ప్రభుత్వం ఏ పాలసీ విధానమైన చేపట్టబోయే ముందు పేదోడి ముఖాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని మహాత్మా గాంధీ, పాలకులకు హెచ్చరిక గా చూసించాడు. ఈ సామాజిక సూత్రాన్ని అతిక్రమించడం వల్ల ఆ పాలసీ విధాన చక్రాల కింద నలిగి పోయేది పెడవాడే. కరోన వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పాలసీ విధానాల వల్ల లక్షలాది మంది వలస కూలీల బతుకులు విలవిల్లాడుతున్నాయి. కరోన వైరస్ ను ఎదుర్కోవడానికి యావత్ దేశ ప్రజలను ఇళ్లలోనే కట్టిపడేశారు.
ప్రస్తుతానికి ఈ విదానమొక్కటే ఏకైక మార్గం గా అమలు చేస్తున్నారు. కరోన బారిన పడిన చాలా దేశాలు ఈ విధానాన్ని పాటించడం లేదు. ఈ విషయం లోనైన మన దేశం చాలా ఆలశ్యం గా కళ్ళు తెరిచింది. అప్పటికే జరిగే నష్టం జరిగి పోయింది. ముందే మేల్కొంటే ఇంత నష్టం జరిగేది కాదు. పొరుగు దేశం ఈ వైరస్ కోరల్లో చిక్కుకొని పెనుగులాడుతుంది. కరోనా సరిహద్దులు దాటి మన దేశం లో ప్రత్యక్షమైనపుడు మాత్రమే పాలకులు కళ్లు తెరిచారు. గత డిసెంబర్ లో తన ఉనికిని చాటిన ఈ వైరస్ చైనా లోని ఊహన్ నగరాన్ని రెండు నెలలకు పైగా గజగజ లాడించి ప్రపంచాన్నే చంపేస్తానని సవాలు విసిరింది.
ఈ సవాలును భారత ప్రభుత్వం లెక్కచేయలేదు. అప్పుడే విదేశీ రవాణా మార్గాలను దిగ్బంధం చేయ లేదు. ప్రయాణికులను క్వారంటైన్ చేయ లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఈ నిర్లక్షానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నది. భారత్ లో ఉష్ట్నోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఆ వైరస్ ఇక్కడ మలమల మాడి చస్తుందని ప్రజలకు ఏమి కాదని భరోసా తో ఉన్నారు. కానీ అదే వైరస్ ఇప్పుడు దేశం లో విలయ తాండవం చేస్తోంది. పరిస్థితి ఊహించుకుంటూనే భయంగొల్పుతుంది.
ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భారత్ లో జన సాంద్రత అధికం కనుక ఈ వైరస్ ఇంకా విజృంభిస్తే 30 కోట్ల మంది ఈ వైరస్ తో బలిగొనే ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
ప్రస్తుతం దేశం లో 130 కోట్లకు పైబడిన జనాభాకు అందుబాటులో వైద్యుల సంఖ్య కేవలం ఏడున్నర లక్షలు మాత్రమే. ప్రతి 1424 మందికి అందుబాటులో ఉన్న వైద్యుడు ఒక్కరే. వేరే దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ . ఒకవైపు పెరువుతున్న జనాభాకు ధీటుగా వైద్యుల సంఖ్య పెంచుకోవడంలో దేశం ఘోరంగా విఫలం అయింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం దేశానికి 20 లక్షల మంది డాక్టర్లు ,40 లక్షల మంది నర్సులు అవసరం. మరో వైపు దేశం లో వైద్య రంగానికి కావలసిన మౌలిక సదుపాయాలు లేవు.
వైద్య కళాశాల కొరత, బోధన సిబ్బంది కొరత, ఆసుప్రతుల కొరత ఆందోళనకరంగా ఉంది. ఈ నేపద్యంలో కరోన వైరస్ మూడో స్టేజి కి చేరుకుంటే ఆపతరమౌతుం దా అని పాలకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత జుగుప్సాకరం గా ఉంటాయో పాలకుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. అందుకని అందుబాటులో ఉన్న లాక్ డౌన్ పద్దతిని ఉన్న ఫలంగా మార్చ్ 23 న ప్రకటించారు.
దేశ ప్రజలందరినీ ఇళ్లల్లో కిక్కురు మనకుండా ముడుచుకోమన్నారు. కానీ ఇల్లే లేని వారి గురించి పట్టించుకోలేదు. నిరాశ్రయులు , అనాధలు, దిక్కు లేని వాళ్ళు , యచకులు, కూలీలు, వలస కూలీల గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. విధాన ప్రకటనకు ముందు కావాల్సినంత ముందు జాగ్రత్త చర్యలు తీసు కోలేదు. దేశమంతా ఒక్కసారిగా నిటారుగా నిలిచి పోతే రెక్కాడితే కానీ డొక్కాడని కష్ట జీవులు గతేంటని ఎవరు ఆలోచించలేదు. ఈ కోవకు చెందినవాళ్ళు ఢిల్లీ లో 63 లక్షల మంది హైదరాబాద్ లో 10 లక్షల మంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వం దృష్టి లో పడనివాళ్ళు. కనుక ప్రభుత్వ ఆదరణ కరువై దిక్కుతోచని స్థితిలో ఇంటి బాట పట్టారు. రవాణా మార్గాలు .మూసుకుపోవడంతో పిల్లలను చంకన వేసుకుని, మూటలు వీపున కట్టుకుని వందల వేల కిలోమీటర్లు కాలినడకన గుంపులు గుంపులుగా సాగిపోతున్నారు. స్వతంత్ర భారతం లో మోదీ సృష్టించిన మొదటి అతి పెద్ద వలస కూలీల తిరుగు బాట ఇది. ఈ ప్రస్థానం లో ప్రజలు నడవలేక ప్రాణాలు కోల్పోతున్నారు.
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా, నీడం తాలూకా, ఇటుకాల గ్రామానికి చెందిన అలిసాబ్ (65) హైదరాబాద్ లో హోటల్ లో పనిచేస్తున్నాడు. హోటల్ బంద్ పెట్టడంతో ఇంటి బాట పట్టాడు. పరిగి వరకు చేరుకునే సరికి ఆకలి దప్పికతో ప్రాణాలు కోల్పోయాడు. కరోన చావు తప్ప కాలినడక చావులను ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. పిల్లలు కాళ్ళ నొప్పులతో, ఆకలితో, పేగులు మెలి పెడుతుండగా సొమ్మసిల్లి పడిపోతున్నారు. వీరున్న ఊరిలో ఉపాధి కరువై, కుటుంబ పోషణ బరువై నగరాలు చేరుకున్నారు.
ఇప్పుడు అదే ఊరికి తిరుగు బాట పట్టారు . అక్కడ చనిపోయినా అయిన వారి మధ్యన హాయిగా చనిపోవచ్చు అని ఒకే ఒక్క ఆశతో వందల కిలోమీటర్లు లెక్క చేయకుండా నడుస్తున్నారు. ఆపద వచ్చి నపుడే తన వాల్లెవరో, పరాయి వాళ్ళెవరో తేలిపోతుంది, ఈ గడ్డు కాలంలో గవర్నమెంట్ తనది కాదని గట్టిగానే తేలిపోయింది. దానికి తోడు దారి పొడవునా పోలీసులు దౌర్జన్యం దుర్లభంగానే ఉంది. బొంబాయిలో పనిచేస్తున్న 420 మందికి పైగా ఉత్తరప్రదేశ్ కార్మికులు ఒక ట్రక్కులో దాక్కుని తమ సొంతూరికి వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని మానసిక వేదనకు గురిచేశారు. ఈ ప్రభుత్వాలు అణగారిన ప్రజలను హింసించకుండా బ్రతకనిస్తాయా. అద్భుతమైన ఆధునిక ఆర్థికాభివృద్ధికి ఏ దిక్కు మొక్కు లేని వలస కార్మికులే కారణమని ప్రభుత్వాలకు తెలియవా. వీరి చౌక శ్రమ కార్పొరేట్ లకు కోట్ల లాభాలను గడించి పెడుతుంది. గనుల్లో, క్వారీల్లో, ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో 12 కోట్ల మంది వలస కార్మికులు పెట్టుబడిదార్ల లాభాల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ను అవసరమైన ఎత్తుగడగా గుర్తించాలి.
అయితే ఓ చిన్న ప్రాణాంతక రోగాన్ని నాశనం చేయడానికి మానవాళి వద్ద మందులు లేవు. శాస్త్ర సాంకేతిక పరంగా ప్రపంచం ఎంత వెనకబడిఉందొ నిగ్గు తేలింది. మనం సాధించాలనుకున్న వైద్య విధాన ప్రగతికి సవాలు విసిరింది. వైద్య పరమైన పరిశోధనలపై యావత్ ప్రపంచం దృష్టి సారించాలి. కరోన ప్రపంచాన్ని కబలించిన తర్వాత సి-20 దేశాలు 5 ట్రిలియన్ డాలర్లు (5 లక్షల కోట్ల డాలర్లు) ఖర్చు చేయడానికి కేటాయించారు.
గడిచిన మాసంలో వైరస్లు, అంటువ్యాధులు ఈ భూమి మీద ప్రబలుతూనే ఉన్నాయి. వీటిని శాశ్వత ప్రాతిపదికన ఎదుర్కోవడానికి అవసరం అయిన ఔషధాలు, టీకాలు కనుక్కోవడానికి నిధులు ప్రపంచ దేశాలు సమకూర్చాలి. చైనా, అమెరికాలపై మరింత బాధ్యత ఉంది. ఇరు దేశాల నేతలు ఇప్పుడిపుడే సూటిగా మాట్లాడుకుంటున్నారు. ఇక పరిశోధనల దిశగా కదలాలి. మరోవైపు ప్రజల రోగ నిరోధక శక్తి పెంచడానికి కావాల్సిన చర్యల కోసం నిధులు కేటాఇంచాలి. కల్తీ ఆహార పదార్థాల సరఫరాపై కఠినంగా వ్యవహరించాలి.
వలస కూలీలు ఇంటి బాట పట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం కదిలి లక్షా 70 వేల కోట్ల రూపాయలు ప్యాకెజిని ప్రకటించింది. ఎందుకంటే ప్రజలను బెదిరించి అయినా, పోలీసులు లాఠీలను ఝలిపించయినా లాక్ డౌన్ చేయించొచ్చు. కానీ వారికి సహజంగా ఏర్పడే అవసరాలను, ఆకలి దప్పులను లాక్ డౌన్ చేయలేరు. అవి తీరకపోతే ప్రజల్లో ఉండే ఆగ్రహ ఆవేశాలను లాక్ డౌన్ చేయడం అంతకంటే కష్టమని గ్రహించిన తర్వాతనే ప్యాకెజిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది పైన తెలిపిన వర్గాల వారికి చేరలేదు. ఉన్న చోటనే ప్యాకెజి అందితే పొట్ట చేత పట్టుకొని సొంతూరు బాట పట్టరు కదా. ప్యాకెజి గడప దగ్గర ఉన్న వాళ్ళకు అందుతుందేమో కానీ దూరంగా ఉన్న వాళ్ళ సంగతేంటి. ఆ కరోన వైరస్ అంటే ఏమిటో తెలియదు. అది కబళించే మాటేమోగాని ఈ లోగా ఆకలి మంటలు బలిగొంటాయని భయంతో పుట్టిన గడ్డకు చేరుకోవలనుకుంటున్నారు.
ఇక్కడ దిక్కు లేని చావు కన్నా అక్కడ చనిపోతే అంత్యక్రియలన్నా అయిన వారి మధ్య గౌరవంగా జరుగుతాయని ఆశిస్తున్నారు.
ఒక యుద్ధం సంభ విస్తే ఆయా దేశాల శక్తి సామర్త్యాలు బయటపడతాయి. ఇలాంటి ప్రాణాంతక వైరస్ బయట పడినప్పుడు ఆరోగ్య అంశాలతో పాటు, అసమ ఆర్ధిక పరిస్థితులు తెర మీదకు వస్తాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు వీటన్నిటికీ జవాబుదారి కావాలి. ప్రభుత్వాలు అమలు పరుస్తున్న విధానాలు అట్టడుగు ప్రజలు జీవన వైరుద్యాలను ప్రభావితం చేస్తాయి.
తమ దేశం నుండి కరోన వైరస్ను విజయవంతంగా తరిమికొట్టిన చైనా ఇలాంటి సున్నిత సమస్యలను పరిష్కరించి తమ పౌరులను కాపాడుకుంది. చైనా చొరవను ఆదర్శంగా తీసుకోవాలి. సొంతూర్లకు కాలినడకన బయల్దేరిన వాళ్ళను మార్గ మధ్యలో నిలువరించి క్వారన్ టైన్ లలో బంధించడం అమానుషం. .
ఇప్పటికైనా ఒక భయంకర వ్యాధి పై పోరాటం చేసేటప్పుడు ప్రజలను ఇళ్లలో కట్టిపడేస్తే. సరిపోదు. తీవ్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే జీవన సంఘర్షణల్లోకి మానవీయ మనసుతో తొంగిచూ డాలి. ఆ సమస్యలను పరిష్కరించనపుడే సాఫల్యత, సంపూర్ణత ఉంటుంది.
- గడ్డం లక్ష్మణ్
Comments
Post a Comment