20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరి కోసం

What Was The Govt's Mindset Behind The 20 Lakh Crore Package?
   
          ప్రధాన మంత్రి మోడీ లాక్ డౌన్ ప్యాకేజీ చూస్తుంటే  గ్రామంలో మా పూర్వీకులుకి జరిగిన అన్యాయం గుర్తుకు వస్తుంది.  గ్రామానికి కొంతమంది వలస వచ్చారు. వ్యవసాయానికి పెట్టుబడి పెడతాం అని వచ్చారు. వ్యవసాయంలో పండించిన పంట వడ్డీకే సరిపోయేది. చివరికి రైతులు కూలలీలుగా  మారి పోయారు. వలస వచ్చిన వలసదారులు భూ యజమానులు అయ్యారు. అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు కోమ్ముకాస్తోంది. వారికి లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలను ఇస్తోంది. వారి మోండి బకాయిలను పార్లమెంటం సాక్షిగా రద్దు చేస్తోంది. దీనివల్ల 12 కోట్ల చిన్న, మధ్య తరగతి స్వదేశీ వ్యాపారాలు దివాలా తీశారు. 

అప్పుల ఊబిలో చిక్కుకుని వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేద రైతులు, వలస కూలీలు, కార్మికులు సంపదను సృష్టిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వారిని గాలికి వదిలేశారు. మాటల గారడీ, అంకెల గారడీలతో పేదలకు, కార్మికులకు ప్యాకేజీ లబ్ది చేకూరుస్తుందని చెప్పారు.  విమానాల్లో తిరిగే వారికి కోట్లరూపాయల రాయితీలు ఇస్తున్నారు. వలస కూలీల రైలు ప్రయాణానికి చార్జీలు కూలీలే చెల్లించే విధంగా చేశారు. పారిశ్రామిక వేత్తలకి లక్షల కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వేలల్లో కరెంట్ బిల్లులు వస్తాయి.  ఇంటి పన్నులు, కుళాయి పన్నులను రెట్టింపు చేసారు.  రాజ్యాంగ లోని ఆర్టికల్ 14 సమానత్వ భావన మోడీ పాలనలో వుండటం లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా మోడీ గారు ప్రవర్తిస్తున్నారు.  ఆయనకు కార్పొరేట్ల, మనువాదులపైన ప్రేమ ఎక్కువుగా వుంటుంది.  కార్పొరేట్లను అందలం ఎక్కించి ప్రజల్ని బిక్షగాళ్లను చేసే పరిపాలన మాత్రమే ఆయనకు   సాధ్యమవుతుంది. 

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఆత్మ నిర్భర భారత్ అభియాన్  పేరిట 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.  6 లక్షల కోట్లతో తొలివిడత ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. అందులో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రుణాల మంజూరు, ఉద్యోగులకు పీఎఫ్ చెల్లింపు, టీడీఎస్ మినహాయింపులు ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం కీలకమైన విషయంగా ప్రకటించింది.   సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలు రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తాయి. అప్పు కావాలని కోరుకునే వారికి ఆయా బ్యాంక్లు ప్రతి సంవత్సరం రుణాలు మంజూరు చేస్తున్నాయి. పెద్ద పారిశ్రామిక వేత్తలుకి ఇచ్చిన రుణాలు మాపీ వీరికి లేదు. ఈ పేరుతో లక్షల కోట్లు  ప్రభుత్వాలకు దగ్గరగా వుండే వారు స్వాహా చేయటానికి, అతి పెద్ద క్విడ్ ప్రోకు మార్గం సుగమం చేయబడుతుంది. 

3.6 లక్షల కోట్ల మొత్తంతో  రెండో దశ ప్యాకేజీని ప్రకటించారు. రైతులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులకు మేలు చర్యలు అని  ఈ ప్యాకేజీలో ప్రకటించారు. రైతులకు గతంలో లాక్ డౌన్ ముందు ఇస్తామన్న వాటిని ఇందులో కలిపేశారు. వలస కార్మికులుని ఎంత బాగా ఆదుకున్నారో హైవేల మీద, రైల్ పట్టాల మీద జరిగిన మరణాలు చెపుతూనే ఉన్నాయి.   లక్ష 60 వేల కోట్లతో మూడో విడత ప్యాకేజీ ప్రకటించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఈ ప్యాకేజీ ఉపయోగపడతుందని పాలకులు చెప్పారు. పాలఉత్పత్తి దారుల, మత్స్యకారల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. చిన్న, సన్నకారు, పాల ఉత్పత్తి దారులకు ఏమి అందలేదు. ఇక్కడ బడా కొర్పొరేట్స్ లు, ప్రభుత్వ పెద్దలు క్విడ్ ప్రొకో ద్వారా లబ్ధి పొందుతారు.

 58వేల కోట్లతో నాల్గోవ ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 8 రంగాల్లో భారీ సంస్కరణలను ప్రకటించారు. ఈ సంస్కరణలు అన్ని పారిశ్రామిక వేత్తలకు, బడాబాబులకు మేలు చేసేవి.  ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. సుమారు 35 బడా ప్రభుత్వ రంగ కంపెనీల్లోకి పెద్ద ఎత్తున్న ఎఫ్డీఐలను ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇవన్నీ ప్రైవేటీకరించబడతాయి. ప్యాకేజీ-5లో భాగంగా కేంద్రం ఏడు రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చింది. ఇందులో ఉపాధి హామీ, ఆరోగ్యం,విద్యానుబంధ రంగాలు, వ్యాపారాలు, డీక్రిమినలైజేషన్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యాక్ట్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌,  పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వాలు-వనరులు తదితర అంశాలు వున్నాయి.

   పై ఏడూ రంగాలు లో మొదటిది ఉపాధి హామీ. ఇది పాతది. ఎప్పటి నుంచో నడుస్తుంది. కేంద్రంపై ఆధారపడకుండా వనరులు సమీకరించుకోవాలని రాష్ట్రాలకు చెప్పారు. అంటే ఫెడరల్ వ్యవస్ధ స్ఫూర్తిగా భిన్నంగా కేంద్రం నడుచుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల పరిస్ధితి మున్సిపాలిటీల స్ధాయికి దిగజార్చబడ్డాయి. ప్రధాని నిరంతరం సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవాలని చెబుతున్నారు. అంటే కేంద్రం చేసేది ఏమి లేదని చెప్పకనే చెపుతున్నారు. ఇక రాష్ట్రాలు తమపని తాము చూసుకోవాలి.  సంక్షోభం విసిరిన సవాళ్ళను అధిగమిస్తూ స్వయం సమృద్ధి సాధించాలి. 

 కరోనా వారియర్స్ రక్షణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. మాస్క్ లు అడిగిన డాక్టర్ సుధాకర్ లాంటి వారిని ఎందుకు సస్పెండ్ చేశారు. కరోనాను ఎదిరించే మున్సిపాలిటీ కార్మికులకు, పారిశుద్ధ కార్మికులకు మాస్కులు లేవని చెప్పినందుకు నగరి మునిసిపల్ కమీషనర్ ను సస్పెండ్ చేశారు.  రాజ్యాన్ని ప్రశ్నించే వారు ఉండకూడదు. ప్రశ్నించే వాళ్ళందరిని జైలులోనే నిర్బంధిస్తారు. 

 కోవిడ్ 19 సమయంలో విద్యార్ధులకు ఆన్ లైన్ పాఠాలను ప్రవేశపెట్టారు.  దూరదర్శన్ తో పాటు 12 నూతన చానెల్స్ ద్వారా ప్రైవేటు డీటీహెచ్ ల సాయంతో ఆన్ లైన్ తరగతులు వుంటాయి. విద్యార్ధులు-ఉపాధ్యాయుల మధ్య పరస్పర సంభాషణకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.   అంతంత మాత్రంగా ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులు  చదువులకు దూరం అవుతారు. ఇది విద్యారంగంలో ప్రవేటీకరణను వేగవంతం చేయడమే. సాంకేతికతను జోడించడం తప్పుకాదు. పేద  విద్యార్థులకు వాటిని అందించే ప్రయత్నాలు చేయాలి.  విద్యారంగం నుండి పేద విద్యార్ధులను తప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.  ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు శ్రామిక్ రైళ్ళు నడిపారు. రైళ్ళకు అయ్యే ఖర్చుల్లో కేంద్రం 85 శాతం, రాష్ట్రాలు 15 శాతం భరిస్తాయని ప్రకటించారు.  శ్రామికులు ఉన్న ప్రాంతాలకు రైళ్ళు పంపించి వారిని స్వస్థలాలకు పంపుతాం అన్నారు.  చివరకు రైల్ టికెట్లను కార్మికుల చేతే కోనిపించారు. కోంతమంది యజమానులు కార్మికులు జీతాల నుండి కట్ చేసి రైళ్ల టిక్కెట్ల ధరను చెల్లించారు. 

   భూమి, శ్రమ, చట్టాలు ఈ మూడింటిలోనూ నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని కేంద్రం ఆర్భాటంగా ప్రకటించింది. వీటివల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదని ప్రజలకు 6 రోజుల్లో తెలిసిపోయింది.  అవసరార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. కాని జన ధన్ ఖాతాల్లో కొద్దీ మందికి   మాత్రమే 500 రూపాయలు వేశారు. ఈ నగదు బదిలీ అందరికీ చేరలేదు.  బడాబాబులకు లక్షల కోట్ల ఋణమాఫీతో పోల్చితే ఇది ఒక సాయమేనా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.  పేదవారు కేవలం 500 రూపాయలతో ఎంతకాలం బ్రతుకు తారో ఏలిన వారు సెలవు ఇవ్వాలి.  12 లక్షలమంది ఈపీఎఫ్ ఖాతాదారులకు  3660 కోట్లు నగదును ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించుకుంది. కార్మికులు పీఎఫ్ ఖాతాలో దాచుకున్న సోమ్ము తీసుకుంటే అది కూడా ప్రభుత్వ ఘనతగా పాలకులు చెప్పుకుంటున్నారు.  మూడునెలల పాటు పేదలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. ఈ పథకం కింది వున్నది పేదల్లో కేవలం 3 శాతమే.  కోట్లాదిమంది మిగతా పేదలను గాలి కోదిలేశారు.  

 భవన నిర్మాణాల ఖాతాల్లో రూ,3995 కోట్లు జమచేశాం అన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో ఒక్క భవన నిర్మాణ కార్మికునికి ఒక్క రూపాయి అందలేదు.  మనదేశంలో సాంకేతిక పరమయిన సంస్కరణలు జరగకపోయి వుంటే అభివృద్ధి సాధ్యమయేది కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.  పేదోడి డబ్బులతో కార్పోరేట్లకు లబ్ది చేకూర్చడమే మోడీ ప్రభుత్వం చేస్తోంది.  వలస జీవుల ఆకలి తీర్చడం లో ప్రజలు, పౌర బృందాలు, స్వచ్ఛంద సంస్థలు,   విజయవంతం అయ్యాయి తప్ప ప్రభుత్వాలు కాదు. వలస కార్మికులు ఎక్కడివారు అక్కడే వుండాలని మోడీ చెప్పారు. 

 అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించి పేద ప్రజల్ని తీవ్ర కష్టాల కొలిమి లోకి మోడీ నెట్టేశారు. దుర్భర జీవితాన్ని శ్రామికులు గడుపుతున్నారు. రోడ్లు మీద ఎవరు పట్టెడు అన్నం పెడతారో అని ఎదురు చూస్తున్నారు. మోడీ ప్రకటించిన 20లక్షలు కోట్ల వల్ల సామాన్య ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు. అంకెల గారిడీతో, అబద్దపు ప్యాకేజీలతో ప్రజల్ని మోసగించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నోస్తోంది. ఇది ఎల్లకాలం జరుగుందనే భ్రమల నుండి పాలకులు ఇకనైనా బయటకు రావాలి. 

      - నంబూరి శ్రీమన్నారాయణ
        

Comments