఎదుర్కొంటోంది. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. బ్రిటన్‌ నుండి 60 స్ప్రేయర్లను కొనుగోలు చేశారు. కానీ వాటిలో జూన్‌ రెండవ వారంలో 15, చివరి వారంలో 20, జూలైలో 25 భారత్‌కు వస్తాయని అధికారులు అంటున్నారు. ఈ లోపల మిడతలు లక్షల ఎకరాల్లో పంటను నాశనం చేస్తే రైతులు రోడ్డున పడతారు. తీవ్రమైన ఆహారకొరత ఏర్పడే ప్రమాదముంది.

జూన్‌, జులైనెలల్లో తెలుగు రాష్ట్రాల్లో మిడతల  ప్రభావం అదికంగా ఉండొచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.  ప్రధాన పంటలైన వరి, పత్తి, మిర్చిలపై మిడత దండులు దాడులు చేస్తే రైతులు తీవ్రంగా  నష్ట పోతారు. కరోనా వల్ల ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఆంధ్రప్రదేశ్ రైతులు కష్టాలు పడుతున్నారు. 1993లో మిడతల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పంటలు దెబ్బ తిన్నాయి. 18 సంవత్సరాల తర్వాత మళ్లీ  ఈ ముప్పును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోతోంది. కేంద్ర ప్రభుత్వంతోను, ఇతర రాష్ట్రాలతోనూ సమన్వయం చేసుకోవడం, పాలనాపరమైన చర్యలు చేపట్టడంతోబాటు రైతాంగాన్ని అప్రమత్తం చేయాలి. మిడతలు పొలాల్లోకి ప్రవేశించకుండా ముందుగానే మంటలు వేయడం వంటివి క్షేత్రస్థాయిన జరగాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  పంటల సంరక్షణకు, సమాజానికి సంబంధించిన అంశం కనుక రాజకీయ పార్టీలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద, ప్రజాస్వామ్య  సంస్థలను ఇందులో ప్రభుత్వాలు భాగస్వామ్యం చేయాలి. కరోనాతో ఏర్పడిన ఆహార కొరతను, మిడతల దాడులు మరింత తీవ్రతరం చేయనున్నాయి.  ఈ ప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వాలతో పాటు ప్రజలు తమ వంతు కృషి చేయాలి

ప్రస్తుత లాక్డౌన్ పాలనలో ఈ కార్యకలాపాలు సాంకేతికంగా నిషేధించబడలేదు. అయినా శీఘ్రంగా వ్యవహరించడం అత్యవసరం. ఆధునిక నాగరికత, నూతన సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా ప్రకృతి మానవ మనుగడకు సవాలు విసురుతూనే వుంది. ఈ సవాలును స్వీకరిస్తూ, ప్రకృతికి నష్టం వాటిల్లకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. కరోనా మనుషులను నాశనం చేస్తే, మిడతలు మనుషులు తినే పంటలను నాశనం చేస్తాయి. ఈ మిడత దండులు అధిక సంఖ్యలో తయారవడానికి, లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేయడానికి అడవులను నరికివేసే పారిశ్రామికీకరణే ప్రధాన కారణంగా వుంది. 


Comments