కొవిడ్ 19, నగరాలలో మహిళా వలసదారుల సంబంధాన్ని మారుస్తుందా. మహిళలు అన్వేషించడానికి ఎంచుకునే భౌగోళిక పరిధిని, ప్రాదేశిక పరిధిని కరోనా పరిమితంచేస్తుందా.
ప్రపచవ్యాప్తంగా 160 కోట్ల మంది వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ కార్మిక శక్తి లో ఇది సగ భాగం.
ఢిల్లీల్లోని ISBT బస్ స్టేషన్ వద్ద వలస కార్మికులు దేశవ్యాప్తంగా లాక్డౌన్ మధ్య ఇంటికి తిరిగి వెళ్ళడానికి పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అందులో మహిళలు చాలా తక్కువ మంది వున్నారు. ఉన్నవారు కూడా కుటుంబాలతో వున్నారు. వలసలకు ముఖం ఉంటే, అది మగవాడి ముఖమే వుంటుందా.
బాంద్రా స్టేషన్‌లో, ఢిల్లీ బస్‌స్టాండ్‌లో వలస వచ్చిన వారిని అందరూ మీడియాలో చూసే వుంటారు. అక్కడ మహిళలు ఎందుకు లేరు. కొవిడ్ 19 పరిస్థితి నేపథ్యంలో వలసలలో మహిళల ముఖాలు ఎందుకు కనబడలేదు. అత్యధిక వలసదారు ఎవరు. వలస వెళ్ళే మహిళల సంగతేంటి, అనే ప్రశ్నలు చాలా మందికి వచ్చే వుంటాయి.
మహిళలు కలిసి పనిచేసే కుటుంబ యూనిట్లలో వలస వెళతారు. ఒంటరి మహిళలు ఢిల్లీ, ముంబై, చెన్నై మహానగరంలో పనిమనుషులుగా పనిచేస్తున్నారు. సేవా రంగాల్లోని మహిళలు సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో పనిచేస్తారు. మహిళలు రెస్టారెంట్లలో వెయిట్రెస్, చెఫ్ లుగా పనిచేస్తారు. మహిళలు పెద్ద దుకాణాల్లో సహాయకులుగా పనిచేస్తారు. నిర్మాణ స్థలాలలో, ఇటుక బట్టీలలో పనిచేసే కుటుంబ యూనిట్లలోని వంటవారు, క్లీనర్లు గా మహిళలు పనిచేస్తున్నారు. వీరు కుటుంబాలతో కలిసే పని చేస్తున్నారు. ప్రపంచీకరణలో భాగంగా మహిళ ఇంటి నుండి బయటకు వచ్చింది. అంతమాత్రాన ఆమె ఉపయోగప విలువ లేని చాకిరి నుండి విముక్తి కాలేదు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు కూడా ఇంటి చాకిరి తప్పడం లేదు.
ప్రపంచ శ్రమ సరఫరా గొలుసులో అత్యల్ప స్థాయిలో ఉన్న కూలీ కార్మికుని చలన శీలత కేవలం పురుషులకే పరిమిత మైందనే ఆందోళన వుంది. తమ భర్తలు, పిల్లలతో నడుస్తున్నట్లు మీడియాకు మహిళలు కంటపడ్డారు. ఏది ఏమయినప్పటికీ, ఒంటరి మహిళలు వలస వచ్చినవారు మన రోజువారీ ఉనికిలో సర్వత్రా భాగమైనారు. కాని వీరి శాతం చాలా తక్కువ. అసలు ఒంటరి మహిళలను నగరాలకు తీసుకువచ్చేది ఏమిటి. గ్రామాల నుండి వచ్చిన మహిళా వలస కార్మికులు, నగరాల్లో చెల్లింపు ఉపాధిలో నిమగ్నమై ఉన్నారు. వలస ప్రక్రియలో మహిళలు సాంప్రదాయకంగా తమ భర్తకు తోడుగా పరిగణించబడుతున్నారు. చాలా మంది వలస మహిళలు తమ స్వంతంగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయంగా 2017 లో, 168 మిలియన్ల వలస కార్మికులలో, 68 మిలియన్లకు పైగా మహిళలు ఉన్నారు. ఇరవయ్యవ శతాబ్దం ఆరంభం నుండి మహిళా వలస కార్మికుల నిష్పత్తి పెరుగుతోంది. అయినా ఇది పురుషుల సగటు నిష్పత్తి కంటే చాలా తక్కువగా వుంది.
చాలా మంది మహిళా కార్మికులు అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి అధిక ఆదాయ దేశాలకు వలస వెళతారు. మహిళా వలస కార్మికులు ప్రతి సంవత్సరం తమ మాతృ దేశాలకు 300 బిలియన్ డాలర్ల చెల్లింపులను పంపుతారు. తరచుగా ఈ డబ్బును వారి కుటుంబాల ప్రాథమిక ఆరోగ్యం, గృహనిర్మాణం, విద్య అవసరాలకు చెల్లించడానికి ఉపయోగిస్తారు. స్థూల ఆర్థిక స్థాయిలో, వలస కార్మికుల నుండి పంపే డబ్బు జాతీయ స్థూల జాతీయోత్పత్తిలో 25% వరకు ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలకు వాణిజ్య లోటును, అప్పులను తీర్చడానికి మహిళలు సహాయపడు తున్నారు.
ఏదేమైనా, మహిళా వలస కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తమ గ్రామాలను విడిచిపెట్టవలసి ఉంటుంది. తరచూ వారి స్వంత కుటుంబాల నుండి వేరు చేయబడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి శ్రమ యొక్క అసమాన పంపిణీకి దారితీసింది. గమ్యస్థాన దేశాలలో, వలస మహిళలు గృహ సంరక్షణ కొరతను పరిష్కరించడంలో సహాయపడతారు. ఎక్కువ మంది స్థానిక మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తారు. మరోవైపు, తమ స్వంత ప్రాంతాలలో, పెద్ద సంఖ్యలో మహిళల వలసలు సమాజంలోని ఇతర సభ్యులపై ఎక్కువ గృహ పని భారాన్ని పెడుతుంది.
వారు సమాజం నుండి దాచబడ్డారు. దోపిడీ, దుర్వినియోగానికి ఎక్కువగా గురవుతారు. వివిధ రకాల ప్రభుత్వ విధానాలు, స్థానిక సమాజ సంప్రదాయాల వల్ల మహిళా వలస కార్మికుల దుర్వినియోగానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో, వలస వచ్చిన గృహ కార్మికులు చట్టపరమైన హోదా కోసం వారి యజమానులపై ఆధారపడతారు. దీనివల్ల కార్మికులు బహిష్కరణకు భయపడతారు. అనేక నగరాలు మహిళా వలస కార్మికుల లైంగిక సంబం దాలను, గర్భధారణకు
వ్యతిరేకిస్థాయి.
నగరాలు మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. అందువల్ల వారి ఇళ్ళల్లో పని కోసం ఒంటరి మహిళల వలసలు పెరుగుతున్నాయి. సేవా రంగం వృద్ధి పెరుగుతోంది. మధ్యతరగతి ఆర్థిక సంపద క్రమంగా తగ్గుతోంది. అందువల్ల స్త్రీ, పురుషులు ఉద్యోగాలు చేయాల్సిన తప్పనిసరి పరిస్తితి వచ్చింది.
మహానగరాల్లో జీవిత భాగస్వాములతో పనిచేసే న్యూక్లియర్ కుటుంబాలు సేవా రంగ విస్తృతిని పెంచాయు. ఇవి ప్రధానంగా సమాజంలోని అట్టడుగు ఆర్ధిక స్థాయిలో వున్న మహిళలకు కొద్దిపాటి భృతిని కల్పిస్తున్నాయి. విద్యావంతులైన మధ్యతరగతి మహిళలు శ్రామికశక్తిలో చేరుతున్నారు. సాంప్రదాయకంగా, సౌకర్యవంతంగా మహిళల పనిగా భావించే పిల్లల, వృద్ధుల సంరక్షణ, ఇంటి చాకిరీ కూడా అదనంగా పేద వర్గాల మహిళలపై పడుతోంది. వీరివల్ల మధ్యతరగతి మహిళలు వృత్తిని కొనసాగిస్తున్నారు.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) తాజా అధ్యయనం ప్రకారం, ఇప్పుడు దేశీయ ప్రజల అవసరాలు పెరిగాయి. సేవారంగం వృద్ది చెందింది. మధ్యతరగతి కుటుంబాలలో జరుగుతున్న బాధ్యతల సూక్ష్మ బదిలీ వలస
కారిడార్లును పెంచింది.
జార్ఖండ్ నుండి డిల్లీకి, ఢిల్లీ నుండి ఛత్తీస్ ఘడ్ కు, ఆంధ్ర, తెలంగాణ నుండి ముంబయికు, నేపాల్ నుండి కూడా వలస కారిడార్లు వెలిశాయి. దేశీయ సహాయ కాల్-సెంటర్ల, కాంట్రాక్టర్ల గొలుసు వ్యవసాయం లోని మిగులు ప్రజల శ్రమను వినియోగించు కుంటున్నాయి.
సమకాలీన మధ్యతరగతి ఉనికి, వీరి ఆధునిక జీవన విధానం ఆర్ధిక రంగంలో కొన్ని మార్పులు చేసింది. పెట్టుబడి తన లాభాల కోసం ఆధునిక ప్రజలను తయారు చేసింది.
మాల్స్, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్‌లు పెంచబడ్డాయు. మధ్యతరగతి ప్రవృత్తి మారింది. పబ్బులు, డిస్కోథెక్‌లలో వారాంతపు సెలవులను వారు గడుపుతున్నారు. సంపాయుంచిన దాంట్లో ఎక్కువ భాగం ఖర్చు చేసేలా వారి జీవిన గమనం మార్చబడింది. బారిస్టా, స్టార్‌బక్స్, కేఫ్, కాఫీ డే, మీట్-అప్‌లు, రెస్టారెంట్లలో వారి కుటుంబ సభ్యుల కలయిక నగరాల్లో వలసదారులకు అనేక ఉపాధి అవకాశాలను సృష్టించింది. మహిళలు చేస్తున్న అనేక ఉద్యోగాలలో ఎక్కువ భాగం వలస మహిళలను వారి సాంఘిక-ఆర్ధిక నేపథ్యం నుండి బయటకు తీసుకు వచ్చినవే. అయినా వలస పురుషుల సంఖ్య, మహిళల కన్నా ఎక్కువ పెరుగుతోంది.
పబ్లిక్ డొమైన్ ఎక్కువగా పురుష డొమైన్ల రూపంలో ఎక్కువుగా వుంది. సమాజంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువుగా వుంది. వలసలలోకి కొత్తగా ప్రవేశించే మహిళలు, ఇప్పటికీ పురుషులతో పోటీ పడవలసి వస్తోంది. మహిళలు ఒంటరిగా బయటి ప్రదేశాలలో ఉద్యోగాలకు ప్రయత్నించ కుండా వారి కుటుంబాలు నిరుత్సాహపరిచే అవకాశం ప్రస్తుత సమాజంలో ఎక్కువుగా ఉంది. వలస వచ్చిన మహిళలు నగరాల్లో ఎక్కడ వుంటున్నారు. వీరిపై లైంగిక వేదింపులు 90 శాతం వున్నాయి. ప్రభుత్వ విధానాలు వారి నిర్దిష్ట అవసరాలను తీర్చడం లేదు.
నగర స్థలాలను సురక్షితంగా, మహిళలకు రక్షణగా చేయడానికి ‘సేఫ్ సిటీ’ కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలచే ప్రారంభించ బడ్డాయి. అలాగే స్థానికుల మద్దతుతో, ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలుచేపడుతోంది. లింగ-వివక్ష తో కూడిన రవాణా విధానాలు వలస మహిళలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు.
పురుషులు, మహిళలు నగరాలలో సౌకర్యాలను ఒకే విధంగా అనుభవించరు. మహిళల నగర హక్కు కోసం చాలా పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్థిక, సామాజిక ఉద్యమాల ద్వారా నగరాలు కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి ఉద్యమాలు ఎక్కువ సంఖ్యలో మహిళలను బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకువస్తాయి. ఈ ఉద్యమాలు వలస మహిళలతో సహా ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహిస్తుంది. లింగ సమానతను సాధించడానికి కోవిడ్19 పరిస్థితి నేపథ్యంలో ఇటువంటి దృక్పథం అత్యవసరం.
వలస మహిళల సమస్యలపై ప్రతిస్పందించడానికి ప్రభుత్వానికి తీరుబాటు లేదు. లైగింక హింస పై వేగంగా పనిచేసే పోలీసు బృందాలు, మహిళల భద్రతా అవసరాలను అర్థం చేసుకునే రవాణా ఏర్పాట్లు వుండాలి. అన్ని చోట్ల చురుకుగా ఉన్న హెల్ప్‌లైన్‌లు వుండాలి. నిజానికి నగరాలు సౌందర్య వృద్దితో ఎదగాలంటే పెద్ద ఎత్తున మహిళల శారీరక శ్రమ అవసరం. అందుకే నగరాలు మహిళా వలసదారులకు రుణపడి ఉన్నాయి.
కోవిడ్ 19 నగరాలకు వలస వచ్చిన మహిళల శ్రమ సంబంధాన్ని మారుస్తుందా. మహిళలు అన్వేషించడానికి ఎంచుకునే భౌగోళికాలు, ప్రాదేశిక పరిధిని ఇది పరిమితం చేస్తుందా. మహిళలకు స్వేచ్ఛను అందించకపోతే ఎం జరుగుతుంది. ఈ ప్రాణాలను ఈ సంక్షోభం లో నైనా ప్రభుత్వాలు పట్టించు కోవాలి. మహిళలు ఉద్యోగం కోసం అన్వేషించడానికి మాత్రమే కాదు, ఇంటికి తిరిగి రావడానికి సురక్షితమైన నగరాలు కావాలి.
Very nice aman
ReplyDeleteNice article
ReplyDeleteVery nice article,
ReplyDeleteవెంకటేష్ కడప