కార్మిక చట్టాల సవరణలతో బానిసలైన శ్రమజీవులు

Uttam's Take: To hell with Labour Laws! - Rediff.com India News

 ప్రపంచ వ్యాప్తంగా కార్మికులకు మేడే స్ఫూర్తిదాయకమైన రోజు. పెట్టుబడిదారుల విచ్చలవిడి దోపిడిని ప్రశ్నించి, పోరాడి, రక్తతర్పణం చేసి  కార్మిక వర్గం 8 గంటల పని విధానాన్ని సాధించుకుంది. కార్మికుల వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ, తమ ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, మంచి భవిష్యత్తు కోసం  కార్మికులు మేడే సందర్భంగా సంసిద్దమవ్వాలి.

 ఇవాళ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ, ప్రజల ప్రాణాలను హరించి వేస్తూ, మారణహోమాన్ని సృష్టిస్తూ ఉంది. కరోనా వైరస్ కు ధనికులు, పేదలు  అనే తేడా లేదు. జాతి, మత, కుల, లింగ వివక్షత చూపదు.  కరోనా సంక్షోభం లో దేశంలోని వలస కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది.

 కరోనా  వైరస్ ను నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దీని ఫలితంగా  ఆర్థిక రంగం స్తంభించి పోయింది. ఉత్పత్తికి సంబంధించిన అన్ని రంగాలు ఆగిపోయాయి. కార్మికుని చేయి ఆగిపోతే ప్రపంచం స్తంభించి పోతుందనే విషయం ఎంత వాస్తవమో అనుభవంలోకి వచ్చింది. ఆర్థిక రంగంలో సంక్షోభానికి  కార్మికులు, పేద, బడుగు వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులకు మొదటగా గురవుతారు. కరోనా వైరస్ తో చనిపోయే వారికంటే ఆకలితో  ఎక్కువ మంది చనిపోతున్నారని  మీడియా వార్తలు చెప్తున్నాయి.

వలస కార్మికుల మరణాలు

దేశంలో మే 1 నాటికి కరోనా వైరస్ కేసుల సంఖ్య  35,365.  మరణించిన వారి సంఖ్య 1,152. లాక్ డౌన్  ప్రకటించినా, కరోనా వైరస్ పరీక్షలు పెరిగినా, అవసరమైన చికిత్స అందించినా, ఈ నాటికి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్  ప్రకటించిన 50 రోజుల తర్వాత కూడా వలస కార్మికుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి.  వీరంతా కరోనా వైరస్ సోకి  చనిపోలేదు. ఆకలి, రోడ్డు ప్రమాదాల, ఇతర కారణాల వల్ల చనిపోయారు.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత చర్యల కారణంగానే వలస కార్మికులు చనిపోయారు. మే 9 వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 378  మంది వలస కార్మికులు చనిపోయారు.  తమ స్వస్థలాలకు నడిచిపోతుండగా రోడ్డు, రైలు ప్రమాదాలకు గురై 74 మంది వలస కార్మికులు చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేయక పోవడం వల్ల  కార్మికులకు నడక ఒక్కటే ప్రధాన సాధనంగా మారింది.  ఆర్థిక బాధలకు గురై 47 మంది వలస కార్మికులు చనిపోయారు. నడకతో అలసిపోయి తీవ్రమైన నీరసంతో 26 మంది చనిపోయారు. పోలీసుల దెబ్బల వల్ల 12 మంది చనిపోయారు. సాధారణ వైద్య సేవలు  లేకపోవడం వల్ల 40 మంది రోగులు మరణించారు. కరోనా సోకుతుందని భయంతో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు. లాక్డౌన్ సంబంధిత నేరాలు ఆరోపణల కారణంగా చనిపోయిన వారు 14 మంది.  ఇతర కారణాల వల్ల 41 మంది చనిపోయారు.  ఈ మరణాల గణాంకాలు పత్రిక ల్లోను వచ్చాయి. ప్రభుత్వ నిర్లక్షం వల్లే  వీరంతా చనిపోయారు. 

అసమాన అభివృద్ధి

 శ్రమజీవుల వలసలకు ప్రధాన కారణం అసమాన అభివృద్ధి. కొన్ని రాష్ట్రాలు పారిశ్రామికంగానూ, ఇతరత్రాను  చాలా అభివృద్ధి చెందాయి. కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. వ్యవసాయ రంగం కూడా రోజురోజుకు సంక్షోభం లోకి వెళుతోంది. నిరుద్యోగ శాతం పెరుగుతోంది.  బ్రతుకుతెరువు కోసం, ఉపాధి కోసం, వెనుకబడిన రాష్ట్రాల నుండి పేద ప్రజలు  అభివృద్ధి చెందిన పట్టణాలకు వలస వెళ్లడం సాధారణమైపోయింది. ఈ వలసలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 

  2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. 2001-2011 మధ్యలో అంతర్ రాష్ట్ర వలస కార్మికుల సంఖ్య 139 మిలియన్లుగా (13.9 కోట్లు)గా అంచనా వేశారు. 20 సంవత్సరాల తర్వాత వీరి సంఖ్య  దాదాపు 20 కోట్లకు పెరిగింది. 2017 ఆర్థిక సర్వే ప్రతి సంవత్సరం 90 లక్షల మంది ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వలస పోతున్నారని ప్రకటించింది.  నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం వలస కార్మికులు (అంతర్రాష్ట్ర,అంతర్ జిల్లా) దేశంలోని మొత్తం కార్మికుల జనాభాలో 28.3 శాతంగా అంచనా వేసింది.  2019 నాటికి వ్యవసాయ రంగంలో 43.21 శాతం, పారిశ్రామిక రంగంలో 24 శాతం, సర్వీస్ రంగంలో 31.9 శాతం శ్రామికులు పనిచేస్తున్నారు. ఈ మూడు రంగాల్లో సర్వీసు రంగం ఎక్కువుగా అభివృద్ధి చెందుతూ ఉంది. భవన నిర్మాణ రంగంలో వలస కార్మికులు ఎక్కువ శాతం పనిచేస్తున్నారు. సంఘటిత రంగం లోనే కొంత వరకు ఉద్యోగానికి సంబంధించిన రక్షణ, భద్రత ఉంటుది. అసంఘటిత రంగంలో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి రక్షణ ఉండదు. అసంఘటిత రంగంలోని  పరిశ్రమలు, కర్మాగారాలు రిజిస్టర్ కూడా అయి ఉండవు. 

 1979 లో అంతర్రాష్ట్ర వలస కార్మికుల(క్రమబద్దీకరణ, పని పరిస్థితుల)  చట్టం తీసుకు వచ్చినా 1982 వరకు అమలుకు నోచుకోలేదు. ఈ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలను ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఈ చట్టంలో మొత్తం 36 సెక్షన్లు , 7  అధ్యాయాలు వున్నాయి. ఒక షెడ్యూలును జత చేశారు.  ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు వలస కార్మికులకు భద్రతను కల్పించాలి. వలస కార్మికులను సరఫరా చేసే కాంట్రాక్టర్ల దోపిడీ నుండి ఈ చట్టం రక్షిస్తుంది. వలస కార్మికుల నియామకాలను, క్రమబద్దీకరణనకు సంబంధించి కోన్ని నియమాలను చట్టంలో పోందుపరిచారు.  మంచి పని పరిస్ధితులను కల్పించాలి. ఇక్కడ క్రమబద్ధీకరణ అంటే తాత్కాలిక ఉద్యోగాలను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయడం, హోదా ఇవ్వడం కాదు. వలస కార్మికులను నియమించుకునే   పరిశ్రమలను, ఫ్యాక్టరీలను, సంస్థలను రిజిస్టర్ చేయడం. వలస కార్మికుల వివరాలను రిజిస్టర్ చేయడం.

చట్టాలు ఏం చెపుతున్నాయి

 ఈ చట్టం ప్రకారం ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో 5ం మంది కంటే తక్కువ కాకుండా పనిచేస్తుండాలి. ప్రత్యక్షంగా యాజమాన్యం లేదా, కాంట్రాక్టర్ల ద్వారా పని చేయడానికి నియమించబడ్డ వాళ్లై వుండాలి.  కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా స్వయంగా వలస కార్మికులు తమకు తామే పనిలో చేరితే ఈ చట్టం వర్తించదు. ఒక రాష్ట్రానికి చెంది, మరోక రాష్ట్రంలో పనిచేస్తున్న వారినే అంతర్ ర్రాష్ట్ర కార్మికులని అంటారు.  వాస్తవానికి కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా పనిలో చేరిన వారి సంఖ్యే అధికంగా వుందని అనేక పరిశోధనలు నిర్ధారించాయి.

 ఈ చట్టం ప్రకారం, యాజమాన్యాలు అంతర్రాష్ట్ర వలస కార్మికులను నియమించుకుంటే తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఏ రాష్ట్రం నుండి  కాంట్రాక్టర్ వలస కార్మికులను రిక్రూట్  చేసుకుంటాడో ఆ రాష్ట్ర అధికారుల నుండి లైసెన్స్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్, లైసెన్సు లేకుండా  ఇతక ర్రాష్ట్ర వలసకార్మికులను నియమించుకోకూడదు. ఈ యాజమాన్యాలు, కాంట్రక్టర్లు  విధిగా వలస కూలీల వ్యక్తిగత వివరాలను, వేతనాలు చెల్లించే విధివిధానాలను, పనిస్థలంలో కల్పించే సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు (Labour commissioner)కు రాతపూర్వకంగా ఇవ్వాలి. చట్టంలో నిర్దేశించిన రికార్డులను ప్రతి ఆరు నెలలకు సదరు సంస్ధలు ప్రభుత్వానికి అందించాలి. 

 ఈ చట్టంలో వివరించిన లేబర్ ఇన్స్పెక్టర్ల  వ్యవస్థ చాలా ప్రధానమైంది. ఫ్యాక్టరీలను పని స్థలాలను  వెళ్లి తనిఖీ చేయాలి. చట్ట వ్యతిరేకంగా యాజమాన్యం, కాంట్రాక్టర్లు నడుచుకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు.  నిజానికి చట్టం నిర్దేంశించిన అంశాలను పరిశ్రమ యజమానులు పాటించడం లేదు. ప్రభుత్వ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల చట్ట అమలు సరిగా జరగడం లేదు.  

అంతర్ రాష్ట్ర వలస కార్మికుల నియామకం జరిగిన 15 రోజుల లోపు వారి వివరాలను సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా ఇవ్వాలి. వలస కార్మికుని  పేరిట ఒక పాస్ బుక్ ను తయారు చేసి, వలస కార్మికునికి ఇవ్వాలి. ఇందులో వలస కార్మికుని  ఫోటోను అతికించాలి. ఏ సంస్థ లో  నియామకం జరిగిందో దానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. నియామకం, కాలపరిమితి, వేతనాలు, వేతనాల చెల్లింపు పద్ధతి, వలస కార్మికున్ని తొలగించిన సందర్భంలో చెల్లించిన భత్యం (Allowance) తదితర అంశాలను పేర్కోనాలి.  పనిచేసే రాష్ట్రం నుండి సొంత ఊరుకు వెళ్లడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు చెల్లించాలి. వీటి వివరాలను లేబర్ కమిషనర్ కు తెలియజేయాలి. ప్రయాణ ఖర్చులను కాంట్రాక్టర్లే భరించాలి.  

 కాంట్రాక్టరు కార్మికును పని ప్రదేశాన్ని మారిస్తే, వేతనంలో 50% అదనంగా చెల్లించాలి. ఆర్టికల్ 16 కూడా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలకు తక్కువ కాకుండా చెల్లించాలని నిర్దేశించింది. అంతేకాకుండా వేతనాలను రెగ్యులర్ గా చెల్లించాలి. మంచి పని పరిస్థితులను కల్పించాలి. నివసించడానికి శుభ్రమైన, సుస్థిరమైన సౌకర్యాలను పని ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. వైద్య సౌకర్యాలను కల్పించాలి. వలస కార్మికులు పని చేసే చోట భద్రతా నియమాలను పాటించాలి. పని చేసే క్రమంలో ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు, కార్మికుని బంధువులకు సమాచారం ఇవ్వాలి. ఈ బాధ్యతలను కాంట్రాక్టర్లు తప్పనిసరిగా నిర్వర్తించాలి. లేకపోతే ఈ చట్టం ప్రకారం సదరు కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. కార్మికునికి కాంట్రాక్టరు వేతనాలు చెల్లించకపోతే ప్రధాన యజమాని చెల్లించాలి.  ఈ చట్టం అమలు చేయవలసిన బాధ్యత లేబర్ ఇన్స్పెక్టర్లదే. వీరు  యజమానులకు, కాంట్రాక్టర్లకు, అనుకూలంగా వ్యవహరిస్తూ చట్టం ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నారు. ఈ చట్టం యజమానుల, కాంట్రాక్టర్ల బాధ్యతా రాహిత్యాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. చట్టాన్ని అధికమించిన వారు శిక్షార్హులు అవుతారు. నేరం రుజువైతే,  వీరికి గరిష్టంగా రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించవచ్చు.  1000 నుండి 2000 రూపాయల వరకు  అపరాధ రుసుమును చెల్లించాలి. వలస కార్మికులు ఫిర్యాదులు చేయడానికి వీలులేదు. లేబర్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఫిర్యాదు చేయాలి.

 ఇంతవరకు ఈ చట్టం క్రింద యజమానులకు కార్మికులకు శిక్ష పడిన సంఘటనలే లేవు. వలస కార్మికులపై వివక్ష ప్రదర్శించ కూడదు.  కార్మికుల నష్టపరిహార చట్టం 1923,   వేతనాల  చెల్లింపు చట్టం 1936, పారిశ్రామిక వివాదాల చట్టం, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ చట్టం 1948,  ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ చట్టాలను  ప్రభుత్వాలు నిర్దిష్టంగా అమలు చేయడం లేదు.  కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు పరిస్తే, పరిశ్రమలను మూసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వాలు, పరిశ్రమ యజమానులు చెపుతున్నారు.  కార్మికుని శ్రమను తక్కువ వేతనంతో దోచుకోవడమే  పెట్టుబడిదారుల లక్ష్యం.  వారికి అవసరం లేనప్పుడు, లాభసాటిగా  ఉండనప్పుడు కార్మికులను పని నుండి గెంటేస్తారు.  

లాక్ డౌన్ కష్టాలు

లాక్ డౌన్ కాలంలో వేతనాలు చెల్లించాలనీ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వాటిని యజమానులు  పట్టించుకోలేదు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు సగం జీతమే చెల్లించారు. ఇంటి యజమానులు బాడుగలు చెల్లించకపోతే ఖాళీ చేయించారు. ఉపాధి లేక, వేతనాలు లేక, వలస కార్మికులు కుటుంబాలు ఆకలితో అలమటించారు. అందుకే వారు తమ సొంత ఊర్లకు వేల మైళ్లు నడిచి మరీ వెళుతున్నారు. ప్రభుత్వం వీరి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించింది. ప్రయాణ సౌకర్యాలను (రైళ్లు, బస్సులు) ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేసింది. ప్రయాణ ఖర్చులను వసూలు చేయాలని చెప్పింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలను రద్దు చేసింది. క్వారంటైన్ సెంటర్లలో నిర్బంధించింది. కరోనా వుంటుందనే నెపంతో వలస కార్మికులపై ద్రావణాలను కోంతమంది ప్రభుత్వ అధికారులు పిచికారీ చేశారు. పోలీసులు లాఠీచార్జిలకు పాల్పడ్డారు. వలస కార్మికులపై కేసులు పెట్టారు. దేశవ్యాప్తంగా వలస కార్మికుల  దుస్థితి పట్ల సోషల్ మీడియాలో  ప్రభుత్వ బాధ్యత రాహిత్యం గురించి ప్రచారం జరిగింది. ఆ తర్వాతనే శ్రామిక రైళ్లను  కేంద్ర ప్రభుత్వం నడపడానికి సిద్ధపడింది.

  అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల  ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి అసంఘటిత కార్మికుల (సామాజిక భద్రత) చట్టం 2008,  కాంట్రాక్ట్ లేబర్ రేగులేషన్ అండ్  అబాలిషన్ చట్టం 1970,   బిల్డింగ్ అండ్ ఆనర్ కన్స్ట్రక్షన్ వర్కర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1996,  వెట్టిచాకిరి రద్దు చట్టం 1970,  బాల కార్మికుల నిషేధ చట్టం 1986.  ఈ చట్టాలన్నీ కార్మికుల తమ పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకున్నివి. కానీ అసంఘటిత రంగంలో కార్మికోద్యమం  బలహీనంగా ఉన్నందున ఈ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.

 బానిసలుగా  కార్మికులు

ప్రస్తుతం కేవలం 8శాతం కార్మికులకే   కార్మిక సంఘాల్లో సభ్యత్వం ఉంది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. మన దేశంలో కార్మిక చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయనీ, ఫలితంగా తాము చాలా ఇబ్బందులకు గురవుతున్నామనీ, పరిశ్రమ అధిపతులు చాలా కాలంగా వాదిస్తున్నారు. సునాయాసంగా వ్యాపారం చేయడానికి ఈ చట్టాలను సరళంగా మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వాలు కూడా వీరి డిమాండ్ లను అంగీకరించింది. 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 చట్టాలుగా తీసుకు వస్తున్నారు. రాష్ట్రాల్లో 200కు పైగా చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగం 7వ షెడ్యూల్లో ఉమ్మడి జాబితా ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు లేబర్ చట్టాలను తయారు చేయవచ్చు.  బ్రిటిష్ పాలనలో చేసిన చట్టాలు కొన్ని ఇంకా కొనసాగుతున్నాయి. కార్మిక చట్టాలను రద్దు చేయడం, సరళం  చేయడం వెనుక పెట్టుబడిదారుల హస్తం వుంది.   ఎటువంటి ఆంక్షలు లేకుండా , ప్రభుత్వ ప్రమేయం లేకుండా,  కార్మికుల శ్రమను దోచుకోవడానికే పెట్టుబడిదారులు ప్రభుత్వాల చేత కార్మిక చట్టాలను నిర్వీర్యపరుస్తున్నారు.   దేశంలోని జాతీయ కార్మిక సంఘాలు లేబర్ సంస్కరణలను కొంతమేరకు ఆపగలిగాయి.  ప్రస్తుతం కోవిడ్ వైరస్ కారణంగా స్తబ్దతకు గురైన   ఆర్థిక రంగాన్ని  పునరుద్ధరించాలన్నా, పరిశ్రమలను  పునఃప్రారంభించాలన్నా ఉద్యోగాలను కాపాడలన్నా, కొత్త ఉద్యోగాలను  సృష్టించాలన్నా  లేబర్ చట్టాలను రద్దు చేయాలని ప్పారిశ్రామిక యజమానులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచారు. ఇప్పటికే దేశంలోని బిజేపి పాలిత  రాష్ట్రాలు కార్మిక చట్టాలను 1000 రోజుల పాటు ఫ్రీజ్ చేశాయి. 

 లేబరు చట్టాలను అమలు చేయడానికి  మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మినహాయింపును 1000 రోజులు తర్వాత కూడా పోడిగించే అవకాశం వుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 4 చట్టాలు ఆచరణలోనికీి వస్తే కార్మికుల హక్కలు కాలరాయబడతాయి. లేబర్ సంస్కరణల్లో కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఉండవు. నిర్దిష్ట కాలపరిమితి మేరకే యాజమాన్యాలు నియామకాలు చేస్తాయి. ఆ తర్వాత తొలగించి వేస్తారు. నూతన కార్మిక చట్ట సవరణల ప్రకారం కార్మికులకు   కనీస వసతులను (గాలి, వెలుతురు, వెంటిలేషన్లు), మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. లేబర్ ఇన్స్పెక్టర్ల తనికీ ఉండదు. యజమానులే స్వయంగా అంతా బాగుందనే సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు.    ప్రస్తుతం కనీస వేతనాలు చెల్లించడానికి కూడా యజమానులు మినహాయింపు కోరుతున్నారు. 12 గంటలు పనిని చట్టబద్ధం చేయమన్నారు.  అంతిమంగా కార్మికులు బానిసలుగా మారబోతున్నారు.  ఈ పరిస్ధితిని నిలువరించాలంటే దేశంలోని కార్మిక సంఘాలతో పాటు, ప్రజాసంఘాలు అందురూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం వుంది. 

కార్మిక సంఘాల కర్తవ్యం

 కార్మిక సంఘాల కార్యాచరణ ఆర్థిక డిమాండ్లకే పరిమితమై వుంది. ప్రభుత్వం లేబర్ చట్టాల్లో తీసుకు వస్తున్న మార్పులను నిలువరించ లేకపోతే కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. కరోనా వైరస్ నెపంతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల  వల్ల ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరి మరోమారు బహిర్గతమైంది. కోరనా  పెట్టుబడిదారుల పర్యావరణ విధ్వంసాన్ని ఎత్తి చూపించింది.  పెట్టుబడిదారీ వ్యవస్థ కరోనా వైరస్ సృష్టించిన మారణహోమాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. గాలి, నీరు, భూమినే కాదు కార్మికుల కన్నీళ్లను సైతం పెట్టుబడిదారీ వ్యవస్ధ సరుకుగా చేసి విక్రయిస్తుంది.  దేశంలోని కార్మిక సంఘాలన్నీ కార్మికుల హక్కుల కోసం పోరాడాలి. ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడటం కోసం కార్మికులను  సిద్దం చేయాల్సిన చారిత్రక బాధ్యత కూడా కార్మికే సంఘాలపై ఉంది.

- ప్రోఫెసర్ శేషయ్య

Comments