ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించడం వల్ల వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఈ వైరస్ ను నియంత్రించి మనుషుల ప్రాణాలు రక్షించడానికి ఆయా దేశాలు తమ దైన పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి భౌతికదూరం పాటించడమే సరైన మార్గమని లాక్ డౌన్ ను అన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. భారతదేశం మార్చి 24 వ తేదీ నుండి లాక్ డౌన్ అమలు చేస్తున్నది. ఆ సమయానికి దేశవ్యాప్తంగా 500 కరోన కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 24 నాటికి దేశవ్యాప్తంగా 21700 కరోన కేసులు నమోదయ్యాయి. ఇందులో 4325 మంది కోలుకున్నారు,. 686 మంది చనిపోయారు. ఈ సంఖ్య భవిష్యత్ లో పెరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం కరోనా వైరస్ విస్తరించకుండా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన సమయంలో కూడా మేధావులపైన CAA, NRC, NPR లను వ్యతిరేకించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటూ ఉంది.
జైళ్ళల్లో ఖైదీల దుస్తితి
మార్చి 23వ తేదీన కరోనా వైరస్ వ్యాప్తిని సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకొని భౌతిక దూరం ఆవశ్యకతను గుర్తించింది. జైళ్లలో ఉన్న ఖైదీలను తాత్కాలికంగా ముందస్తు బెయిల్ పైన, పెరోల్ మీద విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, యూనియన్ టెర్రిటరీస్ కు సుప్రీమ్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ మార్చి 26వ తేదీన ఖైదీలందరినీ విడుదల చేయడం సాధ్యం కాదు కాబట్టి ఏనేరాలకైతే ఏడు సంవత్సరాలు శిక్ష వేశారో వారిని విడుదల చేయాలన్నారు. అదేవిధంగా విచారణ ఖైదీల పరిస్థితి ని గుర్తించి, వారిని కూడా విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
జైళ్లలో భౌతిక దూరం పాటించడంతో పాటు వైద్య సహాయం, జైళ్లలో పరిశుభ్రతకు సంబంధించి అనేక మార్గదర్శకాలను సుప్రీం కోర్టు సూచింసింది. ఈ సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. వాస్తవానికి భారతదేశంలోని జైళ్లలో, ఆసుపత్రుల్లో వుండే సౌకర్యాలను ఏర్పాటు చేయడం ప్రభుత్వాలకు సాధ్యం కాదు.
2018 నాటికి జైళ్లలో ఖైదీల సంఖ్య 4,66,084. వీరిలో పురుషులు 4,46,482. మహిళలు 15,602. మొత్తం ఖైదీల జనాభాలో 68.5 శాతం విచారణ ఖైదీలు. అనేక జైళ్ళలో వాటి సామర్ధ్యానికి మించి ఎక్కువ సంఖ్యలో ఖైదీలు ఉంటున్నారు. జాతీయ నేర గణాంకాల వ్యవస్థ ప్రకారం జైళ్ళలో ఖైదీల జనాభా వాటి సామర్థ్యం కంటే ఎక్కువ వుంది.
2017 గణాంకాల ప్రకారం జైళ్లు సామర్ధ్యాన్ని మించి ఖైదీలతో నిండి పోయాయి. దేశ వ్యాప్తంగా జైళ్ళలో సగటు ఖైదీలు 115.7 శాతం గా వున్నారు. ఇది ఉత్తర ప్రదేశ్లో 165.0 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 134 కేంద్ర కారాగారాలు ఉన్నాయి. అనేక జైళ్ళలో ఖైదీలు కిక్కిరిసి వున్నారు. జైలు నిర్వహణకు సరిపడా సిబ్బంది లేరు. చాలా జైళ్ళలో సరైన నీటి సదుపాయం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జైల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే ఖైదీలు పెద్ద సంఖ్యలో మరణించే ప్రమాదముంది. ఖైదీల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు హై లెవెల్ కమిటీ వేసి నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది.
కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీంకోర్టు మానవతావాద దృక్పథంతో స్పందించినందుకు సంతోషించాలి. కానీ ఏప్రిల్ 12 మరొక ఆదేశం ఇచ్చింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖైదీలను విడుదల చేయడంలో సందేహాలను వ్యక్తం చేయడంతో ఖైదీలను విడుదల చేయడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. విపత్కర పరిస్థితుల్లో, ఖైదీల ప్రాణాలు కాపాడడానికి అనుగుణంగా స్పందించిన అత్యుత్తమ న్యాయస్థానం, తర్వాత భిన్నమైన ఆదేశాలను జారీ చేసింది. ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేయడం వల్ల సమాజానికి
ఎటువంటి నష్టం వుండదు.
నేరం, శిక్ష పట్ల సుప్రీం కోర్టు కూడా సంకుచితమైన ఆలోచనలతో నే వుందని అర్థమవుతుంది. జైలులో నిర్బంధించడం అంటేనే సమాజం నుండి, సామాజిక జీవితం నుండి, కుటుంబం నుండి, స్నేహితుల నుండి దూరం చేయడం. జైల్లో ఖైదీల మానసిక పరిస్థితి అత్యంత దారుణంగా వుంటుంది.
లాక్ డౌన్ ను ఉల్లంఘించిన వారిపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టి ప్రభుత్వాలు ప్రజలను జైలుకు పంపుతున్నాయి. తద్వారా జైలులో జనాభాను మరింతగాపెంచుతున్నాయి.
పోలీసుల లాఠీఛార్జ్
కరోణ వైరస్ ప్రమాదం గురించి దాన్ని నివారించడానికి వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి WHO అనేక మానవీయ ప్రస్తావనలు చేసింది. అయినా ప్రభుత్వాలు, పోలీసులు ప్రజల పట్ల గౌరవ ప్రదంగా నడుచుకోవడం లేదు. లాఠీలతో బాదడం, ప్రజలపై అమానుషంగా, అవమానకరంగా ప్రవర్తించడం సరికాదు.
బిజేపి క్రూరత్వం
బిజెపి ప్రభుత్వం తన ప్రతీకారకాంక్షను కనీసం కరోనా సమయంలో కూడా వాయిదా వేసుకోక పోతుంది. పాలకవర్గాల చర్యలు ఎంత క్రూరంగా ఉంటాయో ఇటీవల జరిగిన అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. న్యాయవ్యవస్థ కూడా ప్రభుత్వ అప్రజాస్వామిక అణచివేత కుమద్దతు ఇస్తోంది.
భీమా కోరేగావ్ కుట్ర కేసులో ముద్దాయిలుగా పేర్కొన్న గౌతమ్ నవలఖా, ఆనంద్ తెల్తుంబ్దేలు ఏప్రిల్ 4న ఎన్ఐఎ అధికారుల ముందు లొంగిపోయారు. ఆరోజు ప్రజాస్వామిక హక్కుల ఉద్యమం లో పరిచయం ఉన్నవారు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో వీరి పరిస్థితిని చూసి బాధ పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా భీమా కోరేగావ్ లో అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టిన వారిని విడుదల చేయాలని అంతర్జాతీయ ఉద్యమం నడుస్తోంది. అంతర్జాతీయంగా అనేక దేశాల్లోని ప్రజాస్వామికవాదులు, మేధావులు, డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జి.యన్. సాయిబాబా విడుదల విషయంలో ముంబై హైకోర్టు ఖచ్చితమైన ఉత్తర్వులను జారీ చేయలేదు. ఆయన విడుదలను గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించమని చెప్పి తన బాధ్యత నుండి తపించుకుంది. సుప్రీంకోర్టు భీమా కోరేగావ్ కేసులో ముద్దాయిల పట్ల అన్యాయంగా వ్యవహరించింది. న్యాయ వ్యవస్థ ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు మద్దతు ఇవ్వడం సరికాదు.
అరెస్టుల వెనుక
గౌతమ్ నవలఖా, ఆనంద్ తెల్తుంబ్దే లు బొంబాయి, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల తో అరెస్టు కాలేదు. బీమా కోరేగావ్ కేసులో అరెస్టు అయిన తొమ్మిది మందికి ఇంత వరకు బెయిల్ రాలేదు. కానీ వీరిద్దరూ చట్టపరంగా వున్న అన్ని అవకాశాలలో ప్రయత్నిస్తున్నారు. మార్చి 16న సుప్రీంకోర్టు వీరిద్దరిని మూడు వారాల్లోపున సరెండర్ కావాలని ఆదేశించింది. ఈ మధ్యలో కరోనా వైరస్ ప్రభావం విస్తరించడం, ఖైదీలను విడుదల చేయాలనే ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 60 సంవత్సరాల వయసు దాటుతుందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కరోనా వైరస్ విస్తరిస్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తులు ప్రజాస్వామ్యం, మానవహక్కులు, మానవత్వం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. మీరింతవరకు చాలా స్వేచ్ఛను అనుభవించారు. గతంలోనే మీకు సమయం ఇచ్చారు. ఇంతకుమించి ఇంకా ఏమాత్రం సమయం ఇవ్వడానికి వీలు లేదు. మా ఉత్తర్వులను గౌరవించిన వారైతే ఒక వారం లోపు లొంగిపోవాలి అని సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యానించింది.
అందువల్లే వీరిద్దరూ NIA ముందు లొంగిపోయారు. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును, వారి అభ్యర్థనను పరిశీలించి NIA కోర్టు ఏప్రిల్18 వరకు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఆనంద్ తెల్తుంబ్దే విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముద్దాయికి సంకెళ్ళు వేయడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆనంద్ తెల్తుంబ్దే తరపున న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆగిపోయారు. ఆనంద్ ను ఎంత అవమాన పరిస్తే తాము అంత విజయం సాధించామని అనుకునే పోలీసు వ్యవస్థ ఈ దేశంలో వుంది.
అరెస్టుల పై నిరసన
నవలాఖా, ఆనంద్ అరెస్టులను ఖండిస్తూ, వారిని విడుదల చేయాలని అంతర్జాతీయంగా 5000 మంది మేధావులు, ప్రజాస్వామికవాదులు, 50 సంస్థలు డిమాండ్ చేశాయి. భీమా కోరేగావ్ హింస, కుట్ర కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని భారతదేశ వ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాలు నడిచాయి. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను, అసమ్మతిని ప్రభుత్వం అణిచివేస్తుంది. అంబేద్కర్ కుటుంబానికి చెందిన ఆనంద్ తెల్తుంబ్దేను ఆయన జయంతి రోజునే అరెస్టు చేయడం దారుణం. ఇది చాలా అన్యాయమని, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. BJP ప్రభుత్వం తన కక్ష సాధింపు చర్యలను చట్టం ద్వారా కొనసాగిస్తూనే ఉంది.
ఆగని అరెస్టులు
ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి నెల చివరి వారంలో జరిగిన అల్లర్లకు బాధ్యులైన వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో CAA కు వ్యతిరేకంగా నిరసన ఉద్యమంలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి, రాజ ద్రోహ నేరం క్రింద, FIR లు నమోదు చేశారు.
ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతుంది. మరోపక్క అరెస్టులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈశాన్య ఢిల్లీలోనూ, ఇతర ప్రాంతాల్లో అల్లర్లు ఒక పథకం ప్రకారం జరుగు తున్నాయని ప్రభుత్వం చెపుతోంది. అందుకు ఉమర్ ఖాలీడ్ ప్రధాన కారకుడని అతనిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. డిల్లీ పోలీసులు. జామియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు మీరన్ హైదర్, సప్యూర్ భార్గవ్ పై రాజద్రోహం కేసులను నమోదు చేశారు. వాస్తవానికి వీరంతా CAA కి వ్యతిరేకంగా చాలా చురుగ్గా పనిచేసిన్న కార్యకర్తలు.
ఢిల్లీ అల్లర్లు
వాస్తవానికి ఢిల్లీలో అల్లర్లకు BJP, RSS, దాని హిందూ సంస్థలు కారణం అని చాలా వార్తలు వచ్చాయి. కానీ BJP ప్రభుత్వం మొదటినుంచి ఉమర్ ఖాలీడ్ మీద గుర్రుగానే ఉంది. అల్లర్లకు అవసరమైన పేలుడు పదార్థాలను, పెట్రోల్ బాంబులను, యాసిడ్ సీసాలను, రాళ్లను సేకరించి అల్లర్ల మూకలకు సరఫరా చేశాడని FIR లో పేర్కొన్నారు. అతను ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉద్దేశ్య పూరితమైన ఉపన్యాసాలు చేశాడని, ఒక మతం వారిని రెచ్చగొట్టారని, ఆరోపణ లు చేశారు. గతంలో ఇతని పై హత్య ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే నడుచుకుంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో అరెస్టులు జరిగాయి. భీమా కోరేగావ్ హింస, కుట్ర కేసుకు, ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసుకు పోలీకలు కనిపిస్తున్నాయి. రెండు కేసుల్లో UAPA కుట్ర నేరారోపణలు ఉన్నాయి. ముద్దాయిలంతా బిజెపి హిందుత్వ సంస్థలను వ్యతిరేకించిన వారే.
CAA, NPR, NRC లను వ్యతిరేకిస్తూ మాట్లాడిన వారే, నిరసన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరందరినీ జాతి వ్యతిరేకులుగా, దేశ ద్రోహులుగా, ప్రజల్లో విద్వాంసం రగిలించిన వారిగానే ప్రచారం చేసింది. భీమాకోరేగావ్ హింసకు ప్రధాన కారణం అయిన ఎక్చోటే, శంబాజి బిడే లను పోలీసులు వదిలేశారు.
ఈశాన్య ఢిల్లీలో అల్లర్లకు కారణం బిజెపి నాయకులు. వారిని పోలీసులు అరెస్టు కూడా చేయలేదు. బీమా కోరేగావ్ కేసులో ముద్దాయిలుగా పాల్గొన్నట్టు ఎలక్ట్రానిక్ సాక్ష్యం తప్ప ప్రత్యక్ష సాక్షాధారాలు లేవు. అలాగే ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసుకు, జామియా యూనివర్సిటీ వద్ద ఘర్షణలను, పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేశామని ఫోరెన్సిక్ నివేదిక ను విశ్లేషించిన తర్వాతే అరెస్టు చేశామని చెబుతున్నారు. వాస్తవానికి మీరా హైదర్ RJD కార్యకర్త. విద్యార్థి సంఘం నాయకుడు. లాక్ డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం సరఫరా చేస్తున్నాడు. అతనిపై UAPA, రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ రెండు కేసులను పరిశీలిస్తే ప్రభుత్వం నిర్బంధ విధానం అర్థం అవుతుంది. చట్టం అణిచివేత సాధన గా ఎలా పనిచేస్తుందో తెలుస్తోంది.
హక్కుల చరిత్ర
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (UDHR), భారత రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులను కల్పించాయి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పొందుపరచడం వెనుక ప్రజల పోరాటాల, త్యాగాల చరిత్ర ఉంది. అయితే ఈ హక్కులన్నీ రాజ్యం విధించిన పరిమితుల్లో అమలవుతాయి. ఈ హక్కుల పై అనేక పరిమితులు, షరతులు విధిస్తూ రాజ్యం అనేక చట్టాలను తీసుకు వస్తుంది. నేరాలను అదుపు చేయడానికి, నిరోధించడానికి క్రిమినల్ చట్టాలు నిర్దేశించ బడ్డాయు. సామాజిక ప్రయోజనం కోసం పాటుపడే వ్యక్తి ప్రయోజనాలను, హక్కులను ఇవి పరిగణలోకి తీసుకోవాలి.
ఎందుకంటే నేరం వ్యక్తిగతంగానే చేసినప్పటికీ సమాజానికి వ్యతిరేకమనే భావజాలం బలంగా ఉంది. సాధారణ నేరాలతో పాటు వ్యవస్థీకృత నేరాలు(Organized crimes) పెరిగిన ఈ సందర్భంలో ప్రత్యేక చట్టాలు అవసరం అవుతాయి. ఈ చట్టాలన్నీ సాధారణ నేర న్యాయ వ్యవస్థలకు, హక్కులకు, రూల్ ఆఫ్ లా కు మినహాయింపులు కలిగి ఉంటాయి.
ఊపా చట్టం
ఉగ్రవాదంను అరికట్టడానికి తెచ్చిన TADA, POTA లను సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ బద్దమనే తీర్పులు ఇచ్చింది. ప్రస్తుతం ఉపా చట్టం ఆలోచనలనే నేరం అంటుంది. సంస్థలని చట్టవ్యతిరేకం అంటుంది. ముద్దాయిని నేరం నిరూపించుకో మంటుంది. 180 రోజులు వరకు బెయిల్ లేదంటుంది. ముందస్తు బెయిల్ కు అవకాశం లేదు అంటుంది. బెయిల్ ఇవ్వకుండా విచారణ జరపకుండా నేరం చేశాడు అంటుంది. ఇలాంటి కౄరమైన చట్టం ఇవాళ BJP ప్రత్యర్థులను, ప్రత్యామ్నాయ ఆలోచనలను, రాజకీయాలను, ప్రజాస్వామిక వాదులను, మేధావులను, ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలంటున్నది.
హిందుత్వ అజెండాలను వ్యతిరేకించిన వాని పరిపాలనా విధానాల పట్ల అసమ్మతి తెలియజేసినా, నిరసన తెలిపినా, ప్రత్యేక చట్టాల కింద రాజద్రోహం, కుట్ర మొదలైన నేరారోపణలు చేసి జైలులోకి నెడుతున్నది. పాలక వర్గాలకు కావలసింది ప్రజలు విధేయులుగా లొంగి ఉండడమే. అలా లేని వారిని అణిచి వేయడానికి, శిక్షించడానికి, చట్టాలను సాధనంగా వాడుకుంటుంది. చట్టానికి రెండు వైపులా పదును ఉందని,
ప్రజలు సాధారణంగా భావిస్తారు.
కానీ ప్రత్యేక క్రిమినల్ చట్టాలు ఒకే వైపు చాలా పదునుగా ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న రాజ్యహింసను అర్థం చేసుకోవడంలోనే చాలా సంక్లిష్టత ఉంది. రాజ్యహింస తో పాటు వ్యవస్థీకృత హింస కూడా తక్కువేమీ కాదు. ఈ రెంటికి సఖ్యత ఉంది. వైవిద్యం లేదు. హక్కుల ఉల్లంఘన చట్టాల అతిక్రమణ పరిధిలోనే ప్రజలపై అణిచివేత నిర్బంధం పూర్తిగా అర్థం కావు.
చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందనీ, సమానంగా రక్షణ కల్పిస్తుందనీ, మొత్తంగా సమాజంలో శాంతి భద్రత లను రక్షిస్తుందని ప్రజలు భావిస్తారు.కేవలం ఇది అభిప్రాయమే కాదు. బలమైన భావజాలం కూడా.
చట్ట స్వభావం
ఈ రాజ్యం చట్టం తోనే (బావాజాలంతో) మాట్లాడుతుంది. తన అధికారాన్ని, బలప్రయోగాన్ని, చట్టం ద్వారానే అమలు చేస్తుంది. చట్టం వ్యక్తి చర్యలను, సామాజిక సంబంధాలను నియంత్రిస్తుంది. వ్యక్తుల మధ్య లైంగిక సంబంధాలను కూడా చట్టం నిర్ణయిస్తుంది. సామాజిక సంబంధాలనే కాకుండా వ్యవస్థలో ఉండే ఉత్పత్తి సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. వాటికి అనుగుణంగా మారుతుంది. రాజ్య స్వభావాన్ని బట్టి చట్టం ఉంటుంది. దాని అవసరాలకు అనుకూలంగా చట్టం పనిచేస్తుంది.
సమాజంలో యథాతదస్థితి ని కొనసాగించడానికి చట్టం రాజ్యం చేతిలో సాధనంగా ఉపయోగపడుతుంది. చట్టాల్లో లేదా భావజాలంలో మార్పుల వల్ల సామాజిక మార్పు సాధ్యం కాదు. ఫ్యూడలిజం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ చట్టాల ద్వారా రాలేదు. ఏ సామాజిక వ్యవస్థ అయినా సుస్థిరంగా ఉండడానికి, శత్రువుల నుండి రక్షించుకోవడానికి , వ్యవస్థ లోని అంతర్గత వ్యవహారాలను, వాటికి ఏర్పడే ముప్పులను బలప్రయోగం ద్వారానే ఎదుర్కొంటుంది.
ముగింపు
ప్రజాస్వామిక విలువలను, రాజ్యాంగం కల్పించిన హక్కులను, అసమ్మతిని, నిరసనను, ప్రజా ఉద్యమాలను, బలప్రయోగం ద్వారా అణచివేస్తుంది. చట్టం పేరుతో సమర్థించుకుంటోంది. ఈ విధంగానే బీమా కోరేగావ్ కేసులో ముద్దాయిలుగా ఆరోపించిన హక్కుల కార్యకర్తలను నాయకులను జైళ్ళలో పెట్టింది. ఇంతలో ఎదుగుతున్న విద్యార్థి నాయకులను, మేధావులను, టార్గెట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. ఆనంద్ తెల్తుంబ్దే తాను పోలీసు కస్టడీ లోకి వెళ్తూ ప్రజలకు ఒక విజ్ఞప్తిని చేసాడు. " మీ వంతు వచ్చే ముందు మీరు మాట్లాడతారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను". ప్రజలు మౌనం వీడాలి. పాలకుల అన్యాయాలను ప్రశ్నించాలి. లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడు కోవాలి.
- ప్రొఫెసర్ ఎస్. శేషయ్య
Comments
Post a Comment