కార్మిక చట్టాలను రద్దు చేసిన ప్రభుత్వాలు

Will States Diluting Labour Laws Attract More Investment?

చారిత్రకంగా శ్రామికులు పెట్టుబడిదారీ వ్యవస్ధపై అనేక పోరాటాలు చేశారు. ఆర్ధికవ్యవస్ధ మీదే మానవసంబంధాలు ప్రధానంగా ఏర్పడతాయని మార్క్స్ సూత్రీకరించాడు. శ్రమశక్తి దోపిడీని తగ్గించడానికి కార్మికులు అనేక ఉద్యమాలను చేశారు. వీరి పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలను తీసుకుని వచ్చింది. పెట్టుబడీ దారి వ్యవస్ధ అనేక సంక్షోభాలను అంతర్జాతీయంగా ఎదుర్కుంది. సక్షోభం వచ్చినప్పుడల్లా కార్మికులను ఉద్యోగాల నుండి తోలగించడం జరుగుతోంది. అలాగే కార్మిక వేతనాలను తగ్గించడం, వేతనాల్లో భారీ కోత పెట్టడం జరుగుతోంది. కార్మికుల శ్రమను మరింత దోపిడీ చేయడానికి,  వారి పోరాడి సాధించుకున్న చట్టాలు కార్పోరేట్ శక్తులకు అడ్డంకిగా మారాయి. రాజ్యం భారతదేశంలో దళారీ స్వభావాన్ని కలిగివుంది. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఏజెంట్లుగా మారిపోయారు. కరోనా పేరుతో ఇప్పుడ కార్మికుల హక్కులను పెద్ద ఎత్తున కాలరాయడానికి ప్రభుత్వాలు సంకల్పిస్తున్నాయి. 

స్వదేశానికి తిరిగి వచ్చే వలస కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రపంచ సరఫరా గొలుసుల్లోని అంతరాయాలను సద్వినియోగం చేసుకోగలిగేలా ప్రభుత్వాల విధానాలు వుండాలి. అయితే ప్రభుత్వాలు కార్మికుల హక్కులను అణగదొక్కడం, దశాబ్దాల నాటి రక్షణ చర్యలను తొలగించడం, సంక్షేమ నిర్మాణాన్ని నెమ్మదిగా కూల్చివేసినందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

అనధికారిక రంగంలో పనిచేస్తున్న భారతదేశ శ్రామికశక్తిలో 90% ఈ మార్పుల వల్ల ప్రభావితం కారు. వ్యవస్థీకృత శ్రామికశక్తి, రిజిస్టర్డ్ సంస్థలలో ఉన్నవారికే ఇవి వర్తిస్తాయి. కార్మిక చట్టాలలో మార్పులకు కేంద్రం ప్రయత్నించింది.  దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తడంతో కోంత వెనుకడుగు వేసింది.

మే 6 న యుపి కీలక కార్మిక చట్టాలను మూడేళ్లపాటు ఆర్డినెన్స్ ద్వారా నిలిపివేసింది.  మే 7 న మధ్యప్రదేశ్ ప్రకటించినట్లుగా, అన్ని కార్మిక చట్టాలను నిలిపివేయడానికి చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది.  ఏప్రిల్‌లో బిజెపి అధికారంలో వున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ చర్యలు తీసుకున్నారు.

యుపి ప్రభుత్వం కొన్ని కార్మిక చట్టాలను నిలుపుదల చేస్తూ ఆర్డినెన్సు ను తీసుకువచ్చింది. మూడు సంవత్సరాలు కార్మికులకు చట్ట రక్షణ వుండదని యూపి ప్రభుత్వం చెపుతోంది.  భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం, కార్మికుల పరిహార చట్టం, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం,  వేతనాల చెల్లింపు చట్టం, ఇవన్నీ ఇక ఆ రాష్ట్రాల్లో అమల్లో వుండవు. యజమానులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆదేశించే చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, ఇవి కూడా కార్మికులకు ఇకపై వర్తించవు.

ఫ్యాక్టరీస్ చట్టం,  పనిగంటల నిబంధనలను తప్పనిసరి చేస్తుంది. ఇది రోజువారీ ఎనిమిది గంటల,   వారానికి 48 గంటలు కార్మికులు పనిచేయాలని చెప్తుంది. యజమానులు ఇకపై దానికి కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 కూడా ఇప్పుడు యుపి, మధ్యప్రదేశ్లలో నిలిపివేయబడింది. యుపిలోని తాజా నిబంధనలు 12 రంగాలకు వర్తించనుంది. కార్మికులను పంపించే ముందు చట్ట ప్రకారం 30 నుండి 90 రోజుల నోటీసు వ్యవధి అవసరం. 100 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులతో నడుస్తున్న ఉత్పాదక యూనిట్లు, తోటలు, గనుల రంగల్లో  కార్మికులను తీసుకోవడానికి, పనిలో నుండి తీసివేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం. ఈ ఆమోదాలు ఇకపై అవసరం లేదు.


ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, గుజరాత్  పారిశ్రామిక ఎస్టేట్లలో మొత్తం 3000 హెక్టార్ల భూమిని రాష్ట్ర ల్యాండ్ బ్యాంక్ నుండి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇతర దేశాల నుండి వచ్చే పరిశ్రమలకు  నోడల్ అధికారులు సహాయం చేస్తారు. రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక భద్రత ఆరోగ్య చట్టం, కార్మిక పరిహార చట్టం అమలు చేయకుండా కొత్త పరిశ్రమలకు 1,200 రోజులు మినహాయింపు ఇవ్వబడుతుంది అని గుజరాత్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయం కరోనా కల్పించిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించడానికేనని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. నష్టాలను ఎదుర్కోవడంలో సహాయపడటానికి పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వడానికి తమ రాష్ట్రం కూడా "ఇలాంటి చర్యలను" ఆలోచిస్తున్నట్లు ఉత్తరాఖండ్ కార్మిక మంత్రి హరక్ సింగ్ రావత్ అన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్మికచట్టాల్లో తీసుకువచ్చిన మార్పులు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా తీసుకోచ్చినవే. దాని కొనసాగింపుగానే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కార్మిక చట్టాలను కోంతకాలం పాటు ఫ్రీజ్ చేశారు. ఇది కార్మికులను మరింత బానిసలుగా మారుస్తాయి. ఇందుల్లో పని గంటలు పెంపు,  వేతనాల్లో కోత, పని భద్రతను పట్టించుకోకపోవడం, సౌకర్యాలు లేమి వంటివి వున్నాయి.  వీటి వలన కార్మికులు 8 గంటలకు మించి పని చేయాల్సి వస్తుంది. పని సమయాల్లో వారికి ఉండే సౌకర్యాలు, భద్రత నియమాలు ఇకపై వారికి వుండవు. పని భద్రత లేకపోవడం వల్ల వారి ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్ధితి ఎక్కువుగా వుంటుంది. కార్మికుల ఆరోగ్యం పెట్టుబడిదారుల దయ దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. 

అంటే కార్మికుల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా పెట్టుబడి దాసోహానికి బలి చేయటంగా దీన్ని చెప్పుకోవచ్చు. 8 గంటల పని విధానాన్ని పెంచే చర్య కార్మికులను దోపిడీకి గురి చేయటమే అవుతుంది. అదే విధంగా వేతనాలను, పని భద్రతను పెట్టుబడిదారుల ఇష్టానికి వదిలేయటం కూడా ప్రాధమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది. కనీసమైన జాగ్రత్తలు, సదుపాయాలు లేనటువంటి పరిస్ధితులను కార్మికులకు కల్పించడం ఆదేశిక సూత్రాలకు విరుద్దం.  ఆదేశిక సూత్రాలు స్పష్టంగా పనిలో న్యాయమైన మానవతా పరిస్థితులు కల్పించాలని సూచిస్తుంది. కార్మికులకు గౌరవప్రదంగా జీవించే హక్కు, కనీసమైన  విశ్రాంతి, భ్రదతను కల్పించాలని చెపుతుంది. 

 రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు, ప్రాధమిక హక్కులకు విరుద్ధంగా ఈ చట్టాలను ప్రభుత్వాలు తీసుకురావడం అప్రజాస్వామికం. భారత రాజ్యాంగం ప్రజల యొక్క సంక్షేమాన్ని తన ఆశయాల్లో ప్రధానమైనదిగా పేర్కొంది. పెట్టుబడి వృద్దికి కూడా కార్మిక హక్కులు చాలా ముఖ్యమైనవి. వీటిని పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే కార్మికుల  సంక్షేమాన్ని పూర్తిగా పెట్టుబడిదారులకు వదిలేయకుండా  రాజ్యాంగం ఆ బాధ్యతను తీసుకుంది. అందులో భాగంగా అనేక కార్మిక  చట్టాలను దేశంలో తీసుకురావటం జరిగింది. ఉదాహరణకు ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ట్రేడ్ యూనియన్ చట్టం , కనీస వేతనాల చట్టం, సమాన పనికి సమాన వేతనం చట్టాలు ప్రధానమైనవి. 

ఇవి పెట్టుబడికి సామాజిక బాధ్యతను, కార్మికుల సంక్షేమాన్ని గుర్తుచేస్తాయి. ఆచరణలో పెట్టుబడిదారులు సదరు చట్టాలను విస్మరించినట్లయితే, చట్టాల్లోని హక్కులను కార్మికులు పొందే అవకాశాలను ప్రభుత్వాలు కల్పిపించాయి.  నేడు  ప్రభుత్వాలు ఆ సామాజిక బాధ్యత పెట్టుబడిదారులకి ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నాయి. కార్మిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై లేదని ప్రభుత్వాలు ప్రజలకు చెప్పదలుచుకున్నాయి.  

చట్టాలు, రాజ్యాంగం ఉన్నప్పటికీ ఇప్పటివరకు సాగిన పారిశ్రామిక విధానంలో కార్మికులు  తమ హక్కులను పూర్తిగా పొందలేకపోతున్నారు. ఇందుకు కారణం ప్రభుత్వాలకు కార్మిక హక్కుల పట్ల నిబద్ధత లేకపోవటమే. ప్రభుత్వ అధికారుల అవినీతి, పెట్టుబడిదారుల లాభాపేక్ష కూడా ప్రధాన కారణాలుగా వున్నాయి. ఈ నేపధ్యంలో అవధులు లేని పెట్టుబడి లాభాపేక్ష శ్రమ శక్తిని మరింత దోచుకోవడానికి ప్రభుత్వాలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కార్మిక చట్టాలకు మార్పులు తీసుకువస్తే ఆ పరిేస్థితులు ఎంత దుర్భరంగా ఉంటాయో ఆలోచించుకోవచ్చు. కరోనా వల్ల కలిగిన ఆర్ధిక సంక్షోభాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులతో పాటు ప్రజస్వామిక వాదులందరూ  వ్యతిరేకించాలి.  

 - బి. శ్రీనివాసబాబు

Comments