లాక్ డౌన్ సడలింపు వలస కూలీలకు వర్తించలేదు. ప్రకటించిన మార్గదర్శక సూత్రాలు, నిబంధనలు వలస కూలీల ఆశలకు, అభీష్టాలకు విరుద్ధమైనవి. తీవ్రమైన కష్టాలు, దుఖః లో వలస కూలీలు ఉన్నారు. లాక్ డౌన్ సడలింపు నిబంధనలు ఇళ్లకు చేర్చే విధంగా ఉంటాయని కూలీలు ఆశించారు. వారి ఆశలు పైన పిడుగుపాటు లాంటి వార్తను ప్రధాన మంత్రి మోడీ ప్రకటించారు. మోడీ ప్రకటనతో వలస కూలీలు నిరాశ చెందారు. దఫాలుగా ప్రకటనచేసిన మోడీ, వలస కూలీల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏమి లేవు. ఆకలి బాధలు భరించలేక కాలినడకన తమ గ్రామాలకు ప్రయాణం అవ్వడానికి కూలీలు అయ్యారు. వలస కూలీలను తమ ఇళ్లకు, కుటుంబాల వద్దకు వెళ్లటానికి ఏర్పాట్లు చేయలేదు. శిబిరాల పక్కనే వున్న వ్యాపార సంస్థలలో వారి నైపుణ్యానికి తగిన పని చూపించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదశించింది. పిల్లలు, భార్యాభర్తలు, తల్లితండ్రులకు దూరమై కూలీలు రోడ్లు పక్కన బోరున విలపిస్తున్నారు.
కష్ట జీవులుకి ఒక న్యాయం ధనవంతులకు ఒక న్యాయం ఎలా ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లాక్ డౌన్ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ విదేశాలలో చిక్కుకున్న భారతీయులను విమానాలలో తీసుకు వస్తున్నారు. వీరు ధనిక, మద్య తరగతి వర్గానికి చెందిన వారు. స్వదేశంలో వున్న వలస కూలీల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
దేశంలో కష్టజీవులు, వలస కూలీలు ప్రయాణాలు ప్రమాదకరంగా ఉండవు. ఎవరైతే పూర్తి ఆరోగ్యంగా ఉంటారో వాళ్లను పరీక్షించి తమ సొంత గ్రామాలకు వెళ్లే విధంగా తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి. దానికి బదులు వలస కూలీలు వున్న దగ్గర పరిశ్రమలు, వ్యాపార సంస్థల లో వారికి పని కల్పించాలని నిబంధనలు విడుదల చేయటం సరికాదు.
రాజ్యాంగం లోని ఆర్టికల్ 24, 25 ప్రకారం బలవంతపు తరలింపు, బలవంతపు పని నిషేధించబడినది. భారత రాజ్యాంగం ప్రకారం నిర్బంధంగా పని చేయించటం చెల్లదు. శ్రమ చేసే మనిషి స్వచ్ఛందంగా పని చేయాలి. స్వేచ్ఛ గా పనిచేసే వాతావరణం కల్పించాలి. పని ప్రదేశం లో కార్మికులకు రక్షణ వుండాలి. శ్రామికులు మనుషులలో అత్యంత ఉన్నతమైన వారు. వారి శ్రమ అత్యంత విలువైనది. వారి ద్వారానే ఈ సమాజంలో సంపద సృష్టించబడుతుంది. ఈ సమాజం మనుగడ శ్రామికుల పైన ఆధారపడి ఉన్నది. వలస కూలీలు బానిసల కారు. వారు మనసులు. వారికి మానవ హక్కులు వర్తిస్తాయి. వారి అభీష్టాలకు విరుద్ధంగా నిర్బంధంగా పని చేయించడం రాజ్యాంగ విరుద్ధం. భారత రాజ్యాంగం దీనికి అనుమతించదు. రాజ్యాంగంలో ఎక్కడా నిర్బంధ శ్రమ ను పేర్కొనలేదు. నిర్బంధ పని విధానం బానిస కాలం నాటిది. అది ఇప్పుడు మోడీ ప్రభుత్వం వలస కార్మికులకు అమలు చేస్తున్నది.
అత్యంత హృదయ విదారకమైన అంశం ఏమిటంటే భారతదేశం ఇప్పటికే 24 కోట్లాదిమంది వలస కార్మికులతో వలస భారతం గా మారిపోయింది. ప్రాచీన వలస జీవితం కంటే ఆధునిక వలస జీవితం ప్రమాదకరంగా మారింది. యజమానులు దోపిడీ ఒకవైపు, బ్రోకర్ల మోసాలు తో వలస బతుకులకు భద్రత లేదు. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు పడినటువంటి కష్టాలు చెప్పనలవి కానివి. వందల కిలోమీటర్లు నెత్తి మీద మూటలు పెట్టుకుని, చంకన పిల్లల్ని ఎత్తుకుని మోసుకుంటూ నడిచారు. కాళ్ల బొబ్బల తో పుండ్లు పడి రక్తమోడుతున్నా తమ వాళ్ళ దగ్గరకు పోవాలి అనే ఆశ తో ప్రాణాలను ఒడిసిపట్టి ప్రయాణాలు కొనసాగించారు. నడవలేక చనిపోయిన మృతుల సంఖ్య దాదాపు 50 మందికి పైగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారతదేశంలో యువ భారతం అంతా ఉద్యోగాలు లేక వలస కూలీలుగా 40 శాతం మంది పైగానే పని చేస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని అన్నం దొరికితే చాలు అని వందల కిలోమీటర్ల దూరం వెళ్లి వలస కూలీలుగా బతుకుతున్నారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల నుండి బీహార్, యు.పి, ఝార్ఖండ్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బెంగాల్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ తదితర ప్రాంతాల నుండి నగరాలకు, రాజధానులు కి తరలి వెళ్లారు. వీళ్లంతా బతకటం కోసం వెళ్లిన వారే. లాక్ డౌన్ సమయంలో వీరంతా ఆకలి మంటలతో అలమటించి పోయారు. నేడు వారికి తిండి లేకుండా పోయింది. సంపద అంతా ధనవంతుల ఇనుప లాకర్లలో ములుగు తూనే ఉంది. కానీ వారికి మాత్రం లాక్ డౌన్ కాలంలో జానెడు పొట్టకు పట్టెడు అన్నం దొరకలేదు.
శిబిరాల్లో ఉన్నవారు, రోడ్ల వెంట నడుచుకుంటూ వెళుతున్నవారు, మృత్యు చివరి అంచు వరకు వెళ్లి వచ్చారు.
తమ కుటుంబాలను ఒకసారి చూసుకోవాలని ఆశిస్తున్నారు. మోడీ తన ప్రకటనలలో వలస కూలీల సంరక్షణకు చేసింది ఏమీ లేదు. శిక్షణా శిబిరాలలో ఉన్నటువంటి వారు సైతం పట్టెడన్నం దొరకడానికి పోటీ పడాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వలస కూలీలు ఓటర్లు కాదనే ఉద్దేశంతో వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిని భారంగా భావిస్తన్నారు.
కొవ్వూరు లాంటి ప్రాంతాల్లో నెలరోజుల కి 5కేజీ లు బియ్యం, ఒక్క కేజి గోధుమ పిండి 200 గ్రాములు కందిపప్పు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. సరైనటువంటి భోజనాన్ని, నిత్యావసరాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దయనీయ పరిస్థితుల్లో వలస కార్మికులు ఉన్నారు. అనారోగ్యంగా ఉన్న వారంతా శిబిరాల్లో ఉండాలని మిగతా వారంతా పనిచేయాలని మోడీ ప్రభుత్వం మార్గదర్శకాల పేరుతో హుకుం జారీ చేసింది. ఇది అమలు చేయకపోతే వలస కూలీల కు తిండి ఉండని పరిస్థితి. ఫలితంగా నిర్బంధ పనికి శ్రామికులు గురైనారు. ఇది ప్రజాస్వామిక పాలన కాదు. ఫ్యాక్టరీలలో, పరిశ్రమలలో, కార్ఖానాల్లో, వ్యాపార సంస్థలలో, షాపులో ఎక్కడైనా నిర్బంధంగా పౌరుల చేత పని చేయిస్తూ ఉంటే ఆ పని నిషేదించాలి. వెట్టి చాకిరి నుండి పని చేసే వ్యక్తి ని విముక్తి చేయాలి. ఆ బాధ్యత రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉంటుంది. నిర్బందం గా పని చేయించే యజమానులపై కేసులు పెట్టి జైలుకు పంపించాలి. అలాంటిది ఇక్కడ రాజ్యమే వలస కూలీల తో నిర్బంధంగా పరిశ్రమలలో వ్యాపార సంస్థలలో పనిచేయాలని ఆదేశాలు జారీచేసారు. వలస కూలీలను ఎవరు రక్షిస్తారు.
రాజ్యం విధానాన్ని పరిశీలిస్తుంటే ప్రజలలో ఉన్న అనుమానాలు, సందేహాలు నిజమే అనిపిస్తుంది. కార్పొరేట్ నేతలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తున్నది.
కారు చౌక శ్రమ ఒకసారి పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతానికి వలస పోతే నగరాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ రంగం కుదేలు అవుతుంది. వారి లాభాలు పాతాళానికి పడిపోయే పరిస్థితి ఉంటుంది. అకస్మాత్తుగా కార్మికులు పరిశ్రమలకు వ్యాపార సంస్థలకు దూరమైతే నగరాలలోని పారిశ్రామికవేత్తలు తీవ్ర ప్రమాదం లో పడతారు. అందుకే మోడీ చేత తెలివిగా కార్పొరేట్ రంగానికి ప్రయోజనం చేకూరే విధంగా చిక్కుకున్న వలస కూలీలను పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు తరలించడానికి మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించారు. ఇది కార్పొరేట్ రంగం కుట్ర.మోడీ వారి తో చేతులు కలిపినట్లు పరిగణించాల్సి వస్తుంది.
ఎందుకంటే వలస కూలీలను తమ ప్రాంతాలకు వెళ్లకుండా కేంద్రం అడ్డుకుంది. పైగా పని చేస్తున్న ప్రదేశాలకు, పరిశ్రమలకు వ్యాపార సంస్థలకు తరలించాలని మోడీ ప్రభుత్వం చెప్పింది. వలసకూలీల తో అలా చెప్పిన ప్రభుత్వం విదేశాలనుండి వ్యాపారవేత్తలను,సినీ ప్రముఖులను పారిశ్రామికవేత్తలను తీసుకురావటానికి విమాన రవాణా కి పర్మిషన్ ఇచ్చింది. వాస్తవానికి కరోనా వ్యాధి విదేశాల నుండే భారత్ కి వ్యాప్తి చెందినది.కరోనా వ్యాప్తి నిరోధానికి అయితే విదేశాల నుంచి వచ్చే వారికి అనుమతులు మంజూరు చేయకూడదు. ఈ దేశంలో ప్రజలు కరోన వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే విదేశాల్లో ఉన్న వారి ప్రయాణానికి అప్పుడే అనుమతించకూడదు. ఎందుకంటే విదేశాల నుండి వచ్చే వారితోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది వాస్తవం అయితే ఈ వ్యాధి వ్యాప్తి కి అవకాశం ఉన్న వారిని విదేశాల నుండి రప్పిస్తున్నారు. ఈ వ్యాధితో సంబంధంలేని వలస కూలీలు తమ ఇళ్లకు చేరకుండా అడ్డుకుంటున్నారు. ఇందులో మోడీ ప్రభుత్వం యొక్క వ్యూహం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని పరిశీకకుల్లో చర్చ నడుస్తున్నది. మోడీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు కార్పొరేట్ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగాలకు అనుకూలంగ వలస కూలీలను తమ స్వస్థలాలకు, కుటుంబం వద్ద కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
ప్రజలు అందరు భావించినట్లు వలస కూలీలు ప్రయాణానికి నిబంధనల సడలింపుని మోది ప్రభుత్వం ఇవ్వలేదు. దీని వెనుక ప్రజల సంక్షేమం కంటే కార్పొరేట్ ల ప్రయోజనమే ఎక్కువ గా కనిపిస్తుంది. మోడి దేశంలో లాక్ డౌన్ తప్ప ఏమి చేయలేదు. 7 లక్షల కోట్ల ధాన్యం ప్రభుత్వ గోదాములలో మగ్గుతోంది. వాటిని పేదలకు పెంచలేదు. దేశ ఆర్ధిక అభవృద్ధి ని పట్టించుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ లోనే లాక్ డౌన్ సమయం లో 5 మంది రైతులు పంట అమ్ముకో లేక ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఆకలికి చనిపోయిన కూలీల సంఖ్య 6. టెస్టింగ్ లను పెంచలేదు. 10 లక్షల ప్రజనీ కానికి కేవలం 200 టెస్టులు మాత్రమే జరిగాయి. జగన్ ఎన్నికలు జరిపే వుత్సహం లో వున్నాడు. తప్పుడు కరోనా లెక్కలు చెపుతున్నారు. మోడి, జగన్ పేద ప్రజలకు ఏమీ చేయరని కరోనా కాలంలో ప్రజలకు తెలిసి పోయింది. ప్రభుత్వాలు ఇకనైనా దేశం లోని 65 కోట్ల మంది పేద ప్రజలను పట్టించుకోవాలి.
- నంబూరి శ్రీమన్నారాయణ
Comments
Post a Comment