దళితులు తరతరాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అణిచివేతకు గురవుతున్నారు. దళితులు అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురవుతున్నారు.
దేశంలో దళితులపై దాడులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. అభ్యుదయకర శక్తులు బలహీనపడటము, కుల సంఘాలు తమ ఉనికి కోసం మాత్రమే పోరాటాలు నడపడము, దళితుల్లో చైతన్యం లేకపోవడం, సామ్రాజ్యవాద విధానాలు
కొత్త రూపాల్లో వివక్షకు కారణమవుతున్నాయి.
కుల సమస్యను అర్థం చేసుకోవడంలోనే వివిధ కుల సంఘాల మధ్య తీవ్ర గందరగోళం నెలకొనివుంది.
ఒక్క దళితులను మినహాయిస్తే, శూద్రులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడ్డారు. వీళ్ళు అధిపత్యస్తాన్నాల్లోకి వచ్చారు.
గతంలో కులపరంగా వివక్షను వీళ్లంతా ఎదుర్కున్న వాళ్ళే.
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కొన్ని కులాలు పైకి వచ్చాయి. కుల అణిచివేతను దళితుల అనుభవిస్తూనే ఉన్నారు. రిజర్వేషన్లు దళితుల్లో ని 5 శాతం మంది ప్రజలకు కూడా ఉపయోగ పడటం లేదు.
ఆర్థిక దోపిడీకి గురవుతున్న వ్యవసాయ కూలీలు, పేద రైతాంగం, కార్మికులలోను దళితులు ఎక్కువగా కుల వివక్షతకు గురౌతున్నారు. క్రింది వర్గం లో ఉన్న శూద్ర కులాల ప్రజలపై దాదాపు కుల అణచివేత దాడులు నిలిచిపోయాయని చెప్పవచ్చు. వీరికి ఆర్థికపరమైన ఎదుగుదల లేనప్పటికీ ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటికి, వీరందరూ సామాజికహోదాను అనుభవిస్తూన్నారు.
అందువల్లే వీళ్ళు దళితులపై దాడులు చేయడం లో అగ్రవర్ణాల మద్దతుతో ముందువరుసలో ఉంటున్నారు.
దళితుల విషయంలో కులం, వర్గం రెండు దాదాపుగా ఒక్కటిగానే ఉండే పరిస్థితి నెలకొని ఉంది.
చైతన్యం ఉన్న చోట దళితులు ఏకమై మిగిలిన అభ్యుదయకర శక్తులతో కలిసి కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. మిగిలిన చోట్ల శూద్ర, అగ్రకుల వివక్షకు, వెలివేతకు
దళితులు గురవుతున్నారు. కుల సమస్య అంటేనే దళితుల సమస్య అనే విధంగా రూడి అయిపోయింది.
భారతీయుల్లో 70 కోట్ల మంది దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. సుమారు 24 కోట్లకు పైగా ఉన్న దళితుల్లో మెజారిటీ కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. 60 శాతం పైగా ఉన్న శూద్ర కులాలు ఇప్పటికే అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాయి. అనేక మౌలిక వసతులకు ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. పెట్టుబడి ఉపరితల అంశాలలో చాలా వాటిలో మార్పులు తీసుకు వస్తున్నప్పటికీ దళితులపై వివక్ష అంశంలో ఏ మాత్రం మార్పును తీసుకు రాలేకపోయింది. అందువల్లే పెట్టుబడి హిందుత్వ శక్తులతో దోస్తీ కట్టింది అని చెప్పుకుంటున్నాము.
భూస్వాములు రాజ్యమేలుతున్న కాలంలో కులం, వర్గం మధ్య సన్నిహిత సంబంధం ఉండేదని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సామాజిక సంబంధాల్లో కులం ప్రాథమికమైనది కాదని, వర్గమే ప్రాథమికమైనదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వర్గ దృక్పథం మాత్రమే సమకాలీన సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకే కులం లో దోపిడీ చేస్తున్న వర్గం, దోపిడీకి గురవుతున్న వర్గం రెండు ఉన్నాయి. కుల ప్రాతిపదికన విశ్లేశిస్తే అగ్రవర్ణ, శూద్ర, పేదలందరూ దోపిడీ వర్గంలోకి చేరే ప్రమాదం ఉంది. ఒకప్పుడు వివక్ష ను అనుభవించిన శూద్ర కులాలు దోపిడీకి గురి కాబడుతున్న వర్గంలో ఉంటే ఈరోజు దోపిడీకి గురిచేసే వర్గంలో చేరిపోయారు. అయినప్పటికీ ఆ యొక్క కులాల్లోనూ వర్గాలున్నాయి.
వ్యవసాయం ప్రధానమైన భారత దేశంలో ఇప్పటికీ 10% ధనిక రైతులు భూస్వాములను మినహాయిస్తే మిగిలిన 90% సన్నకారు పేద రైతులు, వ్యవసాయ కూలీలే. దళితేతర కులాల విషయంలో కులం ఉపరితలం లో ఉంటే ,దళితులు విషయంలో కులం పునాది ఉపరితలంలోనూ అంతర్భాగంగా వుంది. పునాదిలో పెను మార్పులు సంభవించినా ఉపరితలంలో దళితులపై అణచివేత, వివక్షత కొనసాగుతూనే ఉంది. కుల నిర్మూలన కోసం అభ్యుదయకర శక్తులన్నింటిలోనూ కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దోపిడీకి గురవుతున్న అన్ని సెక్షన్ల ప్రజలను పోరాట స్రవంతి లోకి ఆహ్వానించాలి. అందరితో కలిసి ఐక్యంగా ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ క్రమంలో కుల నిర్మూలనకు, బ్రాహ్మణీయ ఆధిపత్య భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది.
- వి. నాగేశ్వర రావు
Comments
Post a Comment