కరోనా అనంతరకాలం


    
 కరోన ఉత్పాతం రోజురోజుకూ ప్రాణాంతకంగా మారుతోంది. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని విధంగా దాని జీవ ప్రక్రియను(MUTATION)
మార్చుకొంటూ, పోతోందని చెప్తున్నారు. దానివలన చైనాలో ఒకరకంగా, యూరప్ లో మరో రకంగా,మనదేశంలో ఇంకొక రకంగా కనిపిస్తున్నది దాని తీరు.ఈ మార్పులవల్ల 'వ్యాక్సిన్' తయారీ కూడా సంక్లిష్టంగా మారిందిని కొందరు శాస్త్రవేత్తల భావన.ఇది ఇప్పట్లో మనల్ని విడిచి పెట్టదని కొంతమంది అభిప్రాయం. *లాక్డౌన్* ఇంకో మూడు వారాలో లేదా మూడు నెలల్లోనో తొలగి పోవచ్చు.కానీ *కరోనా* భయం మాత్రం కొన్ని సంవత్సరాలపాటు ప్రజల్ని వెంటాడుతూనే వుంటుందని మరికొందరి అభిప్రాయం.
     ఏదిఏమైనా *కరోన అనంతర కాలం* లో ప్రజా జీవనం ఎట్లా ఉండబోతోంది? సామాజిక పరిస్థితుల్లో వచ్చే మార్పులేమిటి? అనేది అనేక మందిని తొలుస్తున్న ప్రశ్న.ఇప్పటి వలే ఉండబోదనేది కొంతమంది వాదన. మానవ సంబంధాలలో,ఆర్ధిక కార్యకలాపాలలో,ఆధ్యాత్మిక చింతనలో,మానసిక పరిస్థితిలో,జీవనశైలిలో, ఆరోగ్యభయంలో,సామాజిక ఉద్యమాలలో,ప్రజా ఉద్యమాల వ్యూహం-ఎత్తుగడలలో పెనుమార్పులు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయని సామాజిక విశ్లేషకుల అంచనా.
    సామూహిక జీవనం మనకిష్టమైన జీవనశైలి.ఎప్పుడూ పది మందితో కలసి ఉఃడాలని కోరుకోవడం మన నైజం. కిక్కిరిసి ఉండే బస్టాండ్ లు,రైల్వేస్టేషన్ లు,విమానశ్రయాలు,మనకిష్టం. సినిమా హాల్స్,షాపింగ్ మాల్స్ కు వెళ్ళడానికి ముచ్చట పడతాం.కానీ ఇకముందు ఆ పరిస్థితి ఉంటుందా.....?
బస్సు ఎక్కితే పక్కవాడిని తాకాలంటే భయం.,రోడ్లో వెళుతుంటే పక్కనెవరైనా తుమ్మితే ప్రాణాలు పిడికిట్లోకి వచ్చేస్తాయి. మాంసం కొనాలంటే అనుమానం, సినిమాకు వెళితే ఏమౌతుందో.....? 
సామూహిక ప్రయాణాలకు వీలయినంత దూరంగా ఉంటారన్నది నిపుణుల అంచనా.ఎప్పుడూ పది మందితో కళకళ లాడే ఇల్లంటే ఒక గుర్తింపు. ఇక మీదట ఎవరికి వారే గిరి గీసుకొని అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన దుర్భర స్థితి. అపార్టమెంట్ల నివాసం పట్ల ప్రజలు విముఖులు కావచ్చు. ఊరికి దూరంగానైనా విడి విడి ఇళ్ళలో నివసించడానికే ఇష్టపడతారు. బస్సులు, రైళ్లు, విమానాలు,పర్యాటక కేంద్రాలు,విహారయాత్రలు,టూరిస్టు కేంద్రాలు, హోటళ్లు,రెస్టారెంట్లు, సినిమాహాళ్ళు,షాపింగ్ మాల్స్,పబ్ లు......ఇలాంటి వెన్నో సంక్షోభంలో కూరుకపోవడం ఖాయం.కొన్ని కోట్లమంది ఉపాధి కోల్పోవడం, దాదాపు 30 కోట్లమంది అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం కాబోతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ప్రకారం దాదాపు 40 కోట్లమంది మరింత పేదరికం లోకి నెట్టవేయబడతారు.నిరుద్యోగం, ఆకలి కేకలు, నేరాలు.....ఇలా తలచుకొంటే భవిష్యత్తు భయంకరంగా ఉండబోతున్నది. వీటిని పరిష్కరించే విధానాలు పాలకులకు లేకపోవడం మొత్తంమీద సామాజిక, ఆర్ధిక సంక్షోభం, వైరుధ్యాలు తీవ్రమవడం ఖాయమని నిపుణుల అంచనా.
   ఈ భూమిని తొమ్మిది సార్లు ధ్వంసం చేయగల ఆయుధ సామాగ్రి మనదగ్గర ఉన్నది గానీ, మనిషి జీవితాన్ని నిలపడానికి అవసరమైన వెంటిలేటర్లు కావలసినన్ని లేవు.అభివృద్ధి చెందిన దేశాల *క్యాపటలిస్ట్ ఆర్ధిక వ్యవస్థల్లోని* డొల్లతనాన్ని బయట పెట్టింది కరోన. అభివృద్ధి అనే ముసుగు క్రింద ఆకలి కేకల్ని సమాధి చేస్తున్న దృశ్యాల్ని HD.క్వాలిటీ లో చూస్తోంది ప్రపంచం.మంది సొమ్మును కొద్దిమందికి దోచి పెట్టే పాలక వర్గాల విన్యాసంలోని వికృత కోణం తేటతెల్లమైంది. కోట్లమంది కష్టాన్ని కొద్దిమంది తింటున్నతీరు ఇపుడు మన కళ్ళముందు కనిపిస్తుంది. ఈ విపత్తు సమయంలో వివిధ దేశాల్లో వినిపిస్తున్న ఆకలి కేకలు,రోడ్లపొడవునా కనిపిస్తున్న వలసకూలీలు, నడివీధుల్లో పడివున్న శవాలు దేనికి నిదర్శనం?.
    *నింగికి నిచ్చెన వేసే ప్రయత్నంలో నేలను వదిలేసిన తీరుకు* పెట్టుబడిదారీ ప్రపంచం మూల్యం చెల్లిస్తోఃది. లాక్డౌన్ ప్రకటించిన 24 గంటల తర్వాత పుట్ట పగిలి చీమలు బయటకు వచ్చినట్లు నగరాల్లో వరద మొదలైంది.లక్షలమంది వలస కూలీలు కుటుంబాలతో రోడ్లమీదకొచ్చారు. నగరాల్లో పనిలేదు, ఊరెళదామంటే బస్సుల్లేవు.  వందల కిలోమీటర్లు నడచి వెళ్ళేందుకు బయలు దేరిన తీరు దేశాన్ని వణికించింది. ఇదేనా 75 సంవత్సరాలుగా మనం సాధించిన అభివృద్ధి?. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనే తేడాలేకుండా అధికారంలో ఎవరు ఉన్నా ప్రజల కష్టాన్ని కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారని మరోసారి తేటతెల్లమైంది. దేశంలో ని తొంబై శాతం ప్రజల సంపద ఒక్క శాతంగా వున్న పెట్టుబడిదారుల చేతుల్లోకి చేర్చడానికే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్న చేదు నిజం కళ్ళముందు *గజ్జి కట్టి ఆడుతున్నది.* ప్రజల సంక్షేమానికి ఉపయోగ పెట్టాల్సిన విలువైన ఖనిజ వనరులను పోటీపడి మరీ  పారిశ్రామిక వేత్తలకు,కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ, పర్యావరణాన్ని,జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఆదివాసీ ప్రాంతాలలో లక్షల సైన్యాన్ని పంపి ఎన్ కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించే మేధావులను, హక్కుల కార్యకర్తలను *దేశద్రోహులుగా, అర్బన్ నక్సలైట్లు* గా చిత్రీకరించి జైళ్ళపాలు చేస్తున్నారు. ఏటా కోట్లమందిని పేదరికం నుంచి బైట పడేశామని చెప్పుకొంటున్న గొప్పలు తప్ప సాధించిందేమీ లేదని నిరూపించింది వలస కూలీల వ్యవహారం. వలస కూలీలు బయలుదేరిన నగరాలలోనే కొద్దిమంది సంపన్నులు తమ విలాసవంతమైన భవనాలలో సేదతీరుతున్న తీరు,- దేశంలో విఫలమైన పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలకు నిదర్శనంగా నిలుస్తోంది."కారల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ లో  చేసిన హెచ్చరికలే" ఇపుడు చూస్తున్నాం. పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలు మెజారిటీ ప్రజలకు ఏమీ చేయలేక పోతున్నాయని ప్రముఖ ఆర్ధిక వేత్త "రఘురాం రాజన్" ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం.
*సంపన్నుల ప్రయోజనాల కోసం సాగిలపడ్డ క్యాపిటలిస్టు ఆర్ధిక విధానాలను మార్చుకోవాల్సిన సమయం ఇపుడు ఆసన్నమైందా...?* అని విశ్లేషకుల అంచనా.
       వాస్తవానికి ప్రఖ్యాత రచయిత 'నౌమీక్లీన్' అన్నట్లు ఇటువంటి సామాజిక ఉత్పాతాలు వచ్చినప్పుడు పాలక వర్గాలు తమ భావజాలాన్ని ఏమాత్రం వదులుకోక పోగా మరింత గట్టిగా అంటి పెట్టుకుంటాయి.ఇంతటి ఉత్పాతం లో కూడా అవి తమ వర్గ ప్రయోజనాల మీద, భవిష్యత్ లాభాల మీద, దృష్టి పెడుతూ ఇంతకాలం అణచి పెట్టుకున్న 'అత్యాశలను' కూడా అమలు జరిపేందుకు దీన్ని అవకాశం గా ఉపయోగించుకుంటాయి. ప్రపంచ మంతటా 'మాంధ్యం' ముసురు కుంటున్న సమయంలో తమ లాభాల వాటాలను కాపాడు కోవడానికి కంపెనీలు తమ కార్మీకులను,ఉద్యోగుల ను ఉద్యోగాలనుంచి తొలగించి, తక్కువ మంది కార్మికుల తో ఎక్కువ పని గంటలు పనిచేపించి మరింత శ్రమ దోపిడీకి తెర లేప బోతున్నాయి. ఒక్క అమెరికా లోనే గత రెండు నెలల్లో  కోటీ ఎనబై లక్షల మంది కొత్తగా *నిరుద్యోగ భృతి* కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. 1929-30 నాటి మహా సంక్షోభం తర్వాత అంతటి సంక్షోభం రావడం ఇప్పుడే. 14 వ శతాబ్ది లో యూరప్ లో *ప్లేగు* వ్యాధితో నాటి జనాభా లో మూడోవంతు చనిపోయారు.ఆనాటి సంక్షోభం *బూర్జువా ప్రజాస్వామ్య విప్లవాలకు* దారితీసినవిషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
     గత సంవత్సరం 2019 ఒక గొప్ప నిరసన ప్రదర్శనల *ఉద్యమాల సంవత్సరం*. దేశవ్యాప్తంగా CAA.కు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి. కరోనా సాకుతో పాలక వర్గాలు ఈ ఉద్యమాలన్నింటినీ ఆపి వేయడంలో విజయం సాధించాయి. *"షాహిన్ భాగ్"* లాంటి నిరసనలకు ఎలా ముగింపు పెట్టారో మనకు తెలుసు. ఇంతటి భారీ స్థాయి ఉధ్యమాలు 'కరోనా'సాకుతో మరణించడం 'కరోనా' మరణాలకన్నా తక్కువేమీ కాదు. "సామ్రాజ్యవాదం-హిందూ మతోన్మాదం" కలసి *ఫాసిజం* గా , మరింతగా ప్రజలపై విరుచుకపడే ప్రమాదం పొంచి వుంది."కరోనా అనంతర దేశం" లో  అదృశ్యమవుతున్న హక్కులను,కాపాడు కోవడం, *జీవిఃచే హక్కు కోసం* ఉద్యమించడం ప్రజల కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ప్రజలు గుర్తించే విధంగా వారిని చైతన్య పరచడం ప్రజాసంఘాల, ఉద్యమ సంఘాల బాధ్యత. సామాజికంగా నే కాదు, మనల్ని మనం ఆర్ధికంగా సంస్కరించుకొనేందుకు ఇదొక అత్యుత్తమ సందర్భం.
      మనదేశంలో అద్భుతమైన గ్రామీణ వ్యవస్థ,కుటీర పరిశ్రమలు,స్థానికంగా అద్భుతమైన మార్కెట్ వున్నా, *ప్రపంచీకరణ* మోజులో పడి ఇల్లూ-వళ్ళూ గుల్ల చేస్తున్నారు మన పాలకులు. భారతీయ ఆర్థిక సాంప్రదాయ మూలలను మరచి "నేల విడిచి సాము చేయటం వలన"ఏర్పడిన కష్టాలకు ఫలితాలు అనుభవిస్తున్న ది నేటి తరం. ఈ సంక్షోభం ప్రపంచానికి అద్భుతమైన పాఠాలు నేర్పుతున్నది. పదే-పదే విఫలమౌతున్న ఆర్ధిక విధానాలను వదిలేసి *స్వావలంబన* దిశగా అడుగులు వేయాలనీ,ఆర్థిక విధానాలను మార్చుకోక పోతే  *అధోగతి* తప్పదని హెచ్చరిస్తున్నాయి. జాతీయ పరిశ్రమలను,వ్యవసాయాన్నీ,ప్రకృతి వనరులను కాపాడుకుంటూ, ప్రకృతిలో భాగంగా జీవిస్తూ, ప్రకృతి ని చెరబట్టి , పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న *"బహుళజాతి కరోనా కంపెనీల"* దోపిడీకి వ్యతిరేకంగా విశాల ప్రజానీకాన్ని సంఘటితం చేసి, బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయడం ప్రజాసంఘాల ముందున్న చారిత్రక కర్తవ్యం. అందుకు ఆదివాసీ సమాజమే మన ముందున్న ప్రత్యక్ష ఉదాహరణ. *స్వయంపాలన-స్వయంపోషణ-స్వావలంబన దిశగా ఆదివాసీ సమాజంలో జరుగుతున్న ప్రయోగం,సాధిస్తున్న ఫలితాలు, సమాజంలో వస్తున్న పరివర్తన ఈరోజు ప్రపంచం ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం.* 

- ఎల్లంకి వెంకటేశ్వర్లు

Comments